మూడేళ్లలో ఒక్క ఇల్లూ కట్టలేదు

ABN , First Publish Date - 2022-07-05T07:57:01+05:30 IST

అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నిలదీతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై మహిళలు నిలదీస్తుండటంతో దిక్కుతోచక, ఆ దృశ్యాలను..

మూడేళ్లలో ఒక్క ఇల్లూ కట్టలేదు

ప్రభుత్వ విప్‌ కాపుపై మహిళ ఫైర్‌ 

గడప గడపలో చేదు అనుభవాలు 

చిత్రీకరించిన విలేకరులపై చిందులు 


బొమ్మనహాళ్‌, జూలై 4: అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నిలదీతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై మహిళలు నిలదీస్తుండటంతో దిక్కుతోచక, ఆ దృశ్యాలను చిత్రీకరించే విలేకరులపై చిందులు వేశారు. బొమ్మనహాళ్‌ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ‘‘ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఒక్క ఇల్లు కూడా కట్టలేదు’’ అని బండూరు గ్రామంలో చెన్నమ్మ అనే మహిళ కాపుని నిలదీశారు. చెన్నమ్మ ఇంటి వద్దకు ఆయన వెళ్లగానే ‘‘నాకు ఇల్లు రాలేదు. ఒక్క కొంప కూడా కట్టలేదు’’ అని మండిపడ్డారు. దీంతో కాపు ఖంగుతిన్నారు. ఆమె నిలదీతలను చిత్రీకరిస్తున్న ఆంధ్రజ్యోతి, మరో పత్రిక విలేకరిని దగ్గరకు పిలిచి... సెల్‌ఫోన్లు లాక్కొని వీడియోలు, ఫొటోలను తొలగించారు. పత్రికల యాజమాన్యాలను దూషించారు. ‘‘మా ప్రభుత్వ కార్యక్రమాలకు కవరేజీకి రావాల్సిన అవసరం లేదు. ఇక నుంచి వస్తే మీ ఇష్టం’’ అని వార్నింగ్‌ ఇచ్చారు. అనంతరం చెన్నమ్మకు కరపత్రం ఇచ్చి ఫొటో దిగారు.


అంతకు మునుపు అదే గ్రామంలో శాంతమ్మ అనే మహిళ తన భర్తకు పక్షవాతం వచ్చి మంచం పట్టాడని, పింఛన్‌ కోసం తిరిగి తిరిగి విసిగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు ఎమ్మెల్యే సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్లిపోయారు. అనంతరం విప్‌ కాపు హరేసముద్రం గ్రామానికి బయలుదేరారు. అప్పటికే గ్రామానికి చేరుకున్న విలేకరులను వైసీపీ నాయకులు చంద్రశేఖర్‌ రెడ్డి, జయరామిరెడ్డి, లక్ష్మీనారాయణ, సర్పంచ్‌ తిప్పేస్వామి తదితరులు గ్రామం నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు.  ప్రభుత్వ కార్యక్రమం కావడంతో తాము వస్తున్నామని విలేకరులు చెప్పినా వినుకోలేదు. అంతలో ఎస్‌ఐ దిలీప్‌ కుమార్‌ అడ్డగించారు. పోలీసులు అడ్డుకోవడాన్ని విలేకరులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 

Read more