పంతం నెగ్గించుకున్న టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు
ABN , First Publish Date - 2022-03-19T22:13:11+05:30 IST
సవాళ్లు.. ప్రతిసవాళ్లతో నూజివీడు అట్టుడికిపోయింది. ప్రస్తుతం నూజివీడులో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.

నూజివీడు: సవాళ్లు.. ప్రతిసవాళ్లతో నూజివీడు అట్టుడికిపోయింది. ప్రస్తుతం నూజివీడులో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు, టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సవాళ్లు.. ప్రతిసవాళ్లు విసురుకున్నారు. ముందు అనుకున్నట్లే టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పంతం నెగ్గించుకున్నారు. ఎర్ర చొక్కా ధరించి గాంధీ పెద్దబొమ్మ సెంటర్కు వచ్చారు. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని ముద్దరబోయిన సవాల్ నెరవేర్చుకున్నారు. గాంధీ బొమ్మ సెంటర్కు వచ్చిన ముద్దరబోయిన, టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అంతకుముందు పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ వద్ద బహిరంగ చర్చా వేదికకు నియోజకవర్గం నలుమూలల నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వైసీపీ, టీడీపీ నాయకులు కార్యకర్తలకు వర్తమానం పంపారు. ఎల్ఈడీ స్ర్కీన్స్ ఏర్పాటు చేసి ఒకరిపై ఒకరు చేసుకున్న సవాళ్లను, వాడిన భాషను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చర్చ జరిగితే కార్యకర్తలు రెచ్చిపోయి, ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి పోలీసులు బలగాలను రప్పిస్తున్నట్లు తెలిసింది. శనివారం ఉదయం నుంచి నాలుగు మండలాల్లోని ముఖ్య నాయకులు హౌస్ అరెస్టులు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.