Reserve Bank of India: భారత ఆర్థిక రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభం
ABN , First Publish Date - 2022-12-01T21:50:23+05:30 IST
న్యూఢిల్లీ: భారత ఆర్థిక రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. నేటి నుంచి డిజిటల్ రూపాయి...
న్యూఢిల్లీ: భారత ఆర్థిక రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. నేటి నుంచి డిజిటల్ రూపాయి (Digital Rupee) వచ్చేసింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ తొలి పైలట్ ప్రాజెక్టును భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) ప్రారంభించింది. సీబీడీసీని తొలుత టోకు లావాదేవీలకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. రిటైల్ లావాదేవీల కోసం డిజిటల్ రూపీ తొలి పైలట్ ప్రాజెక్టును నెల రోజుల్లోపే ప్రారంభించనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. తొలి విడతగా, ఎంపిక చేసిన ప్రాంతాల్లోని కస్టమర్లు-మర్చంట్లతో కూడిన క్లోజ్డ్ యూజర్ గ్రూప్‌లకు మాత్రమే డిజిటల్ రూపాయి ద్వారా రిటైల్ లావాదేవీలు జరిపే అవకాశం కల్పించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. డిజిటల్ రూపీ తొలి పైలట్ ప్రాజెక్టుగా సెకండరీ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీ లావాదేవీల సెటిల్‌మెంట్ యూజ్ కేస్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది.
ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నాలుగు నగరాల్లో డిజిటల్ రూపాయిని అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండో దశలో భాగంగా మరో 9 నగరాలకు (హైదరాబాద్, అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, గువాహటి, ఇండోర్, కొచ్చి, లఖ్‌నవూ, పాట్నా, సిమ్లా) సేవలను విస్తరించనునన్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకుల్లో లావాదేవీలకు అవకాశం కల్పించారు. మరో 4 బ్యాంక్‌లకు (బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్) వీటి జారీ బాధ్యతలను అప్పగిస్తారు. అవసరానుగుణంగా భవిష్యత్‌లో మరిన్ని నగరాలకు సేవలను విస్తరించడంతో పాటు ఇతర బ్యాంక్‌ల ద్వారానూ డిజిటల్ రూపాయిని అందుబాటులోకి తేవడం జరుగుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
రూపాయి విలువ డిజిటల్ రూపాయి విలువ సమానం. డిజిటల్ కరెన్సీకి ముద్రణ, పంపిణీ ఖర్చులుండవు. అంతా ఆన్‌లైన్ కావడంతో కరెన్సీ నోట్ల ముద్రణకు అయ్యే ఖర్చు పూర్తిగా తగ్గుతుంది. డిజిటల్ కరెన్సీ పెరిగితే లంచాలు ఇవ్వడం తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యమౌతాయి.
రష్యా, ఇరాన్ లాంటి వ్యాపార భాగస్వాములతో ఎగుమతి, దిగుమతులు జరిపేందుకు డిజిటల్ రూపాయి ఉపయోగపడుతుంది. బంగ్లాదేశ్, కెన్యా, జింబాబ్వే సహా మొత్తం 12 దేశాలు రూపాయల్లో వర్తకానికి సుముఖంగా ఉండటం ప్లస్ పాయింట్. డిజిటల్ రూపాయితో లావాదేవీలు పెరిగితే డాలర్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
ఇక రానున్నది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (Central Bank Digital Currency - CBDC) యుగం. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ నోట్‌ను భారతీయ రిజర్వు బ్యాంక్ (RBI) ఇటీవలే విడుదల చేసింది. నిర్దిష్ట సందర్భాల్లో వినియోగించడం కోసం డిజిటల్ రుపీని ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు తెలిపింది.