వైసీపీ ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణ జీవోలు వెనక్కి

ABN , First Publish Date - 2022-10-14T07:32:57+05:30 IST

వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసులను ఉపసంహరించేందుకు జారీ చేసిన 9 జీవోలను వెనక్కి తీసుకున్నట్లు హైకోర్టుకు రాష్ట్ర హోం శాఖ నివేదించింది.

వైసీపీ ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణ జీవోలు వెనక్కి

  • హైకోర్టుకు ప్రభుత్వ నివేదన.. 
  • వ్యాజ్యాలను పరిష్కరించిన కోర్టు
  • హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వ నివేదన

అమరావతి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసులను ఉపసంహరించేందుకు జారీ చేసిన 9 జీవోలను వెనక్కి తీసుకున్నట్లు హైకోర్టుకు రాష్ట్ర హోం శాఖ నివేదించింది. అందుకు సంబంధించి జారీ చేసిన జీవోను మెమో రూపంలో కోర్టు ముందు ఉంచామన్నారు. ఆ శాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది మహేశ్వరరెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు అనుమతి తీసుకున్న తర్వాతే కేసుల ఉపసంహరణ విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. కేసుల ఉపసంహరణ విషయంలో ప్రభుత్వ జీవోలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరించినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిప్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. 


హైకోర్టు అనుమతి లేకుండా పూర్వ, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసులు ఉపసంహరించడానికి వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 2020 నవంబరు 16 నుంచి 2021 ఆగస్టు 25లోపు రాష్ట్రంలో ప్రజాప్రతినిధులపై కేసులు ఉపసంహరించేందుకు ఎన్ని జీవోలు జారీ చేశారో పరిశీలించేందుకు హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. వైసీపీ ఎమ్మెల్యేలు విడదల రజని, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, గంగుల బ్రిజేంద్రారెడ్డి, జక్కంపూడి రాజా, మేకా ప్రతాప్‌ అప్పారావు, ఎంపీ మిథున్‌రెడ్డి, టీటీటీ చైర్మన్‌, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డిపై కేసుల ఉపసంహరణకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు సిఫారసు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను అందులో ప్రస్తావించింది. మరోవైపు సామినేని ఉదయభానుపై ఉన్న కేసులు ఉపసంహరణకు ఇచ్చిన జీవోలను సవాల్‌ చేస్తూ ఏపీ జర్నలిస్ట్‌ ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యాలన్నీ గురువారం మరోసారి విచారణకు వచ్చాయి. కేసులు ఉపసంహరిస్తూ ఇచ్చిన జీవోలను విత్‌డ్రా చేసుకున్నట్లు ప్రభుత్వం చెప్పడంతో ఆ వ్యాజ్యాలను ధర్మాసనం డిస్పోజ్‌ చేసింది. 


ఆ కేసుల డైరీలు సమర్పించండి..

హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా కేసుల ఉపసంహరణ కోసం అనుమతి కోరుతూ హైకోర్టుకు లేఖలు రాశామన్నారు. దాని ఆధారంగానే హైకోర్టు సుమోటో కేసు నమోదు చేసిందని తెలిపారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. సంబంధిత కేసుల డైరీలను కోర్టు ముందుంచాలని హోం శాఖను ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది.

Updated Date - 2022-10-14T07:32:57+05:30 IST