ప్రపంచం గుర్తించిన మేధావి ‘కోనేరు’
ABN , First Publish Date - 2022-10-31T05:01:46+05:30 IST
ప్రపంచం గుర్తించిన తెలుగు మేధావి దివంగత ఆచార్య కోనేరు రామకృష్ణారావు, ఆయన విద్యావేత్తే కాదు.. తత్వవేత్త కూడా అని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.
కొనియాడిన మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
గీతం వర్సిటీలో కోనేరు రామకృష్ణారావు స్మారక భవనం ప్రారంభం
సాగర్‌నగర్ (విశాఖ సిటీ), అక్టోబరు 30: ప్రపంచం గుర్తించిన తెలుగు మేధావి దివంగత ఆచార్య కోనేరు రామకృష్ణారావు, ఆయన విద్యావేత్తే కాదు.. తత్వవేత్త కూడా అని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. గీతం (టు బీ డీమ్డ్) విశ్వవిద్యాలయంలో నిర్మించిన కోనేరు రామకృష్ణారావు మెమోరియల్ భవన్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ, తాను ఏయూలో విద్యార్థిగా ఉన్నప్పుడు అధ్యాపకునిగా ఉన్న కోనేరు మాటలు ఎంతో ప్రేరణ ఇచ్చాయని, ఆ మాటలే ఉప రాష్ట్రపతి పదవి వరకు నడిపించాయని చెప్పారు. గీతం విశ్వవిద్యాలయం అంతర్జాతీయ గుర్తింపు పొందడంలో రామకృష్ణారావు కృషి ఎంతో ఉందన్నారు. ఆయన వ్యక్తిత్వం, మిత్రత్వం, నేతృత్వం ఎందరినో ప్రభావితం చేశాయని చెప్పారు. విజ్ఞానాన్ని పంచడం, సంపదను సృష్టించడం, సమాజ హితానికి పంచిపెట్టడం గొప్ప ఆలోచనలని అభివర్ణించారు.
ఒకప్పడు నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి విజ్ఞానాన్ని పంచాయని, గీతం విశ్వవిద్యాలయం కూడా అంత ప్రసిద్ధి చెందాలని ఆకాంక్షించారు. గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ మాట్లాడుతూ, సంస్థ వ్యవస్థాపకులు ఎం.వి.వి.ఎ్‌స.మూర్తి హఠాన్మరణం అనంతరం వర్సిటీ బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు తన వెన్నంటి నిలిచి ముందుకు నడిపించారని కొనియాడారు. వర్సిటీ సామాజిక కార్యక్రమాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అక్షరాస్యత పెంపు, మానసిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు రామకృష్ణారావు కుటుంబ సభ్యులు రూ.4.5 కోట్ల విరాళం అందించారని, ఒక విద్యాసంస్థకు ఇంతపెద్ద మొత్తంలో విరాళం అందించడం తెలుగు రాష్ట్రాలలో ఇదే ప్రథమం అన్నారు. కోనేరు రామకృష్ణారావు కుమారుడు కోనేరు శరత్‌చంద్రరావు, అల్లుడు పూర్ణసగృతి తమ ప్రసంగంలో రామకృష్ణారావుకు భారతదేశం అన్నా, తెలుగు వారు అన్నా ఎంతో అభిమానమని తెలిపారు. కార్యక్రమంలో గీతం వైస్ చాన్సలర్ దయానంద సిద్ధపట్టం, ప్రొవైస్ చాన్సలర్ జయశంకర్ వారియర్, పలువురు ఆచార్యులు పాల్గొన్నారు.