Vijayawada: గల్లంతైన మత్స్యకారుల కోసం గంగమ్మకు శాంతి పూజలు
ABN , First Publish Date - 2022-07-06T19:57:46+05:30 IST
సముద్రంలో చేపలవేటకు వెళ్లి గల్లంతైన నలుగురు మత్స్యకారులకు కోసం గంగమ్మకు కుటుంబసభ్యులు శాంతి పూజలు చేశారు.

విజయవాడ: సముద్రంలో చేపలవేటకు వెళ్లి గల్లంతైన నలుగురు మత్స్యకారుల (Fishermans) కోసం గంగమ్మకు కుటుంబసభ్యులు శాంతి పూజలు చేశారు. పడవ ప్రయాణం ప్రారంభించే ప్రాంతంలో పూజలు చేశారు. చేసిన తప్పులను మన్నించి.. తమవారిని చల్లగా ఇంటికి చేర్చాలంటూ గంగమ్మ తల్లికి కుటుంబసభ్యులు వేడుకున్నారు. ఈ సందర్భంగా కుటుంసభ్యులు మీడియాతో మాట్లాడుతూ... ‘‘మాకు ఏ కష్టం వచ్చినా గంగమ్మకు శాంతి పూజ చేస్తాం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలంగా మారుతుంది. ఇంజను ఆగిపోయి వాతావరణం సహకరించ లేదని చెబుతున్నారు. మా వాళ్లు ఉన్న పడవ మునిగిపోయి ఉంటుందని అంటున్నారు. క్షేమంగా చేర్చాలని ఆ గంగమ్మ తల్లిని కోరుకుంటూ పూజలు చేశాం. తరతరాలుగా సంప్రదాయ బద్దంగా వస్తున్న ఆచారం ఇది. మా కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని. మాకు ఇది తప్ప ఏ పనీ తెలియదు’’ అంటూ కుంబుసభ్యులు తెలిపారు.
మూడు రోజులైన దొరకని ఆచూకీ....
సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన నలుగురు మత్స్యకారుల ఆచూకీ మూడు రోజులైనా ఇంకా లభించలేదు. దీంతో మత్య్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బందరు మండలం క్యాంబెల్ పేట నుంచి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. కాకినాడ సమీపంలో బోటు మోటారు పని చేయడం లేదని యజమానికి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఫోన్లు పని చేయడం లేదు. మెరైన్, కోస్ట్ గార్డ్ సిబ్బంది మత్స్యకారుల ఆచూకీ కోసం సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.