టార్గెట్లతో టార్చర్‌

ABN , First Publish Date - 2022-10-17T09:24:07+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. ప్రతి రోజూ ఉన్నతాధికారులు టార్గెట్లు పెట్టి మరీ వేధిస్తుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సెలవులు, ఆఫీసు వేళలు అని లేకుండా నిత్యం అధికారులు టెలికాన్ఫరెన్స్‌ పెట్టి వెంటపడుతున్నారు.

టార్గెట్లతో టార్చర్‌

‘సచివాలయ’ ఉద్యోగులపై పని ఒత్తిడి 

ఉన్నతాధికారుల నుంచి వేధింపులు

టార్గెట్లు పూర్తి చేయకపోతే సస్పెన్షన్‌,

షోకాజ్‌ నోటీసులంటూ హెచ్చరికలు

చెత్త పన్ను వసూలు సహా ఎన్నో పనులు

పథకాలందని వారి నుంచి నిత్యం గ్రీవెన్స్‌

పరిష్కారానికి ఏర్పాటు కాని యంత్రాంగం

సమాధానం చెప్పలేక నలిగిపోతున్న వైనం


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. ప్రతి రోజూ ఉన్నతాధికారులు  టార్గెట్లు పెట్టి  మరీ వేధిస్తుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సెలవులు, ఆఫీసు వేళలు అని లేకుండా నిత్యం అధికారులు టెలికాన్ఫరెన్స్‌ పెట్టి వెంటపడుతున్నారు. టార్గెట్లు పూర్తి చేయకపోతే సస్పెండ్‌ చేస్తామని, షోకాజ్‌ నోటీసులు ఇస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో కింది స్థాయి ఉద్యోగులు మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారు. అటు అధికారులు, ఇటు గ్రామాల్లో లబ్ధిదారుల మధ్య నలిగిపోతున్నారు. క్షేత్రస్థాయిలో చేయాల్సిన పనులకు, అధికారులిస్తున్న ఆదేశాలకు పొంతన ఉండటం లేదు. పలు పథకాలు అందని ప్రజలు తమ సమస్యలను గ్రీవెన్స్‌లో పెడితే... పరిష్కరించే యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ముఖ్యంగా గ్రామ సచివాలయాల్లో డిజిటల్‌ అసిస్టెంట్‌, అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌, వార్డు సచివాలయాల్లో వార్డు ఎడ్యుకేషన్‌, డేటా వెరిఫికేషన్‌ అసిస్టెంట్‌లు మరింత పనిఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల పని ఒత్తిడి తట్టుకోలేక, ఉన్నతాధికారుల వేధింపులకు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 


ప్రతి దానికి టార్గెట్లు 

15 రకాల యాప్‌లు విడుదల చేసి వాటినన్నింటికీ టార్గెట్లు పూర్తి చేయాలని గుడ్డిగా ఆదేశించడం, పూర్తికాకపోతే బెదిరించడం ఉన్నతాధికారులకు అలవాటైపోయిందని సిబ్బంది అంటున్నారు. కనీసం రోజుకు 35 సర్వీసులు అందించకపోతే షోకాజ్‌ నోటీసులిస్తున్నారని చెబుతున్నారు. సర్వీసుల కోసం ప్రజలు రాకపోతే తామెలా చేయగలమని ప్రశ్నిస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చెత్త పన్ను వసూలుకు కూడా సచివాలయ సిబ్బందికి టార్గెట్లు పెడుతున్నారు. సర్వీసు చార్జీల కింద వసూలు చేసిన మొత్తాన్ని బ్యాంకులో ప్రభుత్వ ఖాతాల్లో ఏ రోజుకారోజు జమ చేయకపోయినా షోకాజ్‌ నోటీసులిస్తున్నారని చెబుతున్నారు.


పట్టణాల్లో మరణ, జనన ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చిన దరఖాస్తులను ఆయా మున్సిపల్‌ కార్యాలయంలో సిబ్బంది అందజేయాల్సి ఉంటుంది. ఆ సమయాల్లో సచివాలయాలకు వచ్చే జనాలకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ఓటరు జాబితాకు ఆధార్‌ లింక్‌ చేయడానికి డిసెంబరు వరకు అవకాశం ఉన్నా ప్రతి రోజు టార్గెట్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ ఉద్యోగికి మూడు సార్లు అటెండెన్స్‌ తీసుకోరని, విచిత్రంగా ఒక్క సచివాలయ ఉద్యోగులే మూడు దఫాలు అటెండెన్స్‌ వేసుకోవాల్సి వస్తోందంటున్నారు. సెలవు దినాలతో పాటు క్యాజువల్‌ లీవ్‌లు కూడా వినియోగించుకోలేని దుస్థితిలో ఉన్నామని చెబుతున్నారు. ఆదివారాలు, పండుగలు, ఉదయం, సాయంత్రం అనేది లేకుండా 365 రోజులు విధులు నిర్వహించాల్సి వస్తోందంటున్నారు. పైగా వేధింపులు, పనులు చేయడం లేదనే అపవాదులు భరించాల్సి వస్తోందని వాపోతున్నారు.

 

గ్రీవెన్స్‌ను పరిష్కరించే వ్యవస్థ ఏదీ? 

పలు సంక్షేమ పథకాలు తమకు అందలేదంటూ గ్రామ, వార్డు సచివాలయాల్లో గ్రీవెన్స్‌కు ప్రతి రోజు జనం క్యూ కడుతున్నారు. సిబ్బంది నమోదు చేసిన గ్రీవెన్స్‌ను పరిష్కరించే వ్యవస్థ ఉన్నత స్థాయిలో లేదు. ఉదాహరణకు ఒక లబ్ధిదారుడికి ఆరంచెల వ్యాలిడేషన్‌ ద్వారా అమ్మఒడి పథకం అందకపోతే అందుకు ఐటీ రిటర్న్స్‌ ఉండటం కారణం కావచ్చు. ఎప్పుడో 2011లో ఇంటి నిర్మాణాల కోసం ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేశారు. ఇప్పుడు వాటిని అడ్డం పెట్టుకుని వారికి పథకం నిలిపేస్తున్నారు. దీనికి గ్రీవెన్స్‌ పెడితే పరిష్కరించే వ్యవస్థ గ్రామ, వార్డు సచివాలయాల్లో లేకపోవడంతో జనాలు సిబ్బందిని అడుగుతున్నారు. అలాగే పలువురు అమ్మఒడి లబ్ధిదారులకు ఈ ఏడాది మార్చి నుంచి ఎన్‌పీసీఐ ద్వారా వారి బ్యాంక్‌ ఖాతాలను ఆధార్‌తో లింక్‌ చేయడంతో డబ్బులు పడలేదు. పలువురు లబ్ధిదారులకు సంబంధించి ఎప్పుడో వారి ఆధార్‌ నెంబర్‌తో  పాత బ్యాంక్‌ ఖాతాలను లింక్‌ చేసి ఉండగా, ఇప్పుడు ఆ ఖాతాలు ఫ్రీజ్‌ అయ్యాయి. ఆ ఖాతాల్లో డబ్బులు పడినా కనిపించవు. ఈ సమస్యలను పరిష్కరించే పరిస్థితి లేదు. కొందరికి విద్యుత్‌ 300 యూనిట్లు వాడకపోయినా, పట్టణాల్లో స్థలాలు లేకపోయినా సంక్షేమ పథకాలు ఆగిపోయాయి.


ఈ సమస్యలను పరిష్కరించే యంత్రాంగం లేకపోవడంతో లబ్ధిదారులతో తాము మాటలు పడాల్సి వస్తోందని సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రతి పథకానికి ముందుగా ఒకసారి, ప్రారంభమైన తర్వాత మరోసారి, స్కీం పూర్తయిన తర్వాత మరోసారి ఈకేవైసీ చేయించాలని టార్గెట్లు పెడుతున్నారు. ఔట్‌ రీచ్‌ పేరిట పట్టణాల్లో ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారుల సంతృప్తి స్థాయిని, వారి అభిప్రాయాలను నమోదు చేయడం... ఇలా అవసరమున్నా, లేకున్నా అనేక పనులు చేయిస్తున్నారని చెబుతున్నారు. చివరకు ల్యామినేషన్‌ టార్గెట్లు చేయలేదని కూడా షోకాజ్‌ నోటీసులిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వలంటీర్లు అధికార పార్టీకి చెందినవారు కావడంతో ఫలానా పని చేయాలని సిబ్బంది గట్టిగా ఆదేశించలేకపోతున్నారు. ఒకటో తేదీ పెన్షన్‌ పంచడం తప్ప మరే పనికీ ఉపయోగపడటం లేదంటున్నారు. ప్రభుత్వం పని ఒత్తిడి తగ్గించి సచివాలయ ఉద్యోగుల సేవలను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని గ్రామ, వార్డు సచివాలయ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గుడి నాగరాజు కోరారు. 


ఈ-క్రాప్‌ సిబ్బందిపైనా ఒత్తిడి 

పనిభారంతో వీఏఏ, వీహెచ్‌ఏలు సతమతం

రెండుసార్లు గడువు పెంచారు. సీజన్‌ ముగిసింది. ఇప్పటికీ ఖరీఫ్‌ పంటల ఈ-క్రాప్‌ నమోదు నూరు శాతం పూర్తి చేయలేకపోయినట్లు తెలుస్తోంది. గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ (వీఏఏ), ఉద్యాన (వీహెచ్‌ఏ), రెవెన్యూ సహాయకులకు ఈ బాధ్యతను అప్పగించిన ప్రభుత్వం.. ఈ-క్రాప్‌ విధానంలో తలెత్తుతున్న సమస్యల్ని మాత్రం పరిష్కరించడం లేదు. ఈ-క్రాప్‌ నమోదుకు సిబ్బందిపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడం తప్ప.. సమస్యలకు కారణాలపై దృష్టిపెట్టిన దాఖలా లేదు. ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ రకం పంట సాగు చేస్తున్నారో వివరాలు సేకరించి, ప్రభుత్వ పథకాలకు అర్హులైన రైతులకు రాయితీలు, పెట్టుబడి సహాయం అందించి, పంట ఉత్పత్తుల కొనుగోలు చేసేందుకు ఈ-క్రాప్‌ నమోదు చేపట్టారు. అయితే తరచూ ఈ-క్రాప్‌ నిబంధనలు, సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయడం, కాన్ఫరెన్స్‌లు, మెయిల్స్‌తో సమయాన్ని వృథా చేయడం, ఇతర పనులు అప్పగించి వెంటనే పూర్తి చేయాలని టార్గెట్లు పెడుతున్నారు.


రైతులతో  ఈ-కేవైసీ చేయించే బాధ్యతను కూడా వారికే అప్పగించారు. ఈ-క్రాప్‌ నమోదు చేసే యాప్‌ అన్ని మొబైళ్లలో పని చేయడం లేదని, ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌ల్లోనూ వేగంగా సాగడం లేదని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. రోజుకు 50 ఎకరాలకు తగ్గకుండా ఈ-క్రాప్‌ చేయాలని టార్గెట్‌ పెట్టారు. కానీ యాప్‌ పగటి వేళల్లో సక్రమంగా పని చేయడం లేదని చెబుతున్నారు. పగలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, రాత్రి వేళల్లో ట్యాబ్‌లో నమోదు ప్రక్రియ చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. వ్యవసాయ, ఉద్యాన సహాయకులు ఈ-క్రాప్‌, ఈ-కేవైసీతో పాటు ఆర్బీకేల్లో విత్తనాలు, ఎరువుల అమ్మకం, వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు, పొలం బడి, పంట కోత ప్రయోగాలు, రైతు భరోసా గ్రీవెన్స్‌ వంటి పని ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. సిబ్బందికి తోడ్పాటుగా ఇటీవల ఒక్కో ఆర్బీకేకు ఒక వలంటీర్‌ను నియమించినా వారిపై పనిభారం తప్పడం లేదు. అధికారుల ఒత్తిడితో తూర్పుగోదావరి జిల్లాలో ఒక గ్రామ ఉద్యాన సహాయకుడు బలవన్మరణానికి పాల్పడినట్లు వ్యవసాయ, ఉద్యాన సహాయకులు ఆరోపిస్తున్నారు. 


రెండుసార్లు గడువు పొడిగించినా.. 

రాష్ట్రంలో పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1,12,39,297.34 ఎకరాలు ఉంది. ఇప్పటి వరకు 50,08,866 మంది రైతులకు చెందిన 1,11,77,721.53 ఎకరాలను ఈ-క్రా్‌పలో నమోదు చేశారు. ఇంకా 61 వేల ఎకరాలు చేయాల్సి ఉంది. ఈ-క్రాప్‌ నమోదును ఆగస్టు రెండో వారంలో ప్రారంభించిన అధికారులు మొదట గత నెల 25 వరకు గడువు విధించారు. అప్పటికి 68ు కూడా పూర్తి కాకపోవడంతో గడువును ఈ నెల 2 వరకు పెంచారు. ఆ సమయానికి కూడా పూర్తికాకపోవడంతో మళ్లీ ఈ నెల 14వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఖరీఫ్‌ సీజన్‌ ఈ నెల 15తో ముగిసినా లక్ష్యాన్ని మాత్రం సాధించలేకపోయారు. రైతుల వేలిముద్రలను బయో మెట్రిక్‌లో నమోదు చేసే ఈ-కేవైసీ ప్రక్రియలో కూడా బాగా జాప్యం జరుగుతోంది. ఈ కారణంతో ప్రభుత్వ పథకాల లబ్ది రైతులందరికీ అందే పరిస్థితి లేకుండా పోతోంది. ముఖ్యంగా కౌలు రైతులకు అన్యాయం జరుగుతోంది. 


Updated Date - 2022-10-17T09:24:07+05:30 IST