ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం మాదే!

ABN , First Publish Date - 2022-12-07T02:24:57+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు టీడీపీ సర్వసన్నద్ధంగా ఉందని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం మాదే!

సన్నద్ధంగా ఉన్నాం.. రోడ్‌షోలతో ఆత్మవిశ్వాసం.. జగన్‌ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత

రాష్ట్రంలో శాంతిభద్రతల్లేవు.. ప్రశ్నిస్తే నిర్బంధాలు, వేధింపులు.. ఎకానమీ ధ్వంసం

మౌలిక వసతులు దెబ్బతిన్నాయి.. పరిశ్రమలూ పోతున్నాయు.. మీడియాతో బాబు

న్యూఢిల్లీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు టీడీపీ సర్వసన్నద్ధంగా ఉందని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఘన విజయం సాధించి తీరతామని ధీమా వ్యక్తంచేశారు. మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇటీవలి కాలంలో రోడ్‌షోల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నానని.. వారి నుంచి వస్తున్న ప్రతిస్పందన తనకు ఆత్మవిశ్వాసం కలిగిస్తోందని చెప్పారు. జగన్‌ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత రాష్ట్రమంతటా కనపడుతోందని తెలిపారు. ‘జగన్‌ పాలనలో ప్రజలు భయభ్రాంతులయ్యారు. తీవ్రమైన వేధింపులకు గురవుతున్నారు. శాంతి భద్రతలు అసలే లేవు. ప్రశ్నించిన వారిని నిర్బంధించి హింసలకు గురి చేస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు’ అని ధ్వజమెత్తారు. ఒక సీనియర్‌ జర్నలిస్టు వాట్సాప్‌ మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేస్తే ఆయన్ను అరెస్టు చేసి నానా ఇబ్బందులకు గురి చేస్తే కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. సొంత పార్టీ ఎంపీయే జగన్‌ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని.. స్వయంగా చెల్లెలే ఆయనతో విభేదించారని గుర్తుచేశారు. ‘రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. పోలవరంతో పాటు అనేక ప్రాజెక్టుల్లో ప్రగతి కుంటుపడింది. పరిశ్రమలు/కార్పొరేట్‌ సంస్థలు కూడా వేధింపులకు గురికావడంతో ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోతోంది. తలసరి ఆదాయం పడిపోయింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఆర్థికాభివృద్ది రేటు నా హయాంలో 10 శాతం పైగా ఉంటే.. ఇప్పుడది 3.5 శాతానికి పడిపోయింది. ప్రజల ఆదాయం తగ్గిపోయి వ్యయం పెరిగిపోయినప్పుడు వారెలా సంతోషంగా ఉంటారు’ అని ప్రశ్నించారు. తెలంగాణలో కూడా టీడీపీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ ముఖ్యం

నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పెరుగుతున్న జనాభాను అభివృద్దికి ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం ఆలోచించాల్సి ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జనాభాను నియంత్రించడం కాదని.. దాని నిర్వహణ ముఖ్యమని చెప్పారు. జనాభాను చాలా కాలం నియంత్రించిన చైనా ఇప్పుడు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. డిజిటల్‌ ఎకానమీని మానవ వనరులతో అనుసంధానం చేయాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు.

Updated Date - 2022-12-07T02:24:58+05:30 IST