ఇంటర్‌ కాలేజీలపై కొరడా!

ABN , First Publish Date - 2022-12-26T03:55:57+05:30 IST

ఇంటర్‌ కాలేజీలపై కొరడా ఝుళిపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నిర్దేశిత ప్రమాణాలు పాటించని కాలేజీల గుర్తింపును శాశ్వతంగా రద్దు చేయాలని నిర్ణయించింది.

ఇంటర్‌ కాలేజీలపై కొరడా!

ప్రమాణాలు లేకపోతే శాశ్వతంగా రద్దు

వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు

తనిఖీల కోసం త్రిసభ్య కమిటీలు

భవనాలు, ల్యాబ్‌లు, ఎఫ్‌డీఆర్‌ తప్పనిసరి

ఇప్పటికే 174 కాలేజీల్లో లేవని గుర్తింపు

మొత్తం 200పైగా రద్దు కావొచ్చని అంచనా

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఇంటర్‌ కాలేజీలపై కొరడా ఝుళిపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నిర్దేశిత ప్రమాణాలు పాటించని కాలేజీల గుర్తింపును శాశ్వతంగా రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ విషయంలో రెండు నెలల క్రితమే కీలక నిర్ణయం తీసుకోగా... అది అమలు కాలేదు. ప్రమాణాలు పాటించడం లేదంటూ 174 కాలేజీల గుర్తింపు రద్దు చేస్తున్నట్లు కాలేజీలకు తెలిపింది. వాటిలో చదువుతున్న విద్యార్థులను ఇతర కాలేజీలకు సర్దుబాటు చేయాలని ఆదేశించింది. అయితే, కొన్ని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. విద్యార్థులను ఇతర కాలేజీలకు పంపడమంటే ప్రహసనమయ్యే పరిస్థితి ఉందని గమనించిన ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ చర్యలను తాత్కాలికంగా నిలిపివేసింది. వచ్చే విద్యా సంవత్సరానికి పకడ్బందీగా చర్యలు తీసుకునేందుకు ముందుగానే కసరత్తు మొదలుపెట్టింది. ఏటా పరీక్షలకు నెల రోజుల ముందు ల్యాబ్‌లను తనిఖీ చేసే విధానం ఉంది. ఇప్పుడు ఆరు నెలల ముందుగానే తనిఖీలకు కమిటీలను నియమించాలని నిర్ణయించారు. అలాగే కాలేజీల అఫిలియేషన్ల పునరుద్ధరణకు కొద్ది రోజుల కిందట నోటిఫికేషన్‌ జారీ చేశారు. కాలేజీలన్నీ తొలుత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సర్టిఫికెట్లు సక్రమంగా ఉంటే కమిటీలు కాలేజీలకు వెళ్లి తనిఖీలు చేస్తాయి. ఇందుకోసం రెండు రకాల కమిటీలను నియమిస్తున్నారు. ప్రాంతీయ తనిఖీ అధికారి(ఆర్‌ఐవో), ప్రిన్సిపల్‌, లెక్చరర్‌తో ఒక కమిటీ... జిల్లా ఇంటర్మీడియట్‌ విద్య అధికారి (డీఐఈవో), ప్రిన్సిపల్‌, లెక్చరర్‌తో మరో కమిటీని వేర్వేరుగా నియమిస్తున్నారు.

ఈ ప్రమాణాలు తప్పనిసరి

కాలేజీల భవనాల పరిస్థితి, ఫైర్‌ ఉపకరణాలు, అద్దె భవనాలైతే లీజు అగ్రిమెంట్లు, ఎఫ్‌డీఆర్‌లు కచ్చితంగా ఉండాలని ఇంటర్‌ విద్యా శాఖ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం చాలా కాలేజీలను అపార్ట్‌మెంట్లలో నిర్వహిస్తున్నందున ఈ ప్రమాణాలు పాటించడం సాధ్యంకాదని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ల్యాబ్‌లు సెల్లార్లలో నామమాత్రంగా ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ల్యాబ్‌లు ఉండాలనే దానిపై ఈసారి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. చాలా కాలేజీలకు దారి కూడా సక్రమంగా లేదనే విమర్శలున్నాయి. ఈ ప్రమాణాల్లో ఏ ఒక్కటి లేకపోయినా కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించారు. గతంలోనూ అలాంటి కాలేజీలకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో ఈసారి విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత రద్దు చేసేందుకు సిద్ధమయ్యారు. యాజమాన్యాలు కోర్టుకు వెళ్లడంతో ఇప్పుడు ఆరు నెలల ముందుగానే కసరత్తు ప్రారంభించారు. ప్రతిసారీ కాలేజీలకు షోకాజు నోటీసులు ఇచ్చాక విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నామనే కారణం చూపుతున్నారని భావించిన ఇంటర్‌ విద్యా శాఖ... ఈ సారి ముందుగానే మూడు నెలల గడువు ఇవ్వనుంది. జనవరి 5 లోపు ప్రాథమిక తనిఖీలు పూర్తి చేసి లోపాలున్న కాలేజీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తుంది. నోటీసులు ఇచ్చిన నాటి నుంచి సరిదిద్దుకునేందుకు 3నెలల గడువు ఇస్తుంది. ఈ గడువు మార్చి వరకు ఉంటుంది. ఆలోపు ప్రమాణాలను సరిదిద్దుకోని కాలేజీలకు వచ్చే విద్యా సంవత్సరానికి అఫిలియేషన్‌ ఇవ్వదు. అంటే.. కాలేజీలు మూతపడే పరిస్థితి వస్తుంది.

200 కాలేజీలపై వేటు!

రాష్ట్రంలో మొత్తం 3,615 ఇంటర్‌ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 471 ప్రభుత్వ కాలేజీలు. 2,048 ప్రైవేటు కాలేజీలు, కేజీబీవీల్లో 221, మోడల్‌ స్కూళ్లలో 162, ఎయిడెడ్‌లో 181, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 163, ఒకేషనల్‌లో 231 కాలేజీలు ఉన్నాయి. వీటితో పాటు వివిధ సంస్థల పరిధిలో కొన్ని ఇంటర్‌ కాలేజీలు కొనసాగుతున్నాయి. వీటిలో ప్రైవేటు కాలేజీలపై దృష్టిపెడుతున్నారు. ఇప్పటికే 174 కాలేజీల్లో ప్రమాణాలు లేవని గుర్తించడంతో వచ్చే విద్యా సంవత్సరానికి 200కు పైగా కాలేజీలపై వేటు పడొచ్చని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2022-12-26T03:55:58+05:30 IST