మొబిలిటీ వ్యాలీపై 6న ప్రకటన

ABN , First Publish Date - 2022-07-01T09:15:25+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (టీఎంవీ) ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది.

మొబిలిటీ వ్యాలీపై 6న ప్రకటన

నాస్కామ్‌ జీసీసీ సదస్సులో మంత్రి కేటీఆర్‌ 

బడా ఆటో కంపెనీలతో చర్చలు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (టీఎంవీ) ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుకు పెద్ద పెద్ద ఒరిజినల్‌ ఎక్వి్‌పమెంట్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ (ఓఈఎం), ఆటో సరఫరాదారులు, టెక్నాలజీ కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్‌ ఆపరేటర్లతో కలిసి పని చేస్తున్నామని, వాటితో చర్చిస్తున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఇది దేశంలోనే సమగ్ర మొబిలిటీ ఎకోసిస్టమ్‌ అవుతుందన్నారు. మొబిలిటీ వ్యాలీకి సంబంధించిన మరిన్ని వివరాలను జులై 6న వెల్లడించనున్నట్లు చెప్పారు. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ (జీసీసీ)పై నాస్కామ్‌ (నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌) నిర్వహించిన సదస్సులో కేటీఆర్‌ మాట్లాడారు. వికారాబాద్‌ జిల్లాతో సహా రెండు ప్రదేశాలను వ్యాలీ ఏర్పాటుకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.


తెలంగాణలో రూ.1,400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ఇటీవల కార్ల కంపెనీ హ్యుండయ్‌ ప్రకటించింది. మొబిలిటీ వ్యాలీలో హ్యుండయ్‌ యాంకర్‌ ఇన్వెస్టర్‌ అయ్యే వీలుంది. వ్యాలీలో టెస్ట్‌ ట్రాక్‌లు, ఇతర మౌలిక సదుపాయాలు ఉంటాయి. వాహన కంపెనీలు, ఆటో కంపెనీలకు చిప్‌లు, సొల్యూషన్లను అందిస్తున్న ఎలకా్ట్రనిక్స్‌ కంపెనీలతో కూడా తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. 


33 శాతం కొత్త ఉద్యోగాలు ఇక్కడే: గత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌ ఐటీ రంగం కొత్తగా 1.5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించింది. దేశవ్యాప్తంగా కొత్తగా కల్పించిన ఉద్యోగాల్లో 33 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయని మంత్రి అన్నారు. కాగా ఇతర పట్టణాలతో పోలిస్తే మెరుగైన మౌలిక సదుపాయాలు, నిపుణుల లభ్యత, స్థిరమైన ప్రభుత్వం వంటి అనుకూల అంశాలతో బహుళ జాతి కంపెనీలు హైదరాబాద్‌లో తమ జీసీసీలను ఏర్పాటు చేస్తున్నాయని కేటీఆర్‌ చెప్పారు. 

Updated Date - 2022-07-01T09:15:25+05:30 IST