సుప్రీం కోర్టునే తప్పుదారి పట్టిస్తారా?

ABN , First Publish Date - 2022-08-21T09:24:10+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ అప్పుల విషయంలో తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీం కోర్టును తప్పు దోవ పట్టించేలా ఉందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శించారు.

సుప్రీం కోర్టునే తప్పుదారి పట్టిస్తారా?

  • ప్రభుత్వాన్ని అడిగితే, పార్టీ తరఫున విజయసాయి పిటిషన్‌ వేయడం ఏంటి?
  • అప్పుల వివరాలతో సుప్రీంకు లేఖ రాస్తా
  • భూమన వ్యాఖ్యలు మా నేతను ఉద్దేశించేమో?
  • మద్యం నగదు విక్రయాలపై గవర్నర్‌, సీఎం సీబీఐ విచారణ కోరాలి: రఘురామ  


న్యూఢిల్లీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ అప్పుల విషయంలో  తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీం కోర్టును తప్పు దోవ పట్టించేలా ఉందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శించారు. విజయసాయి తప్పుడు పిటిషన్‌ దాఖలు చేశారని, తమ పార్టీ మేలు కోసం తాను మరొక పిటిషన్‌ దాఖలు చేస్తానని తెలిపారు. పార్టీని రక్షించుకోవడానికి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తన వద్ద ఉన్న పూర్తి ఆధారాలతో అప్పుల సమాచారాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ ద్వారా నివేదిస్తానని చెప్పారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానానికి విజయసాయిరెడ్డి ఇచ్చిన వివరణ హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘‘రాష్ట్రంలో కొత్తగా ఒక్క ఆస్పత్రి కూడా నిర్మించలేదు. 6 వేల ప్రభుత్వ పాఠశాలలను ఎత్తివేసి, విద్య, వైద్యానికి నిధులు ఖర్చు చేస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు. అమ్మ ఒడి, చెల్లి జడ ఇస్తున్నామని చెప్పడం అలవాటుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాలను పిటిషన్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు చెబితే పార్టీ తరఫున విజయసాయిరెడ్డి దాఖలు చేయడం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ‘రాష్ట్ర జీఎ్‌సడీపీలో 41 శాతం  మాత్రమే అప్పులు చేశాం.


మా రాష్ట్రం టాపు... మా సీఎం తోపు’ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. జీవీ రెడ్డి చెప్పిన లెక్కల  ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.8.15 లక్షల కోట్లు. కొన్ని నెలల క్రితం ఉన్న సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు  రూ.7,88,837 కోట్లు. ఈ లెక్కన  రాష్ట్ర  జీఎ్‌సడీపీలో ప్రభుత్వం 77 శాతం  అప్పులు చేసింది’’ అని రఘురామ తెలిపారు. వచ్చే పార్లమెంట్‌  సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లు చర్చకు వచ్చే అవకాశం లేదన్నారు. ఈ బిల్లు గురించి అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 


న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తూ న్యాయమూర్తులకు హెచ్చరికలు చేయడం ద్వారా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి లక్ష్మణ రేఖ దాటారని వ్యాఖ్యానించారు. వెంకట్రామిరెడ్డిపై రిజిస్ట్రార్‌ జనరల్‌ సుమోటోగా కేసు నమోదు చేస్తే.. ఈ తరహా వ్యాఖ్యలు చేేస వారిని కట్టడి చేయడానికి ఒక హెచ్చరికలా ఉంటుందన్నారు. మద్యం నగదు విక్రయాలపై సీబీఐ విచారణ కోరుతూ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌,  సీఎం జగన్‌ లేఖ రాయాలని సూచించారు. రూ.30 వేల నుంచి రూ.35 వేల కోట్ల నగదు లావాదేవీలు జరుగుతున్న మద్యం విక్రయాలపై సీబీఐ విచారణ కోరాలన్నారు. పతనమైన వ్యక్తిని ఉన్నత పదవిలో పెడితే ఇలాగే ఉంటుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రముఖ దినపత్రికలు ప్రచురించాయని, కానీ జగన్‌ సొంత పత్రికలో ఎడిట్‌ చేయడాన్ని పరిశీలిేస్త ఆ వ్యాఖ్యలు తమ నాయకుడ్ని ఉద్దేశించి అన్నారేమో అనే అనుమానం కలిగిందన్నారు.


దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితానికి మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ బలమైన పునాదులు వేశారని చెప్పారు. కొంతమంది నాయకులు చేసిన మేలును మరిచిపోయినప్పటికీ, వైఎస్‌ అభిమానులు మాత్రం రాజీవ్‌ గాంధీని ఎప్పటికీ స్మరించుకుంటూనే ఉంటారన్నారు. రాజీవ్‌ గాంఽధీ 78వ జయంతి సందర్భంగా పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. 

Updated Date - 2022-08-21T09:24:10+05:30 IST