దేశానికి విజన్‌ 2047

ABN , First Publish Date - 2022-12-07T02:22:59+05:30 IST

దేశాభివృద్ధి కోసం వచ్చే పాతికేళ్లకు సరిపడా విజన్‌ డాక్యుమెంట్‌కు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

దేశానికి   విజన్‌  2047

వచ్చే పాతికేళ్లకు డాక్యుమెంట్‌ రూపొందిద్దాం

ఇందుకు సంపూర్ణంగాసహకరిస్తా.. చంద్రబాబు వెల్లడి

ప్రధాని మోదీ సూచనతోనీతి ఆయోగ్‌ సీఈవోతో భేటీ

అరగంట పాటు చర్చలు విజన్‌పై నివేదిక అందజేత

న్యూఢిల్లీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): దేశాభివృద్ధి కోసం వచ్చే పాతికేళ్లకు సరిపడా విజన్‌ డాక్యుమెంట్‌కు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని సోమవారమిక్కడ జరిగిన జీ-20 అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు పేర్కొనడం.. ప్రధాని మోదీ సైతం తన ప్రసంగంలో ఆయన సూచనను ప్రస్తావించడమే గాక.. నోట్‌ చేసుకోవాలని అధికారులను ఆదేశించడం తెలిసిందే. దానికి కొనసాగింపుగా ప్రధాని సూచన మేరకు చంద్రబాబు మంగళవారం నీతి ఆయోగ్‌ సీఈవో పరమేశ్వరన్‌ అయ్యర్‌తో సమావేశమయ్యారు. దాదాపు అరగంట చర్చించారు. డిజిటల్‌ నాలెడ్జ్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తవుతుందని, కాబట్టి విజన్‌-2047 పేరిట దేశాభివృద్ధిపై డాక్యుమెంట్‌ను రూపొందించాలని చంద్రబాబు ప్రతిపాదించారు.

దానికి సంబంధించి తన అభిప్రాయాలను, సూచనలు పంచుకున్నారు. రిటైర్డ్‌ అధికారులు, నిపుణులతో తాను ఏర్పాటు చేసిన ‘థింక్‌ ట్యాంక్‌’ రూపొందించిన నివేదికను సీఈవోకు సమర్పించారు. అందులోని అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కూడా సమర్పించారు. డాక్యుమెంట్‌ రూపకల్పనకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు. గతంలో 75 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఇలాగే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పుడు.. అత్యధిక కాలం సీఎంగా చేసిన మీరు.. వచ్చే పాతికేళ్లలో దేశ పురోభివృద్ధిపై తగు సూచనలు చేయాలని చంద్రబాబును కోరారు. ఆ మేరకు రిటైర్డ్‌ అధికారులు, నిపుణులు కసరత్తు చేసి ఈ విజన్‌ నివేదికను రూపొందించారు. రిపోర్టు బాగుందని అయ్యర్‌ కొనియాడారు. సలహాలివ్వడానికి ముందుకొచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు కూడా పాల్గొన్నారు.

బాబును కలిసిన ఫరూక్‌ అబ్దుల్లా

ఢిల్లీలో ఉన్న చంద్రబాబును నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అలాగే పలువురు ఐఏఎస్‌ అధికారులు, ఢిల్లీలో పోలీసు శాఖలో పనిచేస్తున్న పలువురు అధికారులు కూడా సమావేశమయ్యారు. రెండ్రోజుల పర్యటన ముగించుకుని చంద్రబాబు మంగళవారం సాయంత్రం విజయవాడకు పయనమయ్యారు.

Updated Date - 2022-12-07T02:23:00+05:30 IST