ఏం చేశారు? ఎందుకొచ్చారు?

ABN , First Publish Date - 2022-05-20T08:38:24+05:30 IST

గుంతలుపడిన రోడ్లు.. షాక్‌కొడుతున్న కరెంటు బిల్లులు... అందని సంక్షేమ పథకాలు.. పారుతున్న మద్యం.. ఊరికి రాని సౌకర్యాలు.. ఇలా ప్రజా సమస్యలెన్నో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను..

ఏం చేశారు? ఎందుకొచ్చారు?

వైసీపీ ప్రజాప్రతినిధులకు జనం చుక్కలు

రోడ్లు..కాలువలు, విద్యుత్‌ బిల్లులు, పథకాలపై మూడేళ్లలో చేసిందేమిటని ప్రశ్నలవర్షం

సంక్షేమం ఎక్కడంటూ గ్రామాల్లో నిలదీత

‘గడప గడప’లో కొనసాగుతున్న నిరసనలు


(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌)

గుంతలుపడిన రోడ్లు.. షాక్‌కొడుతున్న కరెంటు బిల్లులు... అందని సంక్షేమ పథకాలు.. పారుతున్న మద్యం.. ఊరికి రాని సౌకర్యాలు.. ఇలా ప్రజా సమస్యలెన్నో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఇబ్బందిపెడుతున్నాయి. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కోసం వచ్చిన వాళ్లను జనం పలు జిల్లాల్లో నిలేసి..ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లుగా ఏం చేశారు.. రోడ్లు నడవటానికి వీల్లేకుండా ఉన్నాయి.. అని విజయవాడలో ఎమ్మెల్యే వెలంపల్లిపై ప్రజలు ఆగ్రహించారు. గత ప్రభుత్వంలోనూ ఇలాగే ఉన్నాయి.. అప్పుడేం చేశారని వెలంపల్లి ఎదురుదాడికి ప్రయత్నించారు. అయితే, అప్పుడు రోడ్లు బాగానే ఉన్నాయి.. మీ ప్రభుత్వమే పైపులైన్ల కోసం తవ్వి వదిలేసిందని అక్కడే వున్న ఓ మహిళ దీటుగా బదులిచ్చింది. విద్యార్థులకు గత ప్రభుత్వం విదేశీ విద్య అందించిందని, మూడేళ్లలో ఈ ప్రభుత్వం ఏం చేసిందని మరో మహిళ నిలదీసింది. సంక్షేమ పథకాల ద్వారా ఇస్తున్నదెంత, తిరిగి తీసుకుంటున్నదెంతో లెక్క చెప్పాలని మరో మహిళ ప్రశ్నించారు. 

రోడ్లు...కాలువలూ ఏవి?

గ్రామంలో కాలువలు ఏవి... రోడ్ల నిర్మాణం ఎక్కడ.. ఫించన్లు ఎప్పుడు ఇస్తారంటూ విజయనగరం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి చేశారు. విజయనగరం జిల్లా పూపపాటిరేగ మండలం కనిమెళ్ల గ్రామానికి ‘గడప గడప..’ కోసం నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు వచ్చారు. ప్రభుత్వ పథకాల గురించి ఎమ్మెల్యే తెలియజేస్తుండగా కరగాన బుచ్చోడు అనే వ్యక్తి... కొందరు రజక మహిళలు ఆయనపై విరుచుకుపడ్డారు. కాలువలు లేక తాము ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు. గ్రామంలో కొన్ని చోట్ల రోడ్లను నిర్మించాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఇళ్లు మంజూరుకాలేదు.. వచ్చిన ఫింఛను కూడా నిలిపివేశారంటూ ఇదే జిల్లా లక్కవరపుకోట మండలం కొట్యాడ గ్రామానికి చెందిన కొందరు మహిళలు.. ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును నిలదీశారు. గతంలో పింఛను వచ్చేదని, మూడు నెలల తరువాత ఆపేశారని ఎర్రా ఆదిలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేశారు. రెండుమార్లు ఇల్లు మంజూరైనా దాన్ని రద్దుచేశారని, అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నామని ఎర్రా సన్యాసమ్మ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. 


మీ వాళ్లైతే తక్కువ వయసున్నా ఇస్తారా?

‘మీ కార్యకర్తలకైతే తక్కువ వయసు ఉన్నా పింఛన్లు ఇస్తారా’ అని ఓ గ్రామస్థుడు... కురుపాం నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణిని నిలదీశారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం ఆమె పార్వతీపురం జిల్లా జియ్యమ్మవలస మండలం ఎం.అల్లువాడలో పర్యటించారు. ప్రభుత్వ పథకాలను ఆమె వివరిస్తుండగా లోలుగు త్రినాథరావు అనే వ్యక్తి తనకు అర్హత ఉన్నప్పటికీ చేయూత పథకం వర్తింపజేయలేదన్నారు. అధికారులను అడిగినప్పటికీ ఎవరూ స్పందించడం లేదన్నారు. ‘‘అర్హత ఉన్నా సంక్షేమ పథకాలు అందటం లేదు. ఇదేనా మీ ప్రభుత్వం తీరు?’’ అని నిలదీశారు. ఆయనకు సమాధానం చెప్పకుండానే పుష్పశ్రీ అక్కడి ఉంచి వెళ్లిపోయారు. 


మేం అర్హులం..పథకాలు ఇవ్వరేం?

‘మేం అర్హులం..అయినా మాకు పథకాలు ఎందుకు వర్తింపజేయరు’ అంటూ ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ను జనం నిలదీశారు. శ్రీకాకుళం జిల్లా ఆనందపురం గ్రామంలో గురువారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ను తమ సమస్యలపై స్థానికులు ప్రశ్నించారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయనను పోగిరి పాపారావు అనే వ్యక్తి నిలదీశాడు. ఇల్లు, రైతు భరోసా, అమ్మఒడి వంటి పథకాల కోసం అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదని పాపారావు మండిపడ్డారు. ‘ఏం ఇస్తున్నారని ప్రజల్లోకి వస్తున్నా’రని ఎమ్మెల్యే ఎదుటే ఆగ్రహించారు. తమకు అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడంలేదని.. వికలాంగ పింఛన్‌ అందలేదని పలువురు గ్రామస్థులు.. ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. కాగా, ఆనందపురం గ్రామంలో ఎచ్చెర్ల ఎమ్మల్యే గొర్లె కిరణ్‌కుమార్‌, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ కొన్ని గంటల ఎడంలోనే ‘గడప గడప’కు రావడం గమనార్హం. కిరణ్‌ తన కార్యక్రమాన్ని ఉదయం ఆరుగంటలకు ప్రారంభిస్తే.. బెల్లాన తొమ్మిది గంటలకు గ్రామానికి చేరుకుని ప్రజలను పథకాలపై ఆరా తీశారు.


జగనన్న ప్రభుత్వంలో తమకు ఇళ్లు మంజూరుకాలేదు, వచ్చిన ఫింఛను కూడా నిలిపివేశారని విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం కొట్యాడ గ్రామానికి చెందిన ఎర్రా సన్యాసమ్మ, ఎర్రా ఆదిలక్ష్మి కడుబండి శ్రీనివాసరావును నిలదీశారు. గురువారం కొట్యాడలో నిర్వహించిన గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును గ్రామస్థులు పలు అంశాలపై ప్రశ్నించారు. గతంలో పింఛను వచ్చేదని, మూడు నెలల తరువాత ఆపేశారని ఎర్రా ఆదిలక్ష్మి అన్నారు. రెండుమార్లు ఇల్లు మంజూరైనా దాన్ని రద్దుచేశారని, అద్దెంట్లో నివాసం ఉంటున్నామని ఎర్రా సన్యాసమ్మ తెలిపారు. 


మీ నాన్నను, అన్నను గెలిపిస్తే ఏం చేశారు? 

‘‘30 సంవత్సరాల క్రితం మీ నాన్నను గెలిపించాం. మీ అన్నను రెండు సార్లు గెలిపించాం. కానీ మా ఊరికి మీరు ఏం చేశారు.’’ అని నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి మేకపాటి విక్రమ్‌రెడ్డిని పోలిరెడ్డిపల్లి గ్రామస్థులు గురువారం నిలదీశారు. మర్రిపాడు మండలం  చిన్నమాచునూరు పంచాయతీలోని పోలిరెడ్డిపల్లిలో తన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డితో కలిసి విక్రమ్‌రెడ్డి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై ప్రజలు విక్రమ్‌రెడ్డిని నిలదీశారు. నడవడానికి సరైన రోడ్లు లేవని, వర్షం పడినప్పుడు అవి బురదతో రొచ్చురొచ్చుగా మారి దోమలతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తాను రోడ్లు వేయిస్తానని విక్రమ్‌రెడ్డి బదులు ఇవ్వగా.. ఇప్పటివరకు తమకు ఏం చేశారని నిలదీశారు. గ్రామంలో ఉండే గ్రూపు రాజకీయాలవల్లే గ్రామాభివృద్ధి కుంటు పడుతోందని, అటువంటి వాటిని  ప్రోత్సహించవద్దని మరికొందరు విక్రమ్‌రెడ్డికి సూచించారు. ఓట్లప్పుడే కనిపిస్తామా అంటూ ఓ మహిళ ఆవేశంగా ప్రశ్నించింది. 


ఎమ్మెల్యే వస్తున్నారని రోడ్డుకు సోకులు

కనగానపల్లి, మే19: అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం కుర్లపల్లి తండాకు రోడ్డు వేయిస్తానని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచారు. మూడేళ్లలో ఇటువైపు చూడని ఆయన.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కోసం ఈ గ్రామాన్ని ఎంచుకున్నారు. కుర్లపల్లి నుంచి కుర్లపల్లి తండాకు వెళ్లే రోడ్డు కంకర తేలి, పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే 24న వస్తున్న నేపథ్యంలో రోడు పక్కనున్న మట్టిని తీసి, గుంతల్లో వేస్తున్నారు. శాశ్వతంగా తారురోడ్డు వేయకుండా మట్టి వేయడం ఏంటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2022-05-20T08:38:24+05:30 IST