పండగల సీజన్‌పై కార్ల కంపెనీల ఆశలు
ABN , First Publish Date - 2022-08-08T06:38:03+05:30 IST
రాబోయే పండగల సీజన్‌పై కార్ల కంపెనీలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. కొవిడ్ మహమ్మారి, చిప్‌ల కొరతతో గత రెండేళ్లుగా ఈ కంపెనీల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి.

కొత్త మోడల్స్‌తో రెడీ అవుతున్న దిగ్గజాలు
న్యూఢిల్లీ: రాబోయే పండగల సీజన్‌పై కార్ల కంపెనీలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. కొవిడ్ మహమ్మారి, చిప్‌ల కొరతతో గత రెండేళ్లుగా ఈ కంపెనీల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. కొనుగోలుదారులూ గత రెండేళ్లుగా పొదుపు మంత్రం పాటించడం ఇందుకు మరో కారణం. ఇప్పుడు కొవిడ్ భయాలు లేవు. చిప్‌ల కొరత కూడా చాలా వరకు తగ్గింది. దీంతో ఈ నెల 11 నుంచి అక్టోబరు 25 (దీపావళి) వరకు ఉండే పండగల సీజన్‌పై కంపెనీలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఇందుకోసం ఇప్పటికే రంగం సిద్ధం చేశాయి. దాదాపు 2.12 లక్షల లేటెస్ట్ మోడల్ కార్లను డీలర్ల వద్ద రెడీగా ఉంచాయి. దీనికి తోడు కొత్త మోడల్స్‌తోనూ సిద్ధమవుతున్నాయి.
జనవరి నుంచే రికవరీ
వాస్తవానికి ఈ ఏడాది జనవరి నుంచే దేశంలో కార్ల అమ్మకాలు పెరిగాయి. గత నాలుగైదు నెలలుగా చూస్తే నెలకు సగటున మూడు లక్షల వరకు వాహనాల అమ్మకాలు నమోదవుతున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) జాతీయ అధ్యక్షుడు వింకేశ్ గులాటీ చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్-జూలై మధ్య దేశంలో కార్ల అమ్మకాలు 12.53 లక్షలకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 33 శాతం ఎక్కువ.
ఎంట్రీ లెవల్ వాహనాలకు గుడ్‌బై
కార్లు, బైకులు, స్కూటర్ల కొనుగోలుదారుల అభిరుచులూ మారిపోతున్నాయి. గతంలో తక్కువ ధరల్లో అందుబాటులో ఉండే ఎంట్రీ లెవల్ మోడల్స్‌పైనే కొనుగోలుదారులు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. నాలుగైదేళ్ల క్రితం వరకు మొత్తం అమ్మకాల్లో దాదాపు సగం వాటా ఈ తరహా వాహనాలదే. ఇప్పుడు ట్రెండ్ మారింది. కార్ల కొనుగోలుదారులు కాంపాక్ట్ ఎస్‌యూవీలు, టూ వీలర్ల కొనుగోలుదారులు అధిక సీసీ వాహనాలపై ఆసక్తి చూపిస్తున్నారు. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా కంపెనీలూ కొత్తకొత్త మోడల్స్ మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.
20 లక్షల వాహనాల ఉత్పత్తి : మారుతి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) మారుతీ సుజుకీ ఇండియా వాహనాల ఉత్పత్తి 20 లక్షలకు చేరనుంది. కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ కంపెనీ తాజా వార్షిక నివేదికలో ఈ విషయం తెలిపారు. మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం 16.52 లక్షల వాహనాలు మాత్రమే ఉత్పత్తి చేసింది. చిప్‌ల కొరత కుదుటపడడంతో ఉత్పత్తి పూర్తిగా గాడిలో పడనుందని భార్గవ తెలిపారు. త్వరలో విడుదల చేసే మిడ్ సైజ్ గ్రాండ్ విటారా ఎస్యూవీ ఈ సంవత్సరం కంపెనీ అమ్మకాలకు ప్రధానంగా దోహదం చేస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.