నేడు టీచర్ల బదిలీ ఉత్తర్వులు?
ABN , First Publish Date - 2022-10-17T09:29:57+05:30 IST
ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురుచూస్తున్న బదిలీల షెడ్యూలు విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
ఎనిమిదేళ్ల సర్వీసుకు అంగీకారం
ఎట్టకేలకు షెడ్యూలు విడుదలకు రెడీ
అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురుచూస్తున్న బదిలీల షెడ్యూలు విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సోమవారం బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. బదిలీలకు గరిష్ట సర్వీసును ఎనిమిదేళ్లకు పెంచింది. దీనికి సీఎంవో అంగీకారం తెలపగా ఈ ఫైలు పాఠశాల విద్య శాఖ కమిషనరేట్‌కు చేరింది. దీంతో బదిలీల షెడ్యూలు విడుదలకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కాగా ఈ ఏడాది బదిలీలు రకరకాల మలుపులు తిరిగాయి. బదిలీలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం సర్వీసును ఎనిమిదేళ్ల నుంచి ఐదేళ్లకు కుదించింది. దీనిపై టీచర్లలో వ్యతిరేకత వ్యక్తమైనా దానిపై ముందుకెళ్ళింది. కానీ అదిగో ఇదిగో అంటూ షెడ్యూలు మాత్రం విడుదల చేయలేదు. ఇలా రెండు నెలలకు పైగా కాలం గడిపిన ప్రభుత్వం చివరికి ఐదేళ్ల నిర్ణయంపై వెనకడుగు వేసి ఎప్పటిలాగే ఎనిమిదేళ్ల సర్వీసు ప్రామాణికంగా తీసుకుంది.