నెలరోజుల కనిష్ఠానికి రూపాయి

ABN , First Publish Date - 2022-12-07T02:14:23+05:30 IST

గత కొద్ది రోజులుగా నిలకడగా పురోగమిస్తున్న దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి ఎదురీదుతోంది...

నెలరోజుల కనిష్ఠానికి రూపాయి

ముంబై: గత కొద్ది రోజులుగా నిలకడగా పురోగమిస్తున్న దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి ఎదురీదుతోంది. స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ఉండడం, ఎఫ్‌పీఐల అమ్మకాలు, చమురు సెగ మరోసారి రూపాయిపై ప్రభావం చూపుతున్నాయి. ఫారెక్స్‌ మార్కెట్లో మంగళవారం డాలర్‌ మారకంలో రూపాయి మరింత బలహీనపడి నెల రోజుల కనిష్ఠ స్థాయికి దిగజారింది. మంగళవారం రోజుంతా బలహీనంగానే ట్రేడవుతూ చివరికి 65 పైసలు నష్టపోయింది. ఉదయం రూ.81.94 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో రూ.82.63 వరకు వెళ్లి చివరికి 65 పైసల నష్టంతో రూ.82.50 వద్ద ముగిసింది.

మూడో రోజూ నష్టపోయిన సెన్సెక్స్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా మూడో రోజూ నష్టపోయింది. సెన్సెక్స్‌ 208.24 పాయింట్ల నష్టంతో 62626.36 వద్ద, నిఫ్టీ 58.30 పాయింట్ల నష్టంతో 18642.75 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ ఒక దశలో 444.53 పాయింట్ల వరకు నష్టపోయి కోలుకుంది. చమురు సెగకు తోడు ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉండడం మంగళవారం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బుధవారం వెలువడే ఆర్‌బీఐ ద్రవ్య, పరపతి విధాన సమీక్ష కోసం మార్కెట్‌ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Updated Date - 2022-12-07T02:14:29+05:30 IST