Venkaiah Naidu : స్వరాజ్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం..
ABN , First Publish Date - 2022-08-15T16:44:10+05:30 IST
దేశ ప్రజలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) స్వాతంత్ర్య దినోత్సవ(Indipendence day) శుభాకాంక్షలు తెలిపారు.

Hyderabad : దేశ ప్రజలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) స్వాతంత్ర్య దినోత్సవ(Indipendence day) శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. తమ నివాసంలో జాతీయ జెండాను ఎగురవేయడం ఎంతో ఆనందాన్ని అందించింది. భారత జాతిని సంఘటితం చేయగల ప్రేరణాత్మక శక్తి... మన మువ్వన్నెల జెండా అని పేర్కొన్నారు. స్వరాజ్యం సముపార్జించుకుని 75 ఏళ్ళు గడిచిన నేపథ్యంలో స్వాతంత్ర్య అమృతోత్సవాల పేరిట నాటి స్వరాజ్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం ముదావహమన్నారు.
ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన జాతీయ విలువైన ఏకత్వం, సామరస్యం, సార్వత్రిక సౌభ్రాతృత్వాలను మన ఆచరణ ప్రతిబింబించాలన్నారు. ఈ శుభ సందర్భంలో మన స్వతంత్ర సమరయోధులను స్మరించుకుందామని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వారు కలలుగన్న నవభారతాన్ని నిర్మించుకునేందుకు కంకణబద్ధులమవుదామన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో సాధించిన విజయాలను, ప్రగతిని చూసి గర్విస్తూ పేదరికం, నిరక్షరాస్యత, సాంఘిక అసమానతలు, లింగ వివక్ష, అవినీతి వంటి సవాళ్ళను సమైక్యంగా కలిసి కట్టుగా ఎదుర్కొందామన్నారు. ఆత్మ నిర్భర భారత్ వైపు పురోగమిద్దామని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.