అప్పటిదాకా డీల్ ముందుకు కదలదు .. Twitter సీఈవోకు Elon Musk అల్టిమేటం

ABN , First Publish Date - 2022-05-17T22:18:29+05:30 IST

ట్విటర్ ( Twitter) కొనుగోలు ఒప్పందంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు ఓ అల్టిమేటం విధించారు.

అప్పటిదాకా డీల్ ముందుకు కదలదు .. Twitter సీఈవోకు Elon Musk అల్టిమేటం

టెక్సాస్: ట్విటర్ (Twitter) కొనుగోలు ఒప్పందంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon musk) మరో ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఒప్పందం ముందుకు వెళ్లే విషయంలో ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌(Parag Agrawal)కు ఓ అల్టిమేటం విధించారు. ట్విటర్ యూజర్లలో స్పామ్ బొట్స్ అకౌంట్స్ లేదా నకిలీ అకౌంట్ల సంఖ్య 5 శాతం కంటే తక్కువగా ఉన్నట్టు ఆధారాలు చూపించకపోతే 44 బిలియన్ డాలర్ల విలువైన డీల్ ముందుకు కదలదని తేల్చిచెప్పారు. ట్విటర్ ఎస్‌ఈసీ(అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్) ఫైలింగ్ ఆధారంగా 44 బిలియన్ డాలర్ల ఆఫర్ ఇచ్చాను. కానీ నిన్న(సోమవారం) ట్విటర్ సీఈవో స్పామ్ అకౌంట్లు 5 శాతం కంటే తక్కువగా ఉన్నాయని నిరూపించే ఆధారాలు ఇవ్వలేదన్నారు. ట్విటర్ తెలిపిన సంఖ్య కంటే 4 రెట్ల స్పామ్ అకౌంట్లు ఎక్కువగా ఉన్నాయని ఎలాన్ మస్క్ అనుమానం వ్యక్తం చేశారు. ఇంకా ఎక్కువే ఉండే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.  5 శాతం కంటే తక్కువగా ఉన్నాయని నిరూపించమంటే ట్విటర్ సీఈవో బహిరంగంగానే తిరస్కరించారు. ఆధారాలు చూపించేవరకు ఈ ఒప్పందం ముందుకు సాగదని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.


కాగా స్పామ్ అకౌంట్లు లేదా నకిలీ అకౌంట్లకు సంబంధించిన వివరాలు అందించే  వరకు దాదాపు రూ.3 లక్షల కోట్లకుపైబడిన ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు గతవారమే ఎలాన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్ర్రస్తుతం స్పామ్ అకౌంట్లు 20 శాతం వరకు ఉంటాయని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ ట్విటర్ మాత్రం 5 శాతంగానే ఉంటాయని అధికారిక ప్రకటనలో పేర్కొంది. కాగా 20 శాతం స్పామ్ అకౌంట్లు కలిగివున్న ట్విటర్ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం వ్యర్థమని మస్క్ అభిప్రాయపడుతున్నారని, తక్కువ ధరకు అడగాలని చూస్తున్నారని సోమవారం కొన్ని రిపోర్టులు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ స్పందించారు.


సోమవారం ఓ సమ్మిట్‌లో ఎలాన్ మస్క్ మాటలు కూడా ఈ కోణాన్ని సమర్థించేలా ఉన్నాయి. చెప్పినదానికంటే చెత్తగా ఉన్నదానికి అదే ధర పెట్టలేం కదా అని వ్యాఖ్యానించారు. అంతేకాదు రోజువారీ యూజర్లలో 90 శాతం వరకు స్పామ్ అకౌంట్లు ఉన్నా ఆశ్చర్యపోవాల్సింది లేదన్నారు. కాగా ఎలాన్ మస్క్ ప్రకటనలతో ట్విటర్ షేర్ల విలువ సోమవారం మరోసారి దారుణంగా పతనమైంది. 8 శాతానికిపైగా నష్టాన్ని చవిచూశాయి.

Updated Date - 2022-05-17T22:18:29+05:30 IST