Kurnool YCP meeting: మరో గర్జన డ్రామా!
ABN , First Publish Date - 2022-12-05T02:16:25+05:30 IST
రాష్ట్రాన్ని మూడు ముక్కల విస్తరిగా మార్చేలా.. ప్రాంతీయ విద్వేషాలను రగిల్చేలా జగన్ సర్కారు కొత్త డ్రామాకు తెరతీసిందని రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి.
3 రాజధానుల బిల్లును ఎందుకు ఉపసంహరించినట్టు?
రాజధానిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందంటూ ప్రచారం ఎందుకు?
మరి హైకోర్టు అమరావతిలోనే అని కోర్టుకు ఎందుకు చెప్పారు?
కర్నూలులో ఏర్పాటును ఎవరడ్డుకున్నారు?
శ్రీబాగ్ ఒప్పందం ముసుగులో ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం
న్యాయ రాజధాని కోసం కర్నూలులో వైసీపీ సభ నేడే
మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును తామే ఉపసంహరించుకున్నారు.. హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని ఏకంగా సుప్రీంకోర్టుకే నివేదించారు.. కానీ కర్నూలులో హైకోర్టు/న్యాయరాజధాని సాధనకు, వికేంద్రీకరణ కోసం ఏకంగా జగన్ ప్రభుత్వమే అక్కడ సోమవారం గర్జన సభ చేపడుతుండడం విస్మయం కలిగిస్తోంది. అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీ ఉన్నా.. వికేంద్రీకరణ దిశగా ఎలాంటి అడుగులూ వేయకుండా 3 రాజధానుల పేరిట ప్రజలను మభ్యపెట్టడం.. ప్రభుత్వ వైఫల్యాల నుంచి వారి దృష్టి మళ్లించి.. ఎన్నికలనాటికి ప్రాంతీయ విద్వేషాలు రగిల్చి లబ్ధి పొందడమే వైసీపీ పెద్దల ప్రధానోద్దేశంగా కనిపిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని మూడు ముక్కల విస్తరిగా మార్చేలా.. ప్రాంతీయ విద్వేషాలను రగిల్చేలా జగన్ సర్కారు కొత్త డ్రామాకు తెరతీసిందని రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. కర్నూలులో న్యాయ రాజధాని డిమాండ్‌తో సోమవారం అక్కడ వైసీపీ ఆధ్వర్యంలో ‘రాయలసీమ గర్జన’ పేరిట బహిరంగ సభ జరగనుంది. ప్రజల సమ్యలు, కోరికలు, హక్కుల సాధన కోసం ప్రతిపక్షం డిమాండ్ చేయడం సహజం. కానీ 175 మంది సభ్యుల అసెంబ్లీలో 156 మంది (నలుగురు టీడీపీ సభ్యులు+ఒక జనసేన ఎమ్మెల్యేతో కలిపి) మద్దతు ఉన్న జగన్ ప్రభుత్వం.. వికేంద్రీకరణ, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై సభ నిర్వహిస్తుండడం గమనార్హం. తిరుగులేని మెజారిటీ ఉన్న సర్కారుకు.. విధానపరమైన నిర్ణయాలను తీసుకునే అధికారం సంపూర్ణంగా ఉంది. చాలా అంశాల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారు కూడా. కోర్టులు మొట్టికాయలు వేసినా లెక్కచేయడం లేదు. తాము అనుకున్నది చేసేస్తున్నారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని నమ్మబలికి 2019లో అధికారంలోకి వచ్చిన జగన్.. ఆ ఏడాది డిసెంబరులో మాట మార్చి మడం తిప్పారు. అభివృద్ధి కేంద్రీకరణ పక్కనపెట్టి పాలనా వికేంద్రీకరణ పాటెత్తుకున్నారు. 3రాజధానులను తెరపైకి తెచ్చారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో పాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామంటూ ఆగమేఘాలపై బిల్లు రూపొందింది. దానితోపాటు ఏపీసీఆర్‌బీఏను రద్దుచేస్తూ మరో బిల్లు తెచ్చారు. వాటిని 2020 జనవరి 20న రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది.
అదే రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించుకున్నారు. అదే ఏడాది జూలై 31న గవర్నర్ ఆమోదముద్ర కూడా వేశారు. దీనిపై రాజధాని కోసం భూములిచ్చిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ బిల్లులను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం నిరుడు నవంబరులో అసెంబ్లీలో మరో బిల్లు పెట్టి ఆమోదించింది. ఆ తర్వాత రాజధాని మార్పు కేంద్రమే చేయాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ ఏడాది మార్చి 3న తీర్పు ఇచ్చింది. రాజధాని అభివృద్ధికి ఆరు నెలలు సమయం ఇచ్చింది. ఆ తీర్పును అమలు చేయకుండా.. కొత్త బిల్లు తీసుకురాకుండా నాన్చిన జగన్ ప్రభుత్వం.. కోర్టులో ధిక్కరణ వ్యాజ్యాలు దాఖలయ్యేటప్పటికి.. సెప్టెంబరు 17న సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. రాజధాని అభివృద్ధికి హైకోర్టు నిర్ణయించిన కాలవ్యవధిపై మాత్రమే స్టే ఇచ్చింది. రాజధానిగా అమరావతినే అభివృద్ధి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మాత్రం విచారణకు సిద్ధమైంది. కానీ సుప్రీం ఆదేశాలకు సీఎం ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి పలువురు రాష్ట్ర మంత్రుల వరకు వక్రభాష్యం చెబుతున్నారు. ఇది ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు చెంపపెట్టులాంటిందని.. 3రాజధానులకు కోర్టు పచ్చజెండా ఊపేసిందని.. త్వరలో అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టేస్తామని.. విశాఖలో పాలనా రాజధాని వచ్చేస్తోందని ఊదరగొట్టడం మొదలుపెట్టారు. మరి అలాంటప్పుడు కర్నూలులో హైకోర్టు పెడుతున్నామని ఎందుకు ప్రకటించడంలేదు? హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు ఎందుకు తెలియజేశారు..? మళ్లీ కర్నూలులో ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ప్రభుత్వమే ఉద్యమించడం ఏమిటి...? చంద్రబాబు ఇటీవల మూడ్రోజులపాటు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆయన సభలకు, రోడ్‌షోలకు నాలుగున్నర లక్షల మంది స్వచ్ఛందంగా హాజరైనట్లు నిఘా వర్గాలు నివేదిక ఇచ్చాయి. దీంతో దీనినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోసేలా వైసీపీ ‘రాయలసీమ గర్జన’ సభను నిర్వహిస్తోందని రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి.
విభేదాలు రెచ్చగొట్టడానికే..
సుప్రీంకోర్టు తీర్పు సర్కారుకు సానుకూలంగా ఉంటే.. కర్నూలులో న్యాయ రాజధాని.. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వమే డిమాండ్ చేయడమెందుకన్నది ప్రశ్న. కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోతుంటే.. హైకోర్టు భవనాలకు ఏకంగా శంకుస్థాపన చేయొచ్చు కదా అని ప్రజలే నిలదీస్తున్నారు. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని నిజంగా భావిస్తే.. అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని సుప్రీంకోర్టులో ఎందుకు స్పష్టం చేశారు..? అలా చెప్పిన వెంటనే కర్నూలులో గర్జన ఎందుకు పెడుతున్నారని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. న్యాయస్థానంలో ఒకలా.. ప్రజాక్షేత్రంలో మరోలా వ్యవహరిస్తూ జగన్ రెండునాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారని.. 3రాజధానులపై ఆయనకు చిత్తశుద్ధి లేదని.. 2024 ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నాయి. విశాఖలో పాలనా రాజధాని కోసం జేఏసీ ముసుగులో వైసీపీ అక్కడ గర్జన చేపట్టింది. కానీ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే గాక విశాఖ నగరం నుంచీ ఏమాత్రం స్పందన రాలేదు. దీంతో కర్నూలుకు వచ్చేసరికి ముసుగు తొలగించేసింది. వైసీపీ ఆధ్వర్యంలోనే అన్ని ఏర్పాట్లూ జరిగాయి.
ప్రధాన వక్త సజ్జలే!
కర్నూలు సభలో సలహాదారు సజ్జల కీలకోపన్యాసకుడిగా వ్యవహరించనున్నారు. నిజానికి ఆయన పార్టీ సమావేశాల్లోనో, నేతలతో ఆంతరంగిక భేటీల్లోనో మాట్లాడుతుంటారు. ఇంత భారీ బహిరంగ సభల్లో ఎప్పుడూ పాల్గొనలేదు. ఇప్పుడు ఆయనే గర్జన సభలో ప్రధాన వక్త కావడం వైసీపీ వర్గాలకు సైతం విస్మయం కలిగిస్తోంది.