ఘనంగా కెనరా బ్యాంక్‌ 117వ వ్యవస్థాపక దినోత్సవం

ABN , First Publish Date - 2022-11-20T01:28:13+05:30 IST

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ 117వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. బెంగళూరులోని బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కెనరా బ్యాంక్‌ వ్యవస్థాపకుడు దివంగత అమ్మెంబాళ్‌ సుబ్బా రావు పాయ్‌కు ఘనంగా నివాళులర్పించారు...

ఘనంగా కెనరా బ్యాంక్‌ 117వ వ్యవస్థాపక దినోత్సవం

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ 117వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. బెంగళూరులోని బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కెనరా బ్యాంక్‌ వ్యవస్థాపకుడు దివంగత అమ్మెంబాళ్‌ సుబ్బా రావు పాయ్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్‌ మాట్లాడుతూ.. బ్యాంక్‌ 117 సంవత్సరాల మజిలీని విజయవంతంగా పూర్తి చేసుకోవటంలో ఖాతాదారుల పాత్ర అమోఘమైనదని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. సామాజిక సేవా కార్యక్రమాలకు ఊతమిస్తూ కెనరా బ్యాంక్‌ వృద్ధిపథంలో సాగుతోందన్నారు. వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా పలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌) కార్యకలాపాలను బ్యాంక్‌ చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా క్యూర్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా ట్రస్ట్‌కు ఆర్థిక చేయూతను అందించినట్లు ప్రభాకర్‌ వెల్లడించారు. 2009 నుంచి 29 రాష్ట్రాల్లో ఈ సంస్థ పలు సేవలందిస్తోందని తెలిపారు. దీంతోపాటు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ చిరంతనకు కూడా ఆర్థిక సాయాన్ని అందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్‌ ఉన్నతాధికారులు, పలు రాష్ట్రాలకు చెందిన బ్యాంక్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-20T01:28:59+05:30 IST