YSR Awards: నాన్నపేరుకు ప్రచారం.... జనం సొమ్ము పందేరం

ABN , First Publish Date - 2022-11-02T06:21:17+05:30 IST

ప్రభుత్వం స్వచ్ఛందంగా ఒకరిని ఎంపికచేసి అవార్డు ఇస్తోందంటే అది వారి సేవలకు ఇచ్చే గౌరవం. సర్కారు ఇచ్చే గొప్ప సత్కారం అది. భారత రత్న, పద్మ అవార్డులు, వీరులకు ఇచ్చే గ్యాలంటరీ, శాంతిస్థాపనకు ఎనలేని కృషిచేసిన వారికి ఇచ్చే గాంధీ పీస్‌ అవార్డు ఈ కోవలోకి వచ్చేవి. ఆ అవార్డులకు ఎంపికవ్వడం అంటే కోట్ల రూపాయలు ఇచ్చినా రాని గుర్తింపు లభిస్తుంది.

YSR Awards: నాన్నపేరుకు ప్రచారం....  జనం సొమ్ము పందేరం
YSR Awards

వైఎస్సార్‌ అవార్డులకు లక్షలు ఇస్తే తప్ప ‘విలువ’ లేదా?

అవార్డులూ భారీనే.. ప్రచారమూ భారీనే

లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌కు రూ.10 లక్షలు

అచీవ్‌మెంట్‌కు రూ.ఐదు లక్షలు

3 కోట్లతో ప్రచారం, మరో 3 కోట్లతో అవార్డులు

భారతరత్న,పద్మాలకు పైసా ఇవ్వని కేంద్రం

అవి దక్కడమే భాగ్యమని భావించే విజేతలు

రాష్ట్ర ప్రభుత్వాలస్థాయిలో లక్ష దాటని నగదు

తండ్రి అవార్డులకు కోట్ల ప్రజాధనం దుబారా

అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. అది రావడమే గొప్ప. అందుకే నగదు పారితోషికం లేదు. పద్మ అవార్డులకు ప్రత్యేకంగా నగదు పురస్కారం ఉండదు. రచయితలకు ఇచ్చే కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డుకు లక్ష రూపాయలు గౌరవంగా అందిస్తారు. రాష్ట్రాల స్థాయిలో ప్రభుత్వాలు కూడా అవార్డులు ఇస్తుంటాయి. కానీ, నగదు పారితోషకం రూ.లక్ష దాటదు. యూనివర్సిటీలు ఏటా ప్రతిభావంతులను సత్కరించి తామ్రపత్రంతోపాటు రూ. 25వేలు చేతిలో పెడతాయి. శాంతిస్థాపన కోసం పనిచేసిన వ్యక్తిని గుర్తించి ఏటా గాంధీ అవార్డు ఇస్తారు. ఈ ఒక్క అవార్డుకు మాత్రమే కేంద్ర సర్కారు కోటిరూపాయల పారితోషిక ం ఇస్తుంది. కానీ, ఏపీలో మాత్రం ఇచ్చే అవార్డులూ భారీనే..! ఆ ప్రదానఘట్టానికి చేసుకునే ప్రచారమూ భారీనే! వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌కు రూ.10 లక్షలు, అచీవ్‌మెంట్‌కు రూ.ఐదు లక్షలు చొప్పున 35మందికి పంచేసింది. ఇదే ‘రాష్ట్రావతరణ’ అని తేల్చేసింది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం స్వచ్ఛందంగా ఒకరిని ఎంపికచేసి అవార్డు ఇస్తోందంటే అది వారి సేవలకు ఇచ్చే గౌరవం. సర్కారు ఇచ్చే గొప్ప సత్కారం అది. భారత రత్న, పద్మ అవార్డులు, వీరులకు ఇచ్చే గ్యాలంటరీ, శాంతిస్థాపనకు ఎనలేని కృషిచేసిన వారికి ఇచ్చే గాంధీ పీస్‌ అవార్డు ఈ కోవలోకి వచ్చేవి. ఆ అవార్డులకు ఎంపికవ్వడం అంటే కోట్ల రూపాయలు ఇచ్చినా రాని గుర్తింపు లభిస్తుంది. అందుకే ప్రభుత్వం ఆ అవార్డులకు భారీగా నగదు పారితోషికం ఇవ్వదు. ఎందుకంటే నగదు కన్నా గుర్తింపు ముఖ్యం. సర్కారుతోపాటు అవార్డు గ్రహీతలు అదే కోరుకుంటారు. అయితే, ముఖ్యమంత్రి జగన్‌ ఈ సంప్రదాయాన్ని మార్చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం వైఎ్‌సఆర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులను ప్రదానం చేసింది. తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరిట ఇచ్చిన ఈ అవార్డులకు భారీగా గుర్తింపు తీసుకొచ్చేందుకు అంతే భారీ మొత్తంలో దేశంలో మరెక్కడా లేని విధంగా నగదు పారితోషికం ఇచ్చారు.

దీనిప్రచారం పేరిట కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. చివరకు ఈ కార్యక్రమాన్ని కూడా వైఎ్‌సఆర్‌ నగదు పంపిణీ పథకంగా మార్చేశారన్న విమర్శల సుడిలోకి నెట్టేశారు. దేశం అంతా ఇప్పుడు దీని గురించే చర్చ. ప్రభుత్వ సొమ్మును తండ్రి అవార్డుల పేరిట ధారాదత్తం చేశారన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి. రహదారులు బాగోలేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతుంటే, వాటిని బాగుచేయడానికి ముందుకు రావడంలేదు. కానీ, అవార్డుల పేరిట కోట్ల రూపాయల ప్రచార ఆర్భాటం చేస్తుండటం దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది.

ఎంపిక.. ప్రదానం ఒక్క చేతిపైనే...

వివిధ రంగాల్లోని వారిని సర్కారే ఓ కమిటీ ద్వారా ఎంపిక చేసి వైఎస్సార్‌ పేరిట అవార్డులను ఇచ్చింది. వారిని ఘనంగా సన్మానించి మెమెంటోలు ఇచ్చి సత్కరించింది. ఈ చర్యను ఎవ్వరూ తప్పుపట్టడంలేదు. కానీ అవార్డుల పేరిట సర్కారు ఆరు కోట్ల రూపాయల మేర ఖర్చుపెట్టడమే జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. వైఎ్‌సఆర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు పొందిన వారికి 10 లక్షల రూపాయలు, వైఎ్‌సఆర్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు పొందిన వారికి 5 లక్షల రూపాయల నగదు పారితోషికం ఇచ్చింది. రెండు కేటగిరీల్లో కలిపి మొత్తం 35 మందికి అవార్డులు ఇచ్చింది. వీటి విలువ 3 కోట్లమాటే. సాధారణంగా ప్రభుత్వం ఇచ్చే అవార్డుకు ఓ వ్యక్తి ఎంపిక కావడం అంటేనే గొప్ప గౌరవంగా భావిస్తారు. దాన్నే ఓ సత్కారంగా, గుర్తింపుగా పరిగణిస్తారు. సర్కారు అదొక్కటే సరిపోదనుకొని, దేశంలో మరెక్కడా లేని విధంగా నగదు పారితోషికాలను అందించింది.

ఇది కొత్త ట్రెండే...

జగన్‌ సర్కారు ఇప్పుడు కొత్త ట్రెండును సృష్టించింది. తండ్రి వైఎ్‌సరాజశేఖరరెడ్డి పేరిట ఇచ్చే అవార్డులకు భారీగా నగదు పారితోషికం ప్రకటించి ఇచ్చారు. ప్రభుత్వం తరపున ఇచ్చే అవార్డులకు పారితోషికం ఎంత ఉండాలన్నదానికి కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పారితోషికాన్ని ఖరారు చేయాలి. రాష్ట్రం అప్పుల్లో ఉందని, ప్రతీనెలా కొత్త అప్పులకోసం అర్రులు చాస్తున్న సంగతిని పక్కనపెట్టి మరీ 5,10 లక్షల రూపాయల నగదు పారితోషికాలను ఇచ్చేశారు. ఈ చర్య ద్వారా తన పేరు, తండ్రి పేరు మార్మోగిపోవాలని, అంతా గుర్తుపెట్టుకోవాలని ముఖ్యమంత్రి భావించి ఉండొచ్చు. కానీ ఇచ్చిన సొమ్ము ప్రభుత్వానిది. అంటే ప్రజల సొమ్మే. జగన్‌ తన ఇంట్లోనుంచో లేక జీతంగా తీసుకుంటున్న సొమ్ము నుంచో ఇచ్చినది కాదు. వైఎ్‌సఆర్‌ పార్టీ నుంచి ఇచ్చిన విరాళం కానేకాదు. ప్రభుత్వ సొమ్ము అంటే పంచేయడమే లక్ష్యం అన్నట్లుగా ఒక్కో అవార్డుకు 5 -10 లక్షలు ఇచ్చేసుకుంటూ వెళ్లిపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 35 మందికి ఇచ్చిన అవార్డుల విలువ 3 కోట్ల రూపాయలు. ఈ అవార్డుల ప్రచారం కోసం జగన్‌ తన సొంత మీడియా, అనుకూల మీడియాకు ఇచ్చిన ప్రకటనల విలువ మరో 3 కోట్లపైనే ఉంది.

వెరసి ఆరు కోట్లపైనే తన తండ్రి అవార్డుల పేరిట ఖర్చుపెట్టారు. అవార్డు పొందిన వారిలో పెద్దలు, ఆర్ధికంగా స్థితిమంతులు, పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. వీరిలో అనేక మందికి సర్కారు ఇచ్చే సొమ్ముతో పనే లేదు. దీనిపై ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. ’’వైఎ్‌సఆర్‌ పేరిట ప్రభుత్వం అవార్డులు ఇవ్వడాన్ని ఎవ్వరూ తప్పుపట్టడం లేదు. కానీ ఆ పేరిట ప్రజాధనం లక్షల రూపాయలను పారితోషికంగా ఇవ్వడాన్ని మేం ఖండిస్తున్నాం. రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో రూ.కోట్లను అవార్డులకింద ఖర్చుపెట్టడం తీవ్రమైనచర్య. ఆవార్డులను కూడా నగదు పం పిణీ స్కీమ్‌గామార్చేశారని ప్రజలంతా అ నుకుంటున్నారు’’ అని ప్రజాసంఘాల జాతీయ వేదిక కన్వీనర్‌ సుబ్బరాజు ఆందోళన వ్యక్తంచేశారు.

Updated Date - 2022-11-02T06:58:50+05:30 IST