తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కోవాలి

ABN , First Publish Date - 2022-12-07T02:35:01+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి పూర్తి సన్నద్ధంగా ఉండాలని కేంద్ర...

తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కోవాలి

కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి గౌబ ఆదేశాలు..

అన్ని విధాలా సన్నద్ధం: సీఎస్‌

అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి పూర్తి సన్నద్ధంగా ఉండాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ మూడు రాష్ట్రాల సీఎ్‌సలను ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోనేందుకు ఈ రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్‌ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ తుఫాన్‌ ప్రభావం దక్షిణాంధ్ర జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురంతో పాటు సమీప జిల్లాలపై ఉండే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, అన్ని విధాలా సన్నద్ధం చేశామని చెప్పారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని, ఏటిగట్లు, రిజర్వాయర్లకు గండ్లు పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 11ఎస్డీఆర్‌ఎఫ్‌, 10ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. తుఫాన్‌ నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, ఇప్పటికే వెళ్లిన జాలర్లు తిరిగి రావాలని సందేశాలు పంపినట్లు చెప్పారు. దీనిపై కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి స్పందిస్తూ, ముఖ్యంగా పల్లపు ప్రాంతాలు, కచ్చా ఇళ్లల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని, తుఫాన్‌ ముందస్తు సన్నాహాక ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకూ తావివ్వకుండా, పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని ఆదేశించారు.

Updated Date - 2022-12-07T02:35:02+05:30 IST