ASCI: విద్యారంగంలో ప్రకటనల ఉల్లంఘనలు అధికం: ఏఎస్‌సీఐ
ABN , First Publish Date - 2022-11-17T21:22:39+05:30 IST
అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) తన అర్ధ వార్షిక (ఏప్రిల్-సెప్టెంబర్) ఫిర్యాదుల నివేదికను తాజాగా విడుదల చేసింది. ఏఎస్‌సీఐ మార్గదర్శకాలను
న్యూఢిల్లీ: అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) తన అర్ధ వార్షిక (ఏప్రిల్-సెప్టెంబర్) ఫిర్యాదుల నివేదికను తాజాగా విడుదల చేసింది. ఏఎస్‌సీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టుగా భావిస్తున్న 2,764 వాణిజ్య ప్రకటనలపై 3,340 ఫిర్యాదులను ప్రాసెస్ చేసింది. వీటిలో 55 శాతం డిజిటల్ రంగంలో వచ్చినవి కాగా, 39 శాతం ప్రింట్‌లో, 5 శాతం టీవీల్లో వచ్చినవి ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఫిర్యాదుల సంఖ్య 14 శాతం పెరగడం గమనార్హం. అలాగే, ప్రాసెస్ చేసిన ప్రకటనల సంఖ్యలోనూ 35 శాతం పెరుగుదల చోటుచేసుకుంది. ఇక, ఫిర్యాదుల్లో 27 శాతం విద్యారంగానికి చెందినవి కావడం గమనార్హం. ఫలితంగా అత్యధిక ఉల్లంఘనలు చోటుచేసుకున్న రంగంగా ఇది నిలిచింది. వీటిలో 22 శాతం క్లాసికల్ ఎడ్యుకేషన్ విభాగానికి, 5శాతం ఎడ్‌టెక్ రంగానికి సంబంధించినవి. దీని తర్వాతి స్థానంలో పర్సనల్ కేర్ (14 శాతం), ఆహార పానీయాలు (13 శాతం), ఆరోగ్య సంరక్షణ (13 శాతం), గేమింగ్ (4శాతం) ఉన్నాయి. ప్రాసెస్ చేసిన ప్రకటనల్లో 65 శాతం సుమోటోగా తీసుకున్నవే.
వినియోగదారుల ఫిర్యాదుల విషయానికి వస్తే 98 శాతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫిర్యాదుల వ్యవస్థ టీఏఆర్ఏ ద్వారా వచ్చినవే. ఇక, మొత్తం ఫిర్యాదుల్లో 16 శాతం వినియోగదారుల నుంచి వచ్చాయి. ప్రభుత్వం నుంచి వచ్చినవి 15 శాతం ఉన్నాయి. పరిశ్రమ నుంచి వచ్చిన ఫిర్యాదులు మూడు శాతం ఉన్నాయి. అభ్యంతరకరంగా ఉండే అవకాశం ఉందని భావిస్తూ ప్రాసెస్ చేసిన 2,764 ఫిర్యాదుల్లో 32శాతం ప్రకటనలపై ప్రకటనదారుల నుంచి ఎలాంటి సవాళ్లు రాలేదు. 59 శాతం ప్రకటనలు ఏఎస్‌సీఐ కోడ్‌ను ఉల్లంఘించినట్లుగా గుర్తించారు. 8శాతం ప్రకటనలు మార్గదర్శకాలను ఉల్లంఘించలేదు.
ఈ సందర్భంగా ఏఎస్‌సీఐ ఈఈవో, సెక్రటరీ జనరల్ మనీషా కపూర్ మాట్లాడుతూ.. డిజిటల్ అడ్వర్టయిజింగ్ శరవేగంగా పెరిగిపోతున్న నేపథ్యంలో తాము యాడ్ సర్వైలెన్స్ టెక్నలజీపై భారీగా ఇన్వెస్ట్ చేసినట్టు చెప్పారు. పారదర్శకత కోసం తాము చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో భాగంగా ఫిర్యాదుల రకాలు, ఏఎస్‌సీఐ పరిశీలనలపై ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలలకు సమగ్ర నివేదికను విడుదల చేసినట్టు తెలిపారు. ఏఎస్‌సీఐ స్వీకరించిన మొత్తం ఫిర్యాదుల్లో 28 శాతం ఇన్ఫ్లయెన్సర్ల కారణంగా జరిగిన ఉల్లంఘనలు ఉన్నాయి. వారిపై వచ్చిన 781 ఫిర్యాదుల్లో 34శాతం పర్సనల్ కేర్ విభాగానికి చెందినవి. 17 శాతంతో ఆహార పానీయాల విభాగం ఆ తరువాతి స్థానంలో నిలిచింది. వర్చువల్ డిజిటల్ అసెట్స్ పై 10శాతం ఫిర్యాదులు వచ్చాయి.