టాటాల గూటికి బిస్లరీ!

ABN , First Publish Date - 2022-11-25T03:55:14+05:30 IST

దేశంలో అతిపెద్ద ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ఉత్పత్తుల బ్రాండ్‌ బిస్లరీని చేజిక్కించుకునేందుకు టాటా గ్రూప్‌ సన్నాహాలు చేస్తోంది...

టాటాల గూటికి బిస్లరీ!

ఒప్పందం విలువ రూ.7,000 కోట్ల స్థాయిలో ఉండే అవకాశం

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ఉత్పత్తుల బ్రాండ్‌ బిస్లరీని చేజిక్కించుకునేందుకు టాటా గ్రూప్‌ సన్నాహాలు చేస్తోంది. కంపెనీని విక్రయించనున్నట్లు ధ్రువీకరించిన బిస్లరీ ఇంటర్నేషనల్‌ చైర్మన్‌ రమేశ్‌ చౌహాన్‌.. టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ సహా పలువురితో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. టాటా గ్రూప్‌ సైతం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయితే, బిస్లరీ ఇంటర్నేషనల్‌ను విక్రయించేందుకు టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌తో రూ.7,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వచ్చిన వార్తలను చౌహాన్‌ ఖండించారు. తన తర్వాత వ్యాపారాన్ని ముందుకు నడిపించేవారెవరూ లేరని, తన కూతురు జ్యోతికి వ్యాపారంపై ఆసక్తి లేదని, అందుకే అమ్మేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు 82 ఏళ్ల చౌహాన్‌ వెల్లడించారు.

బిస్లరీకి దేశవ్యాప్తంగా 150 తయారీ ప్లాంట్లు, 4,000కు పైగా డిస్ట్రిబ్యూటర్ల నెట్‌వర్క్‌తో పాటు 5,000 ట్రక్కులు కూడా ఉన్నాయి. కాగా, టాటా కన్స్యూమర్‌ ఇప్పటికే ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ వ్యాపారంలో ఉంది. టాటా గ్లూకో, టాటా కాపర్‌ ప్లస్‌ పేరుతో ప్యాకేజ్డ్‌ వాటర్‌ ప్రొడక్ట్స్‌ను మార్కెట్లో విక్రయిస్తోంది. బిస్లరీ కొనుగోలు ద్వారా ఈ వ్యాపారంలో టాటా గ్రూప్‌ మరింత బలోపేతం కానుంది.

తొలుత థమ్సప్‌ బ్రాండ్‌ చౌహాన్‌దే: థమ్సప్‌, మాజా, లిమ్కాతో పాటు పాతతరానికి చెందిన గోల్డ్‌స్పాట్‌, సిట్రా వంటి శీతల పానీయాల బ్రాండ్లు చౌహాన్‌వే. మూడు దశాబ్దాల క్రితం (1993లో) చౌహాన్‌.. వాటిని అమెరికన్‌ సాఫ్ట్‌డ్రింక్‌ దిగ్గజం కోకాకోలాకు విక్రయించారు. థమ్సప్‌ ఇప్పటికే బిలియన్‌ డాలర్‌ బ్రాండ్‌గా ఎదిగింది. 2024 నాటికల్లా మాజా సైతం ఈ స్థాయికి చేరుకోవచ్చని కోకాకోలా పేర్కొంది. 2016 లో చౌహాన్‌ బిస్లరీ పాప్‌ అనే బ్రాండ్‌ ద్వారా శీతల పానీయాల మార్కెట్లోకి తిరిగి ప్రవేశించినప్పటికీ, కస్టమర్ల ఆదరణను పొందలేకపోయారు.

Updated Date - 2022-11-25T03:55:22+05:30 IST