ఇదేనా చిత్తశుద్ధి!

ABN , First Publish Date - 2022-08-19T08:10:18+05:30 IST

ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన సందర్భంగా సొంత గడ్డపై సీఎం జగన్‌ ఎన్నో మాటలు చెప్పారు. అప్పుడు వైఎస్‌, ఇప్పుడు తాను మాత్రమే కడప జిల్లాను పట్టించుకుంటున్నామని అన్నారు.

ఇదేనా చిత్తశుద్ధి!

  • కడప ఉక్కుపై నాడు ఎన్ని కబుర్లో!
  • జగన్‌ చెప్పిన ‘కొబ్బరికాయ’ కథ
  • విశ్వసనీయతపై తనదే పేటెంట్‌ అన్నంతగా జనం చెవిలో పూలు
  • మూడేళ్లలో పూర్తవుతుందని హామీ
  • నేటికి ప్రహరీ కూడా కట్టలేదు
  • రెండు షెడ్లు మినహా ఏమీ లేవు
  • సొంత జిల్లా వాసులకూముఖ్యమంత్రి జగన్‌ మోసం
  • మూడేళ్లవుతున్నా ఊసేలేని పురోగతి

  • ఇప్పటి వరకూ జరిగిందేంటి
  • అసంపూర్ణంగా ప్రహరీగోడ నిర్మాణం.
  • రెండు రేకుల షెడ్లు. 
  • మెయిన్‌ గేటు నిర్మాణంజరుగుతోంది. 
  • 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులు జరుగుతున్నాయి.

‘‘ఎన్నికలకు ఆరునెలల ముందు ఆ పెద్దమనిషి టెంకాయ కొట్టారు. ఒకసారి ఆలోచించమని చెబుతున్నా! ప్రజలు ఐదు సంవత్సరాల పరిపాలనకు అధికారం ఇస్తారు. అందులో నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏమీ చేయకుండా... ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే మోసం అంటారు. అదే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో టెంకాయ కొడితే దీనిని చిత్తశుద్ధి అంటారు. పాలనలో తేడా ఎలా ఉంటుందో ఆలోచించండి! మూడేళ్లలో కడప ఉక్కు పరిశ్రమను పూర్తి చేసి ప్రారంభిస్తాం!’’


2019 డిసెంబరు 23న కడప జిల్లా ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తూ సీఎం జగన్‌ పలికిన చిలక పలుకులివి! ‘చిత్తశుద్ధి’కి చిరునామా తానే అనేలా, విశ్వసనీయతపై పేటెంట్‌ తనకు మాత్రమే ఉందనేలా సొంతగడ్డపై చెప్పిన మాటలివి! ఇది విని కడప జిల్లా ప్రజలు మురిసిపోయారు. తమ ‘ఉక్కు’ కల నెరవేరుతుందని సంబరపడ్డారు. అసలే సొంత జిల్లా, ఆపైన చిత్తశుద్ధి అని కూడా అంటున్నారు కదా... జగన్‌ చెప్పింది చేసి తీరతారని గట్టిగా భావించారు. మరో నాలుగు నెలలు గడిస్తే... ఆయన చెప్పిన మూడేళ్లు ముగుస్తాయి. ‘మాట తప్పని నాయకుడి’ లెక్క ప్రకారం ఈపాటికి ఉక్కు కర్మాగారం పనులు 80 శాతానికిపైగా పూర్తయి ఉండాలి. కానీ... అక్కడ ప్రహరీ మినహా మరేమీ లేదు. ఇక మిగిలింది నాలుగు నెలలు. ఇంత తక్కువకాలంలో నిర్మాణం అంటే అరచేతిలో గ్రాఫిక్స్‌ గీసి ‘సినిమా’ చూపించాల్సిందే!


(కడప - ఆంధ్రజ్యోతి) : ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన సందర్భంగా సొంత గడ్డపై సీఎం జగన్‌ ఎన్నో మాటలు చెప్పారు. అప్పుడు వైఎస్‌, ఇప్పుడు తాను మాత్రమే కడప జిల్లాను పట్టించుకుంటున్నామని అన్నారు. ‘‘దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కాస్తో కూస్తో కడప జిల్లాలో అభివృద్ధికి అడుగులు పడ్డాయి. నాన్న చనిపోయిన తరువాత మన జిల్లా గురించిగానీ, మన పిల్లల గురించిగానీ ఆలోచన చేసిన వారు లేరు. వెనుకబడిన రాయలసీమకు మేలు జరగాలంటే నీరు, పరిశ్రమలు, ఉద్యోగాలు రావాలి. ఇవి ఎలా తేవాలో తెలిసిన వ్యక్తి మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు.


రాయలసీమను ఆర్థికాభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పించేందుకు 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయడం గర్వంగా ఉంది. ఈ పరిశ్రమ రావడంతో రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. రూపురేఖలు మారుతాయి’’ అంటూ చెప్పుకొచ్చారు. అంతన్నాడు... ఇంతన్నాడు.. అన్న చందంగా ఆనాడు జగన్‌ మాటలు దొర్లించారు. చివరకు రాజకీయ భిక్ష పెట్టిన సొంత జిల్లా వాసులకే ఉక్కు కర్మాగారం నిర్మాణంలో మోసం చేశారు.


మార్చి... ఏమార్చి!

రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చినట్టు కడపలో కేంద్ర ప్రభుత్వమే స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్లాంట్‌ ఏర్పాటు కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం కేంద్రంపై పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చింది. అయినా.. కేంద్రం స్పందించకపోవడంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తానే ఉక్కు సంకల్పం తీసుకుంది. కడప ఉక్కు పరిశ్రమలో సొంత వనరులతో రాష్ట్ర పరిధిలోనే నిర్మాణానికి పూనుకుంది. రాయలసీమ స్టీల్‌ అథారిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను ఏర్పాటుచేసి మైలవరం మండలం ఎం.కంబాలదిన్న సమీపంలో 3,892 ఎకరాలు కేటాయించింది. రూ.33 వేల కోట్ల వ్యయంతో  స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 18 నెలల్లో ఉక్కు ఉత్పత్తి మొదలుపెట్టాలనే లక్ష్యంగా 2018 డిసెంబరు 27న చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. జగన్‌ సీఎం అయిన తరువాత చంద్రబాబు శంకుస్థాపన చేసిన దానికి మంగళం పలికి, కొత్తగా స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి సంకల్పించారు. ఇందులో భాగంగా సరిగ్గా ఏడాది తర్వాత, 2019 డిసెంబరు 23న కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె పెద్దదండ్లూరు గ్రామాల సమీపంలో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి టెంకాయకొట్టి శంకుస్థాపన చేశారు.


రూ.15 వేల కోట్ల వ్యయంతో 30 లక్షల టన్నుల సామర ్థ్యం గల స్టీల్‌ ప్లాంట్‌ నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేలమందికి ఉపాధి దక్కుతుందన్నారు. సరిగ్గా మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ కోసం 3148.69 ఎకరాల భూమిని కేటాయించారు. రెండు దశల్లో కర్మాగారం పూర్తి చేయాలని నిర్ణయించారు. ఫేజ్‌-1లో రూ.10,082 కోట్లతో మూడు మిలియన్‌ టన్నులు, ఫేజ్‌ - 2లో రూ.6వేల కోట్లతో 3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ నిర్మాణం చేపట్టాలనుకున్నారు. టౌన్‌షి్‌ప, మౌలిక వసతుల కల్పన, పరిశ్రమ నిర్మాణం కోసం ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.


ఊసేలేని పురోగతి

జగన్‌ మాట నిలబడాలంటే ఇప్పటికి 80 శాతం ఉక్కు పరిశ్రమ పనులు పూర్తి కావాలి. ఇప్పటికే కర్మాగారానికి అవసరమైన యంత్రాలు షెడ్లు, రహదారులు, టౌన్‌షి్‌ప, ఇతరత్ర అన్నీ ఈ పాటికే సమకూరి ఉండాలి. కానీ, అక్కడ మూడేళ్లలో జరిగిందేమిటంటే అసంపూర్ణ ప్రహరీగోడ నిర్మాణం. లోపల రెండు రేకుల షెడ్లు అంతే. మెయిన్‌ గేటు నిర్మాణం జరుగుతోంది. 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులు మాత్రం జరుగుతున్నాయి. రోడ్లు లేవు. అంతకు మించి పనులేం లేవు. ముగ్గురు వాచ్‌మెన్లు ఉన్నారు. ఒకరు పగటి పూట కాపలా ఉంటే ఇద్దరు రాత్రి పూట గస్తీ తిరుగుతున్నారు. ఆర్భాటంగా ఆవిష్కరించిన శిలాఫలకం తప్ప ఇక్కడ ఏమీ లేవు. మాట ఇస్తే తప్పను అని వైఎస్‌ జగన్‌ చెబుతూ వచ్చారు. జిల్లావాసులు కూడా నమ్మారు. జగన్‌ సీఎం అయిపోతే ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది, తమ పిల్లలు బాగుపడతారని తల్లిదండ్రులు సంతోషించారు. సొంత జిల్లాలోనే ఉద్యోగం అంటూ యువత సంబరపడ్డారు. ఫ్యాక్టరీ ఏర్పడితే విశాఖపట్నం తరహాలో అభివృద్ధి చెంది అందరికీ ఉపాధి దొరుకుతుందని ఆశపడ్డారు. జగన్‌ మాట తప్పడని సంతోషించారు. అయితే, గత మూడేళ్లలో జిల్లా వాసులకు జగన్‌తత్వం బోధపడిపోయింది.


ఒక ఉక్కు కర్మాగారం.. ముగ్గురు సీఎంలు!

1) వైఎస్‌ హయాంలో 2007 జూన్‌ 10లో కడప జిల్లా జమ్మలమడుగు మండలం అంబవరం వద్ద 10,670 ఎకరాల్లో బ్రహ్మణీ స్టీల్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అయితే.. ఫ్యాక్టరీ పనులు ప్రారంభించిన గాలి జనార్ధన్‌రెడ్డి ఓబులాపురం అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో జైలుకు వెళ్లడం, వైఎస్‌ చనిపోవడంతో స్టీల్‌ కథ కంచికి చేరింది. 


2) రాష్ట్ర విభజన చట్టంలో ఉక్కుఫ్యాక్టరీని పెట్టి మరిచిన కేంద్రం తీరుకు నిరసనగా అప్పటి టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనతో దీక్ష విరమింపజేసిన సందర్భంలో.. ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని నాటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. 2018 డిసెంబరు 27న రాయలసీమ స్టీల్‌ అథారిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరిట శంకుస్థాపన కూడా చేశారు. ఇంతలో ఎన్నికలు జరిగి రాష్ట్రంలో అధికారం మారింది. 


3) తన తండ్రి వైఎస్‌ శంకుస్థాపన చేసిన బ్రహ్మణీ స్టీల్స్‌ను, గత సీఎం శంకుస్థాపన చేసిన రాయలసీమ స్టీల్‌ అథారిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను కాదని.. జగన్‌  ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ప్లాంట్‌ పేరిట 2019 డిసెంబరు 23న శంకుస్థాపన చేశారు. అయితే..పేరు మారింది తప్ప మూడేళ్లుగా పనుల్లో పురోగతి లేదు.

Updated Date - 2022-08-19T08:10:18+05:30 IST