Potti Sri Ramulu: ‘అమరజీవి’కి దిక్కెవరు?
ABN , First Publish Date - 2022-12-15T03:46:46+05:30 IST
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు మూలకారకుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరం కనీసం పట్టించుకునేవారి కోసం ఎదురు చూస్తోంది. మూడేళ్లుగా పైసా విదల్చని జగన్ సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా చెన్నై మైలాపూర్‌లో సదరు మందిరం బిక్కుబిక్కుమంటోంది.
ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణకు నేటితో 70 ఏళ్లు
నిధుల్లేక చెన్నై స్మారక భవనం వెలవెల..
కనీస నిర్వహణకూ పైసా విదల్చని జగన్ సర్కారు
కమిటీ సభ్యుల చందాలతోనే ముందుకు..
మూడేళ్లుగా ఇదే తంతు
స్మారకంలోని గ్రంథాలయంలో అమూల్య గ్రంథాలు..
పర్యవేక్షణ లేక పాడయ్యే పరిస్థితి
5 లక్షల విరాళం ప్రకటించిన ఒంగోలు ఎంపీ మాగుంట.. గ్రంథాలు భద్రపరచాలని సూచన
కానీ విరాళాల సేకరణపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం.. అలాగే ఉండిపోయిన ఆ 5 లక్షలు
(చెన్నై-ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు మూలకారకుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరం కనీసం పట్టించుకునేవారి కోసం ఎదురు చూస్తోంది. మూడేళ్లుగా పైసా విదల్చని జగన్ సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా చెన్నై మైలాపూర్‌లో సదరు మందిరం బిక్కుబిక్కుమంటోంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసిన పొట్టి శ్రీరాములు ఆ క్రమంలో అమరుడైన విషయం తెలిసిందే. ఆయన అసువులు బాసిన చోటే అప్పటి పెద్దల చొరవతో స్మారకమందిరం నిర్మితమైంది. ఈ భవనం ఆంధ్ర ప్రభుత్వానికి చెందినదైనప్పటికీ ఆది నుంచి పాలకులెవరూ పట్టించుకున్న దాఖలాల్లేవు. అయితే శ్రీరాములు శిష్యుడైన దివంగత వైఎస్ శాస్త్రి వంటి వారి చొరవతో ప్రభుత్వాలు అప్పుడప్పుడూ నిధులు ఇస్తుండేవి. శాస్త్రి తదనంతరం ఆయన కుమారుడు కొంతకాలం ఆ భవనాన్ని నిర్వహించారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక దాని నిర్వహణ కోసం ఓ కమిటీని వేసి కొంత నిధి ఇచ్చింది. నిర్వాహకులు పలుమార్లు చేసిన విజ్ఞప్తితో 2018లో పాత బకాయిలను చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయగా.. అవి 2019లో వారికి అందాయి. జగన్ ప్రభుత్వం వచ్చాక కొత్త కమిటీని నియమించింది. కానీ ఇప్పటి వరకూ పైసా ఇవ్వలేదు. ఈ భవనం నిర్వహణకు నెలకు కనీసం రూ.లక్ష వ్యయమవుతుంది. అయితే రాష్ట్రప్రభుత్వం నుంచి మూడేళ్లుగా నిధులు రాకపోవడంతో భవన నిర్వాహక కమిటీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీ సభ్యులు తమ శక్తిమేరకు నెల నెలా చందాలు వేసుకుని నిర్వహణ చేస్తున్నారు. నిజానికి ఆ భవనం శిథిలావస్థకు చేరడంతో కమిటీ అధ్యక్షుడే గత ఏడాది సొంత ఖర్చుతో మరమ్మతు చేయించారు. భవనంలోని రెండో అంతస్తులో అరుదైన, అమూల్యమైన గ్రంథాలున్నాయి. తగిన పర్యవేక్షణ లేకపోవడంతో అవి పాడైపోయే పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయం తెలుసుకున్న ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి గతంలో రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు. ఆ నిధితో గ్రంథాలయంలోని పుస్తకాలను భద్రపరచాలని సూచించారు. అయితే విరాళాల సేకరణపై ప్రభుత్వం కమిటీకి ఎలాంటి స్పష్టతా ఇవ్వకపోవడంతో మాగుంట ప్రకటించిన విరాళం అలాగే ఉండిపోయింది. భవన నిర్వహణకు నిధుల కోసం కమిటీ నిర్వాహకులు ఏపీ ప్రభుత్వ పెద్దలు, సాంస్కృతిక శాఖ అధికారుల చుట్టూ ఎన్నిమార్లు తిరిగినా ఫలితం లేదు. దాని నిర్వహణ వదిలేసి శిథిల స్థితిలో పడేయలేక.. నెలనెలా తమ జేబు నుంచి డబ్బులు చెల్లించలేక వారు మదనపడుతున్నట్లు తెలిసింది. నిజానికి ఈ స్మారక మందిరం చిన్నదైనప్పటికీ తెలుగు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు గతంలో నిత్యం జరుగుతుండేవి. ఇప్పుడు నిధుల లేమితో వాటి నిర్వహణా కష్టంగా మారింది.
సమరజీవి..
ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన పొట్టిశ్రీరాములు జీవితం ఆద్యంతం సమరమే. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తిగానే ఈ తరం వారికి ఆయన తెలుసు. కానీ ఆయన స్వాతంత్య్ర సమరంలో క్రియాశీల పాత్ర పోషించారు. 1901 మార్చి 16న జన్మించిన ఆయన స్వస్థలం ఇప్పటి ప్రకాశంజిల్లా కనిగిరి మండలం పడమటపల్లి. కరువుకాటకాల కారణంగా ఆయన కుటుంబం మద్రాసుకు మారింది. ఇక్కడే శ్రీరాములు విద్యాభ్యాసం చేశారు. ముంబైలో శానిటరీ ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఆయన.. ‘గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే’లో ఉద్యోగం సంపాదించారు. 1929లో తన భార్యను, అప్పుడే జన్మించిన బిడ్డను కోల్పోయిన ఆయన.. రెండేళ్ల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనేందుకు సబర్మతి ఆశ్రమంలో చేరారు. జాతిపిత గాంధీజీ ప్రియశిష్యుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని పలుమార్లు జైలుపాలయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. ఆయన పట్టుదల, కఠోర శ్రమను మెచ్చిన గాంధీజీ.. ‘నాకు శ్రీరాములు లాంటి మరో పదిమంది సహచరులుంటే ఒకేఒక్క ఏడాదిలో బ్రిటిష్ పాలన నుంచి విముక్తి సాధించగలను’ అని వ్యాఖ్యానించడం శ్రీరాములు సామర్థ్యానికి నిదర్శనం. వైశ్య సామాజికవర్గానికి చెందిన శ్రీరాములుకు కులమతాల పట్టింపులు ఉండేవి కావు. దళితులు, నిమ్నజాతుల హక్కుల కోసం గళమెత్తడంతో పాటు పలుమార్లు నిరాహారదీక్షలు చేపట్టారు. 1946-48 కాలంలో దళితుల ఆలయ ప్రవేశానికి మద్దతుగా పలుమార్లు నిరాహార దీక్ష చేశారు. దరిమిలా.. వారంలో కనీసం ఒక్కరోజు దళితుల అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలని నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.
జీవిత చరమాంకంలో నెల్లూరులో నివసించిన ఆయన.. దళితుల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. దళిత హక్కుల కోసం ప్లకార్డులు చేతబూని చెప్పుల్లేకుండానే మండుటెండలో పాదయాత్ర చేశారు. దళితులకు మద్దతిస్తున్నారని అగ్రవర్ణాలు ఆయన్ను దూరంగా పెట్టాయి. ఆ వర్గాల నుంచి ఆయన ప్రతిఘటన కూడా ఎదుర్కొన్నారు. అయితే వీటన్నింటినీ అధిగమించిన శ్రీరాములు.. నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా పోరాడారు. విదేశీ పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర సంగ్రామంలో క్రియాశీలంగా వ్యవహరించిన ఆయన.. అదే స్ఫూర్తితో స్వదేశీ పాలకులపైనా పోరాటం చేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆంధ్రులకు ఎదురవుతున్న అవమానాలు, అన్యాయాలను గ్రహించిన ఆయన.. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలన్న డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కాంగ్రెస్ పార్టీ దీనిని వ్యతిరేకించినా ఆయన లెక్కచేయలేదు. మద్రాసులోని మహర్షి బులుసు సాంబమూర్తి నివాసంలో 1952 అక్టోబరు 19న ఆమరణ దీక్షకు కూర్చున్నారు. 56 రోజుల పాటు దీక్ష కొనసాగించి ఆ ఏడాది డిసెంబరు 15న తుదిశ్వాస విడిచారు. ఆయన శవయాత్రలో వేల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనాగ్రహం మిన్నుమిట్టింది. హింసాకాండ చెలరేగింది. ఆస్తుల ధ్వంసం జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో పలు చోట్ల నిరసనలు మిన్నుముట్టాయి. అనకాపల్లి, విజయవాడల్లో పోలీసు కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజులపాటు మద్రాసు, ఆంధ్ర ప్రాంతాలు ఆందోళనలతో అట్టుడికాయి. జనజీవనం స్తంభించింది. దీంతో దిగివచ్చిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని డిసెంబరు 19న ప్రకటించారు. మరుసటి ఏడాది అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. దీనిని సాకారం చేయడానికి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసి గురువారం నాటికి 70 ఏళ్లు. అలాంటి మహోన్నత వ్యక్తి స్మారక మందిరం నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం నిధులివ్వకపోవడం బాధాకరమని అభిమానులు వాపోతున్నారు.
నిధులివ్వకపోవడం సిగ్గుచేటు:
టీడీపీ నేత చంద్రశేఖర్
ముఖ్యమంత్రి జగన్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని రూ.2 కోట్ల వ్యయంతో సంబరాలు జరిపిన సాంస్కృతిక శాఖ.. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరజీవి స్మారక భవనం నిర్వహణకు పైసా కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటని చెన్నై టీడీపీ నేత చంద్రశేఖర్ విమర్శించారు. దేశంలో భాషాప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడడానికి పొట్టి శ్రీరాములే మూలకారకుడని.. అలాంటి వ్యక్తి స్మారకాన్ని అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం.. నిర్లక్ష్యంగా వదిలేయడం సరికాదని చెప్పారు. ఇప్పటికైనా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.