వచ్చే ఏడాది తిప్పలే..

ABN , First Publish Date - 2022-12-16T00:42:03+05:30 IST

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘు రామ్‌ రాజన్‌ మరోసారి మోదీ సర్కార్‌పై పరో క్ష విమర్శలు గుప్పించారు...

వచ్చే ఏడాది తిప్పలే..

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘు రామ్‌ రాజన్‌ మరోసారి మోదీ సర్కార్‌పై పరో క్ష విమర్శలు గుప్పించారు. వృద్ధికి దోహదం చేసే సంస్కరణలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు భారత్‌తో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వచ్చే ఏడాది తిప్పలు తప్పవన్నారు. భారత జీడీపీ వృద్ధిరేటు ఐదు శాతానికి చేరినా గొప్పేనన్నారు. రాజస్థాన్‌లో భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న సందర్భంగా రాజన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌తో చితికి పోయిన చిన్న, మధ్య తరహా కంపెనీల (ఎస్‌ఎంఈ) అభివృద్ధికి అనువైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సుస్థిర ఇంధ నం కోసం హరిత ఇంధనంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

మధ్యతరతికే కష్టాలు: కొవిడ్‌తో ఎగువ మధ్యతరగతి ఆదాయాలు మరింత పెరిగితే కింది మధ్యతరగతి ప్రజలు మాత్రం దారుణం గా నష్ట్టపోయారని రాజన్‌ చెప్పారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలు, సంస్కరణలు వీరి ఆదాయాలు పెంచేలా ఉండాలని సూచించారు. సేవల రంగంలో విప్లవం ద్వారా మన దేశం సూపర్‌ పవర్‌గా ఎదిగే అవకాశం ఉందన్నారు. ఈ విప్లవం ద్వారా మన దేశ నిపుణులు అమెరికా వెళ్లకుండా, ఇక్కడి నుంచే ఆ దేశ కంపెనీలకు సేవలు అందిస్తూ పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం ఆర్జించి పెట్టే అవకాశం ఉందని రాజన్‌ అన్నారు.

వృద్ధి జోరు ఆగదు : క్రెడిట్‌ సూయిస్‌

క్రెడిట్‌ సూయిస్‌ మాత్రం వచ్చే ఏడాది కూడా భారత జీడీపీ వృద్ధిరేటుకు ఢోకా ఉండదని తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం వరకు వృద్ధిరేటు నమోదు చేస్తుందని పేర్కొంది. దీంతో సెన్సెక్స్‌, నిఫ్టీ ప్రస్తుత స్థాయి నుంచి 14 శాతం మేర పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

Updated Date - 2022-12-16T00:42:09+05:30 IST