Varsity employees: వర్సిటీ ఉద్యోగులకూ 62 ఏళ్లు!

ABN , First Publish Date - 2022-12-16T00:57:25+05:30 IST

యూనివర్సిటీల్లోని ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలోనే జీవో విడుదలవుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

Varsity employees: వర్సిటీ ఉద్యోగులకూ  62 ఏళ్లు!

బీఈడీ కాలేజీలకు చివరి అవకాశం

ప్రమాణాలు పాటించకపోతే అఫిలియేషన్‌ రద్దు

వీసీల సమావేశంలో మంత్రి బొత్స

అమరావతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీల్లోని ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలోనే జీవో విడుదలవుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలు, ఉన్నత విద్యామండలి అధికారులతో గురువారం మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. బీఈడీ కాలేజీల్లో ప్రమాణాలపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్లను, అధికారులను ఆదేశించారు. ఇప్పటికే బీఈడీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఆలస్యమైనందున త్వరగా ప్రక్రియ పూర్తిచేసి వచ్చే నెల మొదటివారంలో కౌన్సెలింగ్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అలాగే ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌ కోర్సుల స్పాట్‌ అడ్మిషన్లకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో ఉన్నత విద్య ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, వైఎస్‌ చైర్మన్‌ రామ్మోహనరావు, మండలి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:57:26+05:30 IST