లంచం తీసుకున్న.. రెండున్నర నెలలకు చిక్కారు
ABN , First Publish Date - 2022-10-17T10:07:10+05:30 IST
అవినీతిపరులు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతున్నా ఏసీబీ ఉచ్చులో పడక తప్పడంలేదు. ఒక సీఐ, ఎస్‌ఐ తాజాగా ఏసీబీకి పట్టుబడటం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. లంచం తీసుకున్న రెండున్నర నెలల తర్వాత ఆ ఇద్దరినీ
సీఐ, ఎస్‌ఐ అరెస్టుపై పోలీసుశాఖలో చర్చ
స్టేషన్లకు వచ్చే మధ్యవర్తులపై నిఘాకు ఆదేశం
లంచాలపై 14400 నంబర్‌కు తెలపండి: ఏసీబీ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
అవినీతిపరులు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతున్నా ఏసీబీ ఉచ్చులో పడక తప్పడంలేదు. ఒక సీఐ, ఎస్‌ఐ తాజాగా ఏసీబీకి పట్టుబడటం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. లంచం తీసుకున్న రెండున్నర నెలల తర్వాత ఆ ఇద్దరినీ ఏసీబీ అరెస్టు చేసి జైలుకు పంపడంతో అవినీతిపరుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) చర్యలకు ఉపక్రమిస్తుంది. ఎవరినైనా లంచం డిమాండ్ చేస్తే గాలం వేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం ఏసీబీ చేసే మొదటి పని. మధ్యవర్తుల ద్వారా లంచాలు తీసుకొంటూ పనులు చేసే(ఆర్టీఏ, సబ్ రిజిస్ట్రార్) ప్రభుత్వ కార్యాలయాలపై ఆకస్మిక సోదాలు జరిపి అదనపు మొత్తాన్ని సీజ్ చేసి చట్టపరంగా ముందుకెళ్లడం రెండోది. బాగా అవినీతికి పాల్పడి ఆస్తులు పోగుచేసిన అధికారులను గుర్తించి ఉదయాన్నే ఇంటి తలుపు తట్టి సోదాలకు ఉపక్రమించడం మూడో పని. ఇవి కాకుంగా ప్రభుత్వం ఏవైనా అవినీతి వ్యవహారాలకు సంబంధించి విచారణకు ఆదేశిస్తే ఏసీబీ అధికారులు వెలికి తీస్తారు.
అయితే, లంచం తీసుకున్న రెండున్నర నెలల తర్వాత పోలీసు అధికారులు పట్టుబడటం కొత్త విషయం. కృష్ణా జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు హత్య కేసుల విచారణలో వెలుగులోకి వచ్చిన సమాచారం ఆధారంగా ఏసీబీ రంగంలోకి దిగింది. తొట్లవల్లూరులో శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి హత్య కేసులో రూ.12.5 లక్షలు లంచం తీసుకున్న సీఐ ముక్తేశ్వరరావు, ఎస్‌ఐ అర్జున్ వ్యవహారంపై విజయవాడ ఏసీబీ అధికారులు దర్యాప్తు చేశారు.
ఒక హత్య కేసులో నిందితులకు సాయం చేస్తానంటూ డబ్బులు తీసుకున్న సీఐ మధ్యలోకి వచ్చిన మరో వ్యక్తిని కూడా మట్టుబెట్టమంటూ సలహా ఇవ్వడాన్ని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(ఏసీబీ డీజీ) సీరియ్‌సగా తీసుకున్నారు. వెంటనే ఏసీబీ విచారణకు ఆదేశించడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీఐ, ఎస్‌ఐలకు ఎప్పుడెప్పుడు ఎంత డబ్బు మధ్యవర్తి ఇచ్చారు? తదితర వివరాలు ఏసీబీ టెక్నాలజీ సాయంతో సేకరించింది. ఆగస్టులో జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించి అక్టోబరు లో అవినీతి రుజువైంది. ఇద్దరు పోలీసు అధికారులను అరెస్టు చేసి జైలుకు పంపడంతో మధ్యవర్తుల ద్వారా లంచం తీసుకునే అవినీతి అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. ఏసీబీలో డీఐజీగా పనిచేస్తోన్న పీహెచ్‌డీ రామకృష్ణ టెక్నికల్ సర్వీసెస్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తుండంతో అవినీతి అధికారులపై టెక్నాలజీ కన్ను వేసినట్లైంది. ఎక్కడ ఎవరు లంచం అడిగినా 14400 నంబర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు.