కోనసీమలో చిచ్చు వెనుక భారీ ‘స్కెచ్’
ABN , First Publish Date - 2022-05-27T08:42:47+05:30 IST
ఆకుపచ్చ కోనసీమ భగ్గుమనడం వెనుక భారీ కుట్ర ఉందా? మరోసారి...

- అధికారం కోసమే అరాచకం!?
- దళితుల ఓట్ల కోసం జనాలతో ఆటలు
- ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక పథకాలన్నీ రద్దు
- మూడేళ్లుగా లెక్కకు మించి దాడులు
- సర్కారుపై రగులుతున్న దళితులు
- ఓటు బ్యాంకు బీటలపై వైసీపీ ఆందోళన
- అంబేడ్కర్ పేరుతో ‘రాజకీయ క్రీడ’
- జిల్లాకు ఆయన పేరు పెట్టాలని తొలుత డిమాండ్లు
- నెలరోజులపాటు రకరకాల రూపాల్లో ఆందోళనలు
- అయినా పట్టించుకోకుండా ‘కోనసీమ’ ఖరారు
- తర్వాత వ్యూహాత్మకంగా పేరు మార్పు ప్రతిపాదన
- తొలి నిరసన చేసింది వైసీపీ వర్గీయులే
- ర్యాలీ, దాడుల్లోనూ వారిదే కీలక పాత్ర!
- ‘అంబేడ్కర్ పేరు మార్చం’ అని పెద్దల స్పష్టీకరణ
- అంతా వ్యూహాత్మకమే అనే అనుమానాలు
- రాష్ట్రవ్యాప్తంగా దళిత ఓట్ల సంఘటితానికే!?
ఆకుపచ్చ కోనసీమ భగ్గుమనడం వెనుక భారీ కుట్ర ఉందా? మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే లక్ష్యంతోనే నిప్పు రాజేశారా? వరుస దాడులు, పథకాల్లో మోసాలు, ఎగవేతలతో రగిలిపోతున్న దళితులను తమవైపునకు తిప్పుకొనేందుకే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరును వాడుకున్నారా? కోనసీమతోపాటు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితుల ‘ఓటు బ్యాంకు’ను సంఘటితం చేసుకునేందుకే ఈ నిప్పు రాజేశారా? ‘కోనసీమ జిల్లా’ ఖరారు... ఆ తర్వాత పేరు మార్పు... అమలాపురంలో చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నలన్నింటికీ రాజకీయ విశ్లేషకులు ‘ఔను’ అనే సమాధానమే చెబుతున్నారు.
దూరమవుతున్న ఎస్సీ, ఎస్టీలు
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులతో పాటు ప్రత్యేక పథకాలను నిలిపేయడంతో ఈ సర్కార్ తమ హక్కులు, సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని దళితులు భావిస్తున్నారు. దీంతో తమ దళిత ఓటు బ్యాంకుకు బీటలు పడుతున్నట్లు వైసీపీ అగ్రనేతలు కూడా గ్రహించారు. ఈ క్రమంలోనే.. ‘భావోద్వేగ’ అంశాలను తెరపైకి తెచ్చి, వారిని మళ్లీ తమ వైపునకు రప్పించుకునేందుకు పథకం రచించినట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే ‘అంబేడ్కర్’ పేరును వివాదాల్లోకి లాగినట్లు రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
బాగా దూర దృష్టితో ఆలోచించడం! కావాలనే ఒక ‘సమస్య’ను సృష్టించడం! తాము సృష్టించిన సమస్యను తామే పరిష్కరించినట్లు గొప్పగా చెప్పడం! భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం తామే ఒక సమస్యకు ప్రాణం పోయడం!
...ఇది వైసీపీ రాజకీయ విధానం.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చాక ఇదే స్టైల్! ‘కోనసీమ జిల్లా’ పేరు మార్పు వెనుక కూడా ఇదే తరహా కుట్ర ఉన్నట్లు బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రకరకాల కారణాలతో దూరమవుతున్న దళితులను మరోసారి మభ్యపెట్టి దగ్గర చేసుకునేందుకే... ‘అంబేడ్కర్’ పేరును వాడుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
అడిగినప్పుడు ఇవ్వకుండా...
పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా... అమలాపురం కేంద్రంగా ‘కోనసీమ’ జిల్లాను ప్రతిపాదిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే... కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని, డొక్కా సీతమ్మ పేరు పెట్టాలని, ఈ ప్రాంతంలోనే పుట్టి ఎంతో అభివృద్ధికి కారణమైన బాలయోగి పేరు పెట్టాలని ప్రజల నుంచి రకరకాల డిమాండ్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా అంబేడ్కర్ పేరు సాధించేందుకు జేఏసీ కూడా ఏర్పడింది. అందులో అధికార పార్టీతోపాటు దాదాపు అన్ని పార్టీల నేతలు భాగస్వాములే. అంబేడ్కర్ పేరు కోసం దాదాపు నెలరోజులు ఆందోళనలు జరిగాయి. మంత్రి పినిపే విశ్వరూ్పతోపాటు ఈ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వినతిపత్రం కూడా ఇచ్చారు. బహుశా... ‘టైమింగ్’ కోసం ఎదురుచూస్తున్నారు కాబోలు, ఈ విజ్ఞాపనలను ప్రభుత్వం పట్టించుకోలేదు. ‘కోనసీమ జిల్లా’ పేరునే ఖరారు చేసింది. అటు కోనసీమలో అన్ని వర్గాల వారూ సర్దుకుపోయారు. కానీ... ఉన్నట్టుండి ఈనెల 18న కోనసీమ పేరును ‘బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా’గా మార్చుతూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలుంటే చెప్పాలంటూ నెల రోజులు గడువు ఇచ్చింది.
ఆందోళనలు మొదలు...
కోనసీమ జిల్లా పేరు మార్చుతూ నోటిఫికేషన్ ఇచ్చిన రోజు అర్ధరాత్రే ఆ ప్రాంతంలో తొలి ఆందోళన జరిగింది. అది చేసింది వైసీపీ వర్గీయులే! ‘కోనసీమ జిల్లా పేరు సాధన సమితి’ పేరుతో జరిగిన ఆందోళనల్లోనూ వైసీపీ వర్గీయులు చురుగ్గా పాల్గొన్నారు. అంతకుముందు జరిగిన కలెక్టరేట్ ముట్టడిలో సుమారు 5వేల మంది పాల్గొన్నారు. మంత్రి విశ్వరూప్ అనుచరుడు అన్యం సాయి ఆత్మాహుతి యత్నం చేసుకున్నారు. విచిత్రమేమిటంటే... ప్రభుత్వానికి వ్యతిరేకంగా చీమ చిటుక్కుమన్నా సహించని పోలీసులు ఈ ఆందోళనలను పెద్దగా పట్టించుకోలేదు. మంగళవారం కూడా ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ ద్వారా ‘విధ్వంసానికి అవకాశం’ కల్పించారనే ఆరోపణలు వచ్చాయి. సుమారు నాలుగు గంటలపాటు విధ్వంసం సృష్టిస్తున్నా, బస్సును పల్టీ కొటిస్తున్నా, మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పంటించినా... పోలీసులు అడ్డుకోలేకపోయారు. మంత్రి గన్‌మెన్ తమ ఆయుధాలు వదిలేసి ఎక్కడికి వెళ్లారో తెలియదు. మరోవైపు... తాడేపల్లి కేంద్రంగా ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి ‘ఇదంతా టీడీపీ, జనసేన కుట్ర’ అని తేల్చేశారు. ఆందోళనకారులకు సర్ది చెప్పాల్సింది పోయి... ‘అంబేడ్కర్ పేరు మార్చేదిలేదు’ అని తేల్చి చెప్పారు. కోనసీమ పేరును తొలగించలేదని, కొత్తగా అంబేడ్కర్ పేరును చేర్చామనీ చెప్పలేదు. పైగా... ‘పేర్ల మార్పు నిరంతర ప్రక్రియ. ఆరు నెలల్లో ఇంకో జిల్లా పేరు మార్చొచ్చు’ అని సెలవిచ్చారు. ఆతర్వాత... తాము మాత్రమే అంబేడ్కర్ అభిమానులం అని చెప్పుకొనేలా సోషల్ మీడియాలో వ్యూహాత్మక ప్రచారం మొదలైంది. వెరసి... గోదావరి జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులను అంబేడ్కర్ పేరుతో మరోసారి వంచించే ‘స్కెచ్’ను విజయవంతంగా అమలు చేశారు.

రగులుతున్న దళితులపై...
వరుస దాడులు, సామాజికంగా, రాజకీయంగా జరుగుతున్న అన్యాయం, దూరమైన అనేక ప్రత్యేక పథకాలు... ఇలా మూడేళ్లుగా జరుగుతున్న పరిణామాలపై దళితులు లోలోపల రగిలిపోతున్నారు. ‘దళితుల ఓటు బ్యాంకు మాదే’ అనే వైసీపీ నేతల ధీమా సడలుతూ వస్తోంది. వైసీపీ సర్కారు అధికారంలో వచ్చిన తర్వాత రాజ్యాంగపరంగా ఎస్సీలకు దక్కాల్సిన సంక్షేమ పథకాలను నిలిపేసింది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంబేడ్కర్ విదేశీ విద్యను రద్దు చేసింది. ఏపీ స్టడీ సర్కిల్, అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌కు నిధులు నిలిపివేసింది. మెడికల్ సీట్ల భర్తీలో బీ, సీ కేటగిరీ సీట్లకు రిజర్వేషన్లు వర్తింపచేయకపోవడంతో ఎస్సీ విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రుణాలు మంజూరు చేయడం లేదు. ఎస్సీ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేసి, పైసా కూడా ఇవ్వడం లేదు. ఈ కార్పొరేషన్ల ద్వారా బ్యాంకు లింకు రుణాలు రద్దయ్యాయి. కులాంతర వివాహాల ప్రోత్సాహకాలను, కల్యాణ కానుకను రద్దు చేశారు. స్టాండప్ ఇండియా ద్వారా ఎస్సీ, ఎస్టీలకు రుణాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలును నిలిపేశారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా ఆపేశారు. వేల కోట్ల సబ్‌ప్లాన్ నిఽధులు దారి మళ్లించారు. భూమి కొనుగోలు పథకాన్ని రద్దు చేశారు. ఇళ్ల స్థలాల పేరిట 11 వేల ఎకరాల అసైన్డ్ భూమిని ఎస్సీ, ఎస్టీ నుంచి లాగేసుకున్నారు. ఇప్పటికీ చాలామందికి పరిహారం చెల్లించలేదు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన నిఽధులను దారిమళ్లించారు. రాజధానిలో ఏర్పాటు చేయతలపెట్టిన అంబేడ్కర్ స్మృతివనాన్ని విజయవాడకు మార్చారు. పనులు మాత్రం జరగడంలేదు. అన్ని పథకాలను ఆపివేసి... అందరికీ వర్తించే ‘నవ రత్నాలు’లోనే మీరూ లబ్ధిని వెతుక్కోండి అంటూ దళితులకు మొండిచేయి చూపించారు. మరోవైపు.. రాజకీయంగా దళితులకు అన్యాయమే జరుగుతోంది. ఉపముఖ్యమంత్రి, మంత్రి పదవులు, కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమించామంటూ దళితులను వైసీపీ మభ్యపెడుతోంది. పది మందికి పదవులిచ్చి మొత్తం దళితులను ఉద్ధరించడమెలా అవుతుందని ఆ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు.
దాడుల పరంపర...
గతంలో ఎప్పుడూ లేనివిధంగా దళితులపై దాడులు పెరిగాయి. ఎస్సీ భూములను ఆక్రమించుకుని సాగుచేసుకున్న వారు కొందరైతే, ఎస్సీల ఇళ్లపై దాడులు చేసేవారు మరి కొందరు. విశాఖలో డాక్టర్ సుధాకర్ మొదలుకుని ఇటీవల దళిత మహిళ వెంకాయమ్మ వరకు అనేక మందిపై ‘అధికార’ దాడులు జరిగాయి. తాజాగా... ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ చేతిలో మరణించిన సుబ్రహ్మణ్యం కూడా దళితుడే. ఒకవైపు దళితులను హింసిస్తూనే... మరోవైపు రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారు.
