ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.8.36 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2022-09-19T06:33:48+05:30 IST

ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు ఊపందు కోవటంతో ప్రత్యక్ష పన్ను వసూళ్లు గణనీయంగా పెరుగు తున్నాయి.

ప్రత్యక్ష పన్ను వసూళ్లు  రూ.8.36 లక్షల కోట్లు

ఈ నెల 17 నాటికి 30% పెరిగిన వసూళ్లు 

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు ఊపందు కోవటంతో ప్రత్యక్ష పన్ను వసూళ్లు గణనీయంగా పెరుగు తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23).. సెప్టెంబరు 17వ తేదీ ముగిసే నాటికి స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఏకంగా 30 శాతం వృద్ధి రూ.8.36 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొవిడ్‌ అనంతరం ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు జోరం దుకోవటంతో పన్ను వసూళ్లలో గణనీయమైన వృద్ధి నమోదైందని పేర్కొంది. సుమారు రూ.1,35,556 కోట్ల మేర రిఫండ్స్‌ను సద్దుబాటు చేస్తే నికరంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23 శాతం వృద్ధితో రూ.7,00,669 కోట్లుగా ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 17న నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.8,36,225 కోట్లుగా ఉండగా గత ఏడాది ఇదే కాలంలో ఇవి రూ.6,42,287 కోట్లుగా ఉన్నాయి. మొత్తం పన్ను వసూళ్లలో కార్పొరేట్‌ పన్ను వసూళ్లు రూ.4.36 లక్షల కోట్లుగా ఉండగా వ్యక్తిగత ఆదాయ పన్ను (పీఐటీ) వసూళ్లు రూ.3.98 లక్షల కోట్లుగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొవిడ్‌ మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ జోరందుకుందనాటికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లే నిదర్శనమని పేర్కొంది. అంతేకాకుండా ప్రభుత్వం విధానపరంగా తీసుకున్న నిర్ణయాలతో పాటు టెక్నాలజీని వినియోగించి పన్ను వసూళ్ల ప్రక్రియను సులభతరం చేయటం కూడా ఇందుకు కారణ మని తెలిపింది. 


అడ్వాన్స్‌ టాక్స్‌ వసూళ్లలో 17% వృద్ధి: కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబరు త్రైమాసికంలో అడ్వాన్స్‌ టాక్స్‌ వసూళ్లు 17 శాతం వృద్ధి చెంది రూ.2.95 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇందులో కార్పొరేట్‌ వర్గాలు చెల్లించిన వసూళ్లు రూ.2.29 లక్షల కోట్లుగా ఉన్నాయి. మరోవైపు ఈ నెల 17 నాటికి దాదాపు 93 శాతం పన్ను రిటర్నుల (ఐటీఆర్‌)ను వెరిఫై చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా శరవేగంగా రిఫండ్స్‌ను చేపట్టినట్లు పేర్కొంది. 

Read more