4 రోజులు రూ.13.30 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2022-09-27T06:54:50+05:30 IST

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల తిరోగమన భయాలు మరింత తీవ్రం కావడంతో వరుసగా నాలుగో రోజు కూడా భారత ఈక్విటీ సూచీ లు భారీ పతనాలు నమోదు చేశాయి.

4 రోజులు రూ.13.30 లక్షల కోట్లు

వరుస పతనాలతో తగ్గిన ఇన్వెస్టర్ల సంపద

నాలుగో రోజు సెన్సెక్స్‌ 954 పాయింట్లు డౌన్‌

మరో రికార్డు  కనిష్ఠ స్థాయికి రూపాయి


ముంబై : అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల తిరోగమన భయాలు మరింత తీవ్రం కావడంతో వరుసగా నాలుగో రోజు కూడా భారత ఈక్విటీ  సూచీ లు భారీ పతనాలు నమోదు చేశాయి. నాలుగు రోజుల వరుస పతనాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.13.30 లక్షల కోట్లు హరించుకుపోయింది. నాలుగు సెషన్లలో సెన్సెక్స్‌ 2,574.52 పాయింట్లు నష్టపోయింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి కూడా 58 పైసలు పతనమై మరో రికార్డు కనిష్ఠ స్థాయి 81.67కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలు మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ కారణంగా సోమవారం ఆరంభం నుంచి మార్కెట్‌ భారీ పతనాల బాటలోనే ట్రేడవుతూ వచ్చింది. చివరికి సెన్సెక్స్‌ 953.70 పాయింట్ల నష్టంతో 57,145.22 వద్ద, నిఫ్టీ 311.05 పాయింట్ల నష్టంతో 17,016.30 వద్ద ముగిశాయి. బీఎ్‌సఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 3.33 శాతం, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 2.84 శాతం క్షీణించాయి. ఒక్క ఐటీ సూచీ మినహా అన్ని సెక్టోరల్‌ సూచీలు కూడా భారీ పతనాలు నమోదు చేశాయి. రియల్టీ సూచీ 4.29 శాతం నష్టంతో అగ్రగామిగా ఉంది. బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల్లో 2,925 కంపెనీల షేర్లు క్షీణించగా కేవలం 660 షేర్లు లాభపడ్డాయి. 


పతనానికి కారణాలివే...

ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు రిస్క్‌ పట్ల తీవ్ర విముఖత ప్రదర్శించడం ఈక్విటీ, ఫారెక్స్‌ మార్కెట్లను తీవ్రంగా కుదిపేసింది. శుక్రవారం అమెరికన్‌ మార్కెట్‌ నష్టపోవడం ఇతర ఆసియా దేశాల మార్కెట్లన్నింటినీ ప్రభావితం చేసింది. సియోల్‌, టోక్యో, షాంఘై, హాకాంగ్‌ మార్కెట్లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. యూరోపియన్‌ మార్కెట్ల నుంచి కూడా ప్రతికూల సంకేతాలు వెలువడ్డాయి. ప్రధాన దేశాల సెంట్రల్‌ బ్యాంకులన్నీ వడ్డీ రేట్లు భారీగా పెంచ డం అన్ని మార్కెట్లలోనూ కల్లోలం నింపింది. ఆర్‌బీఐ కూడా ఈ వారాంతంలో ప్రకటించనున్న ద్రవ్యవిధానంలో అదే బాటలో పయనించి కీలక రెపో రేటు భారీగా పెంచుతుందన్న భయాలు సర్వత్రా నెలకొన్నాయి. దీనికి తోడు అమెరికాలో వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉండడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా నిధులు తరలించుకుపోతున్నారు. బీఎ్‌సఈ వద్ద అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ.2,899.68 కోట్ల నిధులు ఉపసంహరించారు. అంతే కాదు...యూర్‌పలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీలో ముసురుకున్న మాం ద్యం భయాలు ప్రపంచ మార్కెట్లను పతనం అంచుల్లోకి నెట్టాయి. ఆ ప్రభావం కూడా భారత మార్కెట్‌పై పడింది.  


రూపాయిదీ అదే బాట

అమెరికన్‌ డాలర్‌ మారకంలో రూపాయి మరో చారిత్రక కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. సోమవారం ట్రేడింగ్‌లో 58 పైసలు క్షీణించి 81.67 వద్ద నిలిచింది. నాలుగు రోజుల్లో డాలర్‌ మారకంలో రూపాయి 193 పైసలు పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి విలువ 9.4 శాతం క్షీణంచింది. సమీప భవిష్యత్తులో రూపాయి 82ని తాకవచ్చునంటున్నారు. రూపాయికి 82 వద్ద నిరోధం, 81.05 వద్ద మద్దతు ఉన్నట్టు చెబుతున్నారు. 


4 దశాబ్దాల కనిష్ఠానికి పౌండ్‌ 

ఆరు కరెన్సీల బాస్కెట్‌తో కూడిన డాలర్‌ ఇండెక్స్‌ 0.46 శాతం లాభపడి 113.71కి చేరడం ఫారెక్స్‌ మార్కెట్లను కల్లోలితం చేసింది. బ్రిటిష్‌ పౌండ్‌ రికార్డు కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. బ్రిటన్‌ ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్టెంగ్‌ భారీ పన్ను కోతలు ఇవ్వనున్నట్టు ప్రకటించడం ఇన్వెస్టర్లను కలవరపరిచింది. కొత్త ప్రభుత్వ ఆర్థిక విధానాలు బ్రిటన్‌ను మాంద్యంలోకి నెట్టడం ఖాయమన్న భయాలు నెలకొన్నాయి. ఫలితంగా పౌండ్‌ విలువ 1.0373 డాలర్లకు పడిపోయింది. ఇది నాలుగు దశాబ్దాల కనిష్ఠ స్థాయి. 1971 తర్వాత పౌండ్‌ ఈ స్థాయిని తాకడం ఇదే ప్రథమం. వృద్ధికి ఊతం ఇవ్వాలనే లక్ష్యంతో కొత్త కన్జర్వేటివ్‌ ప్రభుత్వం 5 శాతం పైగా పన్నులు తగ్గించి, ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు పెద్ద ఎత్తున రుణాలు సమీకరించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ద్రవ్యోల్బణం మరింత దూసుకుపోతుందని, బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరుగుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా గత శుక్రవారం నుంచి డాలర్‌ మారకంలో పౌండ్‌ విలువ 5 శాతానికి పైగా దిగజారింది.  


రిటైల్‌ ఇన్వెస్టరు బహు పరాక్‌

ఈ వరుస పతనాలతో బీఎ్‌సఈలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.13,30,753.42 కోట్లు దిగజారింది. ప్రస్తుతం అది రూ.2,70,11,460.11 కోట్ల వద్ద నిలిచింది. మార్కెట్‌ ఎక్కడ మద్దతు తీసుకుంటుందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులంటున్నారు. ఈ కారణంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2022-09-27T06:54:50+05:30 IST