YCP: వైసీపీకి షాకిస్తున్న సీనియర్లు..!

ABN , First Publish Date - 2022-12-30T01:20:39+05:30 IST

సంక్షేమ బుడగ బద్దలవుతోంది. రోడ్లు వేయకున్నా.. అభివృద్ధి పనులు చేపట్టకున్నా.. పింఛన్లు, నగదు బదిలీతో గెలిచేస్తామని సంబరపడుతున్న సీఎం జగన్‌

YCP: వైసీపీకి షాకిస్తున్న సీనియర్లు..!

మూడున్నరేళ్లలో అభివృద్ధి శూన్యమని

బహిరంగ వేదికలపైనే సీనియర్ల విమర్శలు

పింఛన్లతో గెలిచేస్తామా అని ఆనం ప్రశ్న

పెన్షన్ల తొలగింపుపై కస్సుమన్న కోటంరెడ్డి

అదే తరహాలో ఇంకొందరు ఎమ్మెల్యేలు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ధిక్కార గళాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): సంక్షేమ బుడగ బద్దలవుతోంది. రోడ్లు వేయకున్నా.. అభివృద్ధి పనులు చేపట్టకున్నా.. పింఛన్లు, నగదు బదిలీతో గెలిచేస్తామని సంబరపడుతున్న సీఎం జగన్‌, ప్రభుత్వ పెద్దలకు వైసీపీ సీనియర్లే షాకిస్తున్నారు. అభివృద్ధి చేయకుండా ఏమని ఓట్లడుగుతామని సీనియర్‌ ఎమ్మెల్యేలే ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయినా ఇప్పటి దాకా చెప్పుకోదగ్గ ఒక్క కార్యక్రమమైనా ఉందా అని బహిరంగ వేదికలపైనే నిలదీస్తున్నారు. పెన్షన్లు పెంచి పంచితే గెలిచేస్తారా అని ఎద్దేవాచేస్తున్నారు. చంద్రబాబు కూడా పెన్షన్లు పెంచారని.. కానీ ఏమైందని అడుగుతున్నారు. ఎన్నికల వేళ వారి ధిక్కార స్వరం ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలనపై పాలకపక్షంలోనే ముసలం పుట్టింది. మరో 15 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ చైతన్యం అత్యధికంగా ఉన్న నెల్లూరు జిల్లాలో వైసీపీ సీనియర్‌ శాసనసభ్యుల నుంచే తిరుగుబాటు ప్రారంభమైంది. తన నియోజకవర్గంలో మురుగునీటి కాలువ సమస్యపై నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేపట్టిన నిరసన కార్యక్రమం ఒక్కసారిగా యావత్తు రాష్ట్రాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఆయన స్వయంగా కాలువలోకి దిగి నిరసన తెలుపడంతో రాష్ట్రం దృష్టంతా అటు మళ్లింది. ఇది రైల్వే శాఖకూ, స్థానిక ప్రభుత్వానికి దశాబ్దాలుగా నడుస్తున్న వివాదంగా కొందరు పేర్కొన్నా.. వైసీపీ పెద్దలు మాత్రం కోటంరెడ్డిది ధిక్కార స్వరమేనని భావిస్తున్నారు. వారెంత చెప్పినా ఆయన తన పంథా మార్చుకోలేదు.

ఇటీవల తన నియోజకవర్గంలో పింఛన్ల కోతపై బాహాటంగానే విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారం ఇలా ఉండగానే వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బుధవారం అధికార వేదికలపై చేసిన వ్యాఖ్యలు పాలకపక్షాన్ని ఇరుకున పెట్టేశాయి. జగన్‌ సర్కారు సంక్షేమ పథకాలపై విస్తృతస్థాయిలో ప్రచారం చేసుకుంటోంది. ముఖ్యమంత్రిగా జగన్‌ వచ్చాకే పింఛన్లు భారీగా పంపిణీ జరుగుతున్నట్లు ఊదరగొడుతోంది. కానీ ఆనం సొంత పార్టీనే ఇరుకునపడేశారు. చంద్రబాబు హయాంలోనూ పింఛన్లు ఇచ్చారని.. అయితే 2019లో గెలిచారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని కళ్లకు గట్టారు. గుంతలపై తట్టెడు మట్టి పోశామా అని నిలదీశారు. పింఛన్ల కింద ఇచ్చే సొమ్ము.. ఈ రోడ్లపై ప్రయాణం ద్వారా వచ్చే బాధలకు చాలడం లేదని ఎద్దేవాచేశారు. తద్వారా ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించినట్లయింది. ఆనం తీరు ప్రభుత్వ పెద్దలకు మింగుపడనిదిగా మారిందని వైసీపీ వర్గాలే అంతర్గతంగా పేర్కొంటున్నాయి. ఆయన్ను తిట్టించడానికి స్థానిక ద్వితీయశ్రేణి నేతలను పురమాయించారు. వాస్తవానికి ఆయనకు పొగబెట్టి సాగనంపే కార్యక్రమాలకు ఏనాడో పార్టీ నాయకత్వం శ్రీకారం చుట్టింది. మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు రామ్‌కుమార్‌రెడ్డిని బరిలోకి దించింది. జిల్లా అధ్యక్షుడిని కూడా చేసింది. భవిష్యత్‌లో వెంకటగిరి ఎమ్మెల్యే తానేనని ఆయన బహిరంగంగానే చెప్పుకొంటున్నారు. ఆనం దీనిపైనా పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. 2024 వరకు తానే ఎమ్మెల్యేగా ఉండేలా ప్రజలు ఎన్నుకున్నారని.. ఇంతకు తాను ఉన్నట్లో, లేనట్లో వైసీపీ సమన్వయకర్త స్పష్టత ఇవ్వాలని వేదికపైనే నిలదీశారు. రాజకీయ చైతన్యం బాగా ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఇలా అసంతృప్తి వ్యక్తంచేయడం.. అభివృద్ధి జరగడంలేదని.. సంక్షేమ పథకాల్లో కోత పెడుతున్నారని ఆగ్రహించడం పార్టీ పెద్దల్లో అలజడి రేపుతున్నాయి.

అసంతృప్తి స్వరం క్రమంగా రాష్ట్రమంతా వ్యాపిస్తుందన్న ఆందోళన వారిలో కనిపిస్తోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో కడప జిల్లాలోని మైదుకూరు వైసీపీ సీనియర్‌ నేత.. మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి నేరుగా సీఎం జగన్‌పైనే విమర్శనాస్త్రాలు గుప్పించారు. రాజశేఖర్‌రెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడు అవుతాడని జీవితంలో అనుకోలేదన్నారు. సొంత సామాజికవర్గ నేతలే ఇలా జగన్‌ను టార్గెట్‌ చేయడంతో ప్రభుత్వ పెద్దలు ఇరకాటంలో పడుతున్నారు. ఇంకొందరు ఎమ్మెల్యేలు బయటపడకపోయినా.. అంతర్గతంగా జగన్‌ పాలనపై పెదవివిరుస్తున్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా వెళ్తుంటేనే అభివృద్ధి పనులపై జనం నిలదీస్తున్నారని లోలోన మదనపడుతున్నారు.

పథకాల కోతతో వ్యతిరేకత..

2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అభివృద్ధి కార్యక్రమాలపై ముందడుగు పడకపోవడం.. అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కోత వేస్తుండడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని.. ఇది ప్రతిపక్షాలకు ఆయుధంగానే గాక బలంగానూ మారుతుందని వైసీపీ ముఖ్య నేతలు బాహాటంగానే అంగీకరిస్తున్నారు. జగన్‌ను, ప్రభుత్వాన్ని ఎవరైనా ఏమైనా అంటే.. గతంలో ఎమ్మెల్యేల నుంచి మంత్రుల దాకా ఎక్కడికక్కడ నోరేసుకుని బూతులు తిట్టేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదని.. వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్ని అంశాలపైనా వివరణ ఇచ్చుకోవలసి వస్తోందని చెబుతున్నారు. గ్రామాల నుంచి మున్సిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల ఇళ్లు ఉంటే.. సంక్షేమ పథకాలన్నిటినీ రద్దు చేస్తున్నారు.

ఇలా విలీన మున్సిపాలిటీల్లో పథకాలు వేలకొద్దీ రద్దవుతున్నాయి. ఇటీవల సీఎం గడప గడపకు కార్యక్రమంపై నిర్వహించిన వర్క్‌షాపులో..ఎమ్మెల్యేలు ప్రతి ఇంట్లో ఐదు నిమిషాలు కూర్చోవాలని ఆదేశించారు. అయితే వారు ఈ ఆదేశాలను పాటించడం లేదు. ఓవైపు అభివృద్ధి లేక.. ఉన్న పథకాలూ రద్దు చేస్తుంటే ప్రజల ముందుకెళ్లి ఏం సమాధానం చెప్పాలని మెజారిటీ ఎమ్మెల్యేలు మధనపడుతున్నారు. దీనికితోడు ప్రతి నియోజకవర్గానికి ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఐ-ప్యాక్‌ టీమ్‌ ప్రతినిధి వచ్చి వైసీపీ ఎమ్మెల్యేల పనితీరును పరిశీలిస్తున్నారు. వైసీపీ సమన్వయ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటున్నారు. ఇది ఎమ్మెల్యేలకు చాలా ఇబ్బందికరంగా మారింది.

Updated Date - 2022-12-30T10:34:17+05:30 IST