ఆర్టీపీపీలో పేలిన వోల్టేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌

ABN , First Publish Date - 2022-02-23T08:33:29+05:30 IST

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (ఆర్‌టీపీపీ) స్విచ్‌ యార్డులోని కెపాసిటివ్‌ వోల్టేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోయింది. దీంతో మంగళవారం విద్యుత్కేంద్రంలోని

ఆర్టీపీపీలో పేలిన వోల్టేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌

నాలుగు యూనిట్లు ట్రిప్‌

840 మెగావాట్ల విద్యుదుత్పత్తి బంద్‌

గ్రిడ్‌ సమతౌల్యం దెబ్బతినడంతో సీమ అంతటా ఆగిన సరఫరా

10-12 గంటలు తీవ్ర అంతరాయం

యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు

సాయంత్రానికి మొదటి యూనిట్‌ రెడీ

ఈ ఘటనతో జెన్కోకు భారీ నష్టం

ఉత్పత్తి ఆగిపోవడంతో పాటు అధిక రేటుకు విద్యుత్‌ కొనుగోలు


ఎర్రగుంట్ల, ఫిబ్రవరి 22: కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (ఆర్‌టీపీపీ) స్విచ్‌ యార్డులోని కెపాసిటివ్‌ వోల్టేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోయింది. దీంతో మంగళవారం విద్యుత్కేంద్రంలోని నాలుగు యూనిట్లలో ఏకకాలంలో 840 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఆగిపోయింది. ఫలితంగా గ్రిడ్‌ సమతౌల్యం కోల్పోయి రాయలసీమవ్యాప్తంగా విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆర్టీపీపీలో పది గంటలు, రాయలసీమ జిల్లాల్లో 10-12 గంటల పాటు కరెంటు సరఫరా ఆగిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఎంసీఆర్‌, టర్బైన్‌ తదితర చోట్ల సాంకేతిక సమస్యలను పరిష్కరించి సాయంత్రం 5.45 గంటలకు మొదటి యూనిట్‌ను రన్‌ చేశారు. అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గ్రిడ్‌ లైన్లలో హైవోల్టేజీ కారణంగా ఆర్టీపీపీలోని వోల్టేజి ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి పేలిపోయినట్లు తెలుస్తోంది.


ఈ కారణంగా 210 మెగావాట్ల చొప్పున సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లు ట్రిప్‌ అయ్యాయి. దీంతో ఇక్కడ 840 మెగావాట్ల ఉత్పత్తి ఆగిపోయి.. గ్రిడ్‌ సమతౌల్యం దెబ్బతింది. ఏపీ జెన్‌కోకు ఉత్పత్తి నష్టం భారీగా ఉందని అధికారుల అంచనా. దీంతో పాటు ఆగిపోయిన ప్లాంట్లు తిరిగి పనిచేసేందుకు, ఇతర ఖర్చులు రూ.కోట్లలోనే ఉంటుందని అంటున్నారు. బయటి సంస్థల నుంచి అధిక రేటుకు విద్యుత్‌ కొనుగోలు చేయాల్సి రావడంతో ఇది కూడా నష్టమేనని చెప్పవచ్చు.


హైవోల్టేజ్‌ సమస్య వల్లే: సీఈ

గ్రిడ్‌లో వచ్చిన హైవోల్టేజ్‌ కారణంగానే ఆర్టీపీపీలో సమస్య ఏర్పడిందని, దీని వల్ల ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్‌ బయటకు వెళ్లే అవకాశం లేకపోవడం వల్ల యూనిట్లు ట్రిప్‌ అయ్యాయని ప్రాజెక్టు సీఈ మోహనరావు తెలిపారు. ‘మంగళవారం ఉదయం 8.15 సమయంలో ఈ సమస్య ఏర్పడింది. దీని వల్ల 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ఆగిపోయింది. 210 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగల 4 యూనిట్లు రన్‌ చేసేందుకు సుమారు 10గంటల పాటు యుద్ధప్రాతిపదికన పనిచేశాం. మొదటి యూనిట్‌ను సాయంత్రం సర్వీసులోకి తీసుకొచ్చాం. మిగతావి కూడా అర్ధరాత్రిలోపు రన్‌ చేస్తాం’ అని వెల్లడించారు.

Read more