నేనొస్తే సీఎంకు ఇబ్బందేమిటో?

ABN , First Publish Date - 2022-07-02T08:19:29+05:30 IST

‘‘భీమవరంలో నా ఇంటికి కూతవేటు దూరంలో నిర్వహించనున్న విప్లవ వీరుడి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ హాజరవుతుంటే, ఎంపీగా ఆ..

నేనొస్తే సీఎంకు ఇబ్బందేమిటో?

నా దారిలో నేను వస్తా.. జగన్‌రెడ్డీ నీ దారిలో నువ్వు రా

ఘర్షణలు సృష్టించి, నేనే కారణమని కేసులు పెట్టాలని కుట్ర చేస్తున్నారు: ఎంపీ రఘురామ


న్యూఢిల్లీ, జూలై 1(ఆంధ్రజ్యోతి): ‘‘భీమవరంలో నా ఇంటికి కూతవేటు దూరంలో నిర్వహించనున్న విప్లవ వీరుడి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ హాజరవుతుంటే, ఎంపీగా ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా బాధ్యత. పీఎం పాల్గొనే సభలో ఒక ఎంపీని పాల్గొనకుండా అడ్డుకునేందుకు సీఎం కుట్ర చేయడం సరికాదు. చెప్పటం నా ధర్మం, వినకపోతే ఆయన ఖర్మం. జగన్మోహన్‌రెడ్డీ... భీమవరంలో 4న జరిగే అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నా దారిలో నేను వస్తా... నీ దారిలో నువ్వు రా’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.


శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను సభలో పాల్గొంటే సీఎంకి వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కాలేదు. నేను ఆయనకంటే పొడుగ్గా ఉన్నానని భావిస్తే దూరంగా నిలుచుంటా. సంస్కారవంతుడిని కాబట్టి జగన్‌ ఎదురుపడితే నమస్కారం కూడా పెడతా.ప్రధాని సభకు డ్వాక్రా మహిళలను కష్టపడి పిలవాల్సిన అవసరం లేదు. నేను సభలో పాల్గొంటున్నానంటే ప్రజలే స్వచ్ఛందగా హాజరవుతారు. సభకు ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని జగన్మోహన్‌రెడ్డి, పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి. లోక్‌సభ నాయకుడు, ప్రధాని మోదీ... తన సహచర ఎంపీ హక్కులకు భంగం కలగకుండా చూసుకుంటారని ఆశిస్తున్నా’’ అని రఘురామ అన్నారు. 


ఇంత అనాగరిక పాలన చూడలేదు

‘‘భీమవరం కార్యక్రమానికి హాజరు కావడానికి నా శ్రేయోభిలాషులందరూ చెప్పినట్లుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. భూమి పుట్టిననాటి నుంచి ఇంతటి నిరంకుశ, ఆటవిక, అనాగరిక పరిపాలన చూడలేదు. అర్ధరాత్రి పోలీసులు ఇంటికి వచ్చి తలుపులు బద్దలు కొడితే.. ఇదేంటని ప్రశ్నించినందుకు... విధి నిర్వహణకు అడ్డొచ్చారని అదనంగా మరో కేసు పెట్టడమే ప్రజాస్వామ్యమా? ఇంటి దగ్గర నిరసన తెలిపిన వారిపై అత్యాచారం కేసు, ఎవరితో మాట్లాడకుండా ఇంట్లో కూర్చున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయడం రాష్ట్ర పోలీసుల దమనకాండకు ప్రత్యక్ష సాక్ష్యాలు.


రెండు వర్గాల మధ్య ఘర్షణలు సృష్టించి, ఆ ఘర్షణలకు నేనే కారణమని కేసులు పెట్టాలని ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో పోలీసులు పథక రచన చేసినట్లు తెలిసింది. అల్లూరి విగ్రహావిష్కరణ శిలాఫలకంపై నా పేరు లేకుండా చూడాలని సీఎం జగన్‌ ఆదేశించినట్లుగా సమాచారం అందింది. ఈ విషయమై నేను కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌కు లేఖ రాశా. ప్రోటోకాల్‌ ఉల్లంఘనకు పాల్పడకుండా చూడాలని కోరాను. ఒకవేళ ఉల్లంఘనకు పాల్పడితే పార్లమెంట్‌ హక్కుల కమిటీకి ఫిర్యాదు చేస్తానని చెప్పాను’’ అని తెలిపారు. 


మీ పార్టీలో ఉన్నాం... మీరు ఏం చెప్పినా నమ్ముతాం

‘‘రాష్ట్రంలో ఎలుకలు నాణ్యమైన మద్యం తాగుతున్నాయి. ఉడతలు 11 కేవీ, 33 కేవీ వైర్లను కొరుకుతున్నాయి. అలా కొరకగలిగే ఉడతలు ఉన్నాయంటే అది వాటి గొప్పతనమా? లేక వైర్లలో నాణ్యతా లోపమా? మీరు ఎన్ని కథలు చెప్పినా నమ్ముతాం... ఎందుకంటే మీ పార్టీలో ఉన్నాం కదా..! విద్యుత్‌ తీగ తెగి జరిగిన ప్రమాదంపై జగన్‌ సొంత పత్రికలో వచ్చిన కథనం ఆశ్చర్యాన్ని కలిగించింది’’ అని రఘురామరాజు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-07-02T08:19:29+05:30 IST