క్వారీలపై వైసీపీ స్వారీ

ABN , First Publish Date - 2022-09-19T09:00:39+05:30 IST

క్వారీలపై వైసీపీ స్వారీ

క్వారీలపై వైసీపీ స్వారీ

ప్రకాశంలో మితిమీరిన అరాచకాలు.. ప్రతిపక్షాల గ్రానైట్‌పై సర్కారు పగ

పనులు చేయకుండా బెదిరింపులు

ఆర్థిక వనరులపై దెబ్బమీద దెబ్బ

అన్నిరకాలా పట్టు కోసం బరితెగింపు

చీమకుర్తి, బల్లికురవలే టార్గెట్‌

అక్కడి టీడీపీ నేతల క్వారీలు మూత

కోర్టు చెప్పినా.. ఏదో సాకుతో ఒత్తిళ్లు

ఒక్కొక్కటిగా అస్మదీయుల పరం


ప్రజాసేవ, అభివృద్ధి కార్యక్రమాలతో రాజకీయ ప్రత్యర్థులపై ఆధిపత్యాన్ని సాధించటం ఒకప్పటి రాజనీతి! చీమలు పెట్టిన పుట్టల్లోకి పాములు దూరి, అందిన కాడికి పడగను విస్తరించడం సీఎం జగన్‌ సరికొత్త రాజనీతి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవల్లోని గ్రానైట్‌ వ్యాపారాలను టీడీపీ నేతల చేతుల్లోంచి లాగేసుకుని.. అస్మదీయులు, కడప వ్యాపారులకు జగన్‌ ప్రభుత్వం దగ్గరుండి కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు గ్రానైట్‌ పరిశ్రమ వర్గాలను విస్తుగొలుపుతున్నాయి. 


(ఆంధ్రజ్యోతి-ఒంగోలు)

ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పటినుంచీ ప్రకాశం గ్రానైట్‌కు పెట్టింది పేరు. అధికారానికి, రాజకీయాలకు జిల్లాలో ఇదే ప్రధాన వనరు. వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన.. ఇలా అన్ని పార్టీల్లో గ్రానైట్‌ వ్యాపారంతో సంబంధం, భాగస్వామ్యం ఉన్నవారు ఉన్నారు. అయితే, గతంలో ఎప్పుడూ లేనివిధంగా జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రానైట్‌ రంగంపై పూర్తిపట్టు సాధించే ప్రయత్నాలు మొదలయ్యాయి. నయానో, భయానో ప్రత్యర్థులను లొంగదీసుకునే స్థాయికి అధికారిక రాజకీయం బరితెగించింది. అందులోభాగంగానే వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్దిమాసాలకే గ్రానైట్‌ వ్యాపారులకు నోటీసులు అందాయి. ముఖ్యంగా తెలుగుదేశం, బీజేపీలో ఉన్న నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ నోటీసులు ఇచ్చారు. వారు నడుపుతున్న క్వారీలపై వత్తిడి తెచ్చి భారీగా జరిమానాలు కట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో 12 క్వారీలపై ఉక్కుపాదం మోపారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ప్రభుత్వంతో రాజీపడినవారిని లాగేసుకున్నారు. అలా వెళ్లినవారిలో ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రితో సహ కొందరు ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. 


టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ రాజ్యసభ సభ్యుడు ఆయన. కేంద్రంలో ఆయన పార్టీ అధికారంలో ఉంది. అయినా.. వైసీపీ నేతల డిమాండ్లకు తలొగ్గేశారు. రాజకీయంగా తమ నిర్ణయాన్ని మార్చుకోకుండా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు టీడీపీలోనే ఉన్నారు. దీంతో వారు టార్గెట్‌ అయ్యారు. చీమకుర్తిలోని పోతుల రామారావు, బల్లికురవలోని గొట్టిపాటి రవికుమార్‌ క్వారీలు మూతపడ్డాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు వారి గ్రానైట్‌ పరిశ్రమలు బంద్‌ అయ్యాయి. అయినా.. వారు వెనక్కి తగ్గకుండా న్యాయపోరాటం చేశారు. ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి. అయినా.. వారి వ్యాపారం జరగకుండా కొత్త సమస్యను సృష్టిస్తున్నారు. 


వైసీపీ నేతలకు పచ్చజెండా 

గ్రానైట్‌ రంగంలో నిలదొక్కుకుని, ఆర్థికంగా సంపాదించుకునేందుకు వైసీపీ శ్రేణులకు పుష్కలమైన అవకాశాలను ప్రభుత్వం కల్పించింది. గెలాక్సీ గ్రానైట్‌ రంగంలో కడప జిల్లా వైసీపీ నేతల పాత్రను పెంచేసింది. తాజాగా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని బ్లాక్‌ గ్రానైట్‌ రంగంలో వైసీపీ ప్రజాప్రతినిధులు భారీగా ప్రవేశించేందుకు అవకాశాలు కల్పించారు. ఒకవైపు టీడీపీకి చెందిన రవికుమార్‌ క్వారీలు, పరిశ్రమలు మూతబడిపోగా, వివిధ రూపాల్లో తన పలుకుబడి ఉపయోగించి బీజేపీకి చెందిన మాజీ ఎంపీ రెండు నెలల క్రితం క్వారీ ప్రారంభించుకోగలిగారు. టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిన ఒక ఎమ్మెల్యే, మరో మాజీ మంత్రి క్వారీ నిర్వహణకు పూర్తి అవకాశం ఇచ్చేశారు. ప్రస్తుతం బల్లికురవ, గురిజేపల్లి ప్రాంతాల్లో గ్రానైట్‌ క్వారీల రంగంలోకి వైసీపీ నేతల ప్రవేశానికి అవకాశం ఇచ్చేశారు.


రంగంలోకి మాజీ మంత్రులు

నిన్న మొన్నటివరకు మంత్రిగా ఉండి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కీలకంగా ఉన్న ఒక నేత... రమారమి 15 ఎకరాల విస్తీర్ణంలో గ్రానైట్‌ నిక్షేపాల వెలికితీత పనులు ప్రారంభించారు. ఇబ్బందుల్లో ఉన్న ఒక గ్రానైట్‌ వ్యాపారవేత్తకు ప్రభుత్వం ద్వారా అండ కల్పిస్తామని చెప్పి అతని క్వారీలను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆగమేఘాలపై రమారమి రూ.25కోట్లు వెచ్చించి గ్రానైట్‌ నిక్షేపాన్ని వెలికితీసే పనులకు ఆయన  శ్రీకారం పలికారు. ప్రస్తుత బాపట్ల జిల్లాలో గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడిగా ఉంటూ ప్రస్తుతం జగన్‌కు సన్నిహితంగా ఉన్న ఒక మాజీ మంత్రి, ఆ పార్టీలో కీలకనేత ఈ వైపు దృష్టిసారించారు. మల్లాయపాలెం వద్ద రమారమి 20 ఎకరాల్లో భూమి కొనుగోలు చేసి క్వారీల ప్రారంభానికి సిద్ధమవుతున్నారు. మల్లాయపాలెం వద్ద 7ఎకరాల విస్తీర్ణంలో కొన్ని దశాబ్దాలకాలం నుంచి నివాసం ఉంటున్న ఎస్టీలను ఆ ప్రాంతం నుంచి తరిమికొట్టగలిగారు. టీడీపీ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు అక్కడ నివాసం ఉన్న గిరిజనులను ఖాళీచేయించేందుకు ఒప్పుకోలేదు. అప్పట్లో గిరిజనులకు మద్దతు ఇచ్చిన నాయకుడు ప్రస్తుతం అధికారపార్టీలో కీలకంగా మారాడు. ప్రస్తుతం ఆ నేత అధిష్ఠానంలో ముఖ్యనాయకుల సహకారంతో అక్కడ ఉన్న గిరిజనులందరినీ వేరే ప్రాంతాలకు పంపటమే కాక అక్కడ క్వారీల నిర్వహణకు అనుమతి కూడా తెచ్చుకున్నారు.  


వరుసగా భూమిపూజలు

ఎన్నికలయ్యాక టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన ఓ ప్రజాప్రతినిధి కుటుంబం అద్దంకి నియోజకవర్గంలో కొత్త క్వారీలకు భూమిపూజ చేసేసింది. ఇక్కడ కొండ ప్రాంతంలో మంచి నిక్షేపాలు ఉన్నాయనే ప్రచారం జరగటంతో దానిపై వైసీపీ నేతలు కన్నేశారు. ముందుగా దరఖాస్తులు చేసిన వారిని తరిమికొట్టినట్లు సమాచారం. ఇక్కడ లీజులన్నీ అధికారపార్టీ వారికి ఇప్పించి లబ్ధిపొందేందుకు నాయకులు ఒకరిద్దరు చేతులు కలిపి ముందుకు సాగుతున్నట్లు విమర్శలు ఉన్నాయి.

Read more