ఇంత ధిక్కారమా?

ABN , First Publish Date - 2022-12-15T03:30:43+05:30 IST

కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు(ఆర్‌బీకే), ఆరోగ్య కేంద్రాలు నిర్మించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇంత ధిక్కారమా?

స్కూళ్లలో సచివాలయాలు, ఆర్‌బీకేలు వద్దంటే నిర్మిస్తారా?

అవన్నీ అక్రమ నిర్మాణాలే.. కాంట్రాక్టర్లకు చెల్లింపులూ అక్రమమే

బాధ్యులైన అధికారుల నుంచే సొమ్ము రాబడతాం

22న కోర్టు ముందుకొచ్చి వివరణ ఇవ్వండి

సీఎస్‌ జవహర్‌రెడ్డికి హైకోర్టు ఆదేశం

అమరావతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు(ఆర్‌బీకే), ఆరోగ్య కేంద్రాలు నిర్మించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణాలు చేపట్టవద్దని 2020 జూన్‌లో తామిచ్చిన ఆదేశాలను పక్కనపెట్టి నిర్మాణాలు చేపట్టారని మండిపడింది. తమ ఆదేశాలు ఉల్లంఘించి నిర్మించిన ఆ భవనాలు అక్రమమేనని.. ఆ నిర్మాణాల కోసం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు కూడా అక్రమమేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలకు ప్రభుత్వ ఖజానా నుంచి అధికారులు సొమ్ము చెల్లించారని, ఆ సొమ్మును వారి నుంచే రాబడతామని స్పష్టం చేసింది. ఈ వ్యవహారం పాఠశాల విద్య, పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖలతో ముడిపడి ఉన్నందున ఈ నెల 22న తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని సఎస్‌ జవహర్‌రెడ్డిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ బుధవారం ఆదేశాలిచ్చారు.

ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని 2020 జూన్‌ 11న హైకోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ భవన నిర్మాణాలు కొనసాగిస్తున్నారని పేర్కొంటూ గత ఏడాది పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన న్యాయస్థానం పాఠశాలల స్థలాలకు రక్షణ కల్పించే నిమిత్తం సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తిని అమికస్‌ క్యూరీ(కోర్టుకు సహాయకుడి)గా నియమించింది. పాఠశాలల ఆవరణలో నిర్మాణాలు తొలగించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో స్థాయీ నివేదికలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి. స్థాయీ నివేదికలను ప్రభుత్వం కోర్టు ముందుంచింది. దానిని పరిశీలించిన న్యాయమూర్తి.. నిర్మాణాలు తొలగింపులో ఎలాంటి పురోగతీ లేదంటూ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 239 పాఠశాలల్లో సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల నిర్మాణాలు చేపట్టారు. వాటిలో 63 చోట్ల పనులు పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల వివిధ దశల్లో ఉన్నాయన్నారు. నిర్మాణాలు చేసినందుకుగాను ఇప్పటివరకు రూ.40 కోట్లు చెల్లించాం. నిర్మాణాలు పూర్తయితే సంబంధిత పాఠశాలలైనా వాటిని వినియోగించుకోవచ్చు. అనేక శాఖలతో ముడిపడిన వ్యవహారం అయినందున కోర్టు ఉత్తర్వుల అమలులో జాప్యం జరిగిన మాట వాస్తవమే’ అని పేర్కొన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. విద్యార్థుల చదువుకు భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే నిర్మాణాలు వద్దని ఉత్తర్వులు ఇచ్చామన్నారు. ఉత్తర్వులు ఉల్లంఘించి చేపట్టిన భవన నిర్మాణాలను అక్రమమైనవిగా భావిస్తున్నామని.. ఆ నిర్మాణాలకు చెల్లింపులు చేయడమూ అక్రమమేనని.. బాధ్యులైన అధికారుల నుంచి ఆ సొమ్మును రాబడతామని స్పష్టం చేశారు. 22న సీఎస్‌ హాజరుకు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

Updated Date - 2022-12-15T03:30:44+05:30 IST