సర్వే రాళ్లపై ఫొటో లేదు.. పేరే!

ABN , First Publish Date - 2022-08-16T10:41:50+05:30 IST

సీఎం జగన్‌ రికార్డుల్లో మరో మైలు‘రాయి’ ఇది! భూముల సర్వే సందర్భంగా ఏర్పాటు చేసే రాళ్లపై గతంలో సీఎం ఫొటోతోపాటు ఆయన పేరును కూడా చెక్కించారు.

సర్వే రాళ్లపై  ఫొటో లేదు.. పేరే!

  • జగన్‌ పేరు ముద్రణకే పరిమితం
  • విమర్శలతో వెనక్కి తగ్గిన సర్కారు
  • సర్వే, సరిహద్దు రాళ్లుగా గ్రానైట్‌
  • ఎనిమిది జిల్లాల్లో సరఫరాకు టెండర్లు
  • ‘భూ హక్కు’ పథకం పేరు కుదింపు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ రికార్డుల్లో మరో మైలు‘రాయి’ ఇది! భూముల సర్వే సందర్భంగా ఏర్పాటు చేసే రాళ్లపై గతంలో సీఎం ఫొటోతోపాటు ఆయన పేరును కూడా చెక్కించారు. అయితే.. దీనిపై విమర్శలు రావడంతో ఫొటోను తొలగించి.. పేరును మాత్రం కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం’ పేరు పెద్దదిగా ఉండటంతో దానిని ‘వైఎస్సార్‌ జగనన్న భూ రక్ష-2020’గా మార్పు చేశారు. ఈ సర్వే రాళ్లను గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. దీనికిగాను గనుల శాఖ ఆమోదించిన కంపెనీలకు చెందిన గ్రానైట్‌ రాళ్లను మాత్రమే ఉపయోగించనున్నారు. ఈ మేరకు 2 ప్యాకేజీల కింద 8 జిల్లాల్లో సర్వేరాళ్ల సరఫరాకు ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) టెండర్లు పిలిచింది. ప్యాకేజీ-1లో ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ప్యాకేజీ-2లో చిత్తూ రు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో టెండర్లు పిలిచారు. మూడు రహదారులతో కూడిన ట్రై జంక్షన్ల దగ్గర ఏ-క్లాస్‌, ప్రభుత్వ, ప్రైవేటు భూములు, ఇతర సరిహద్దు ప్రాంతాల వద్ద బీ-క్లాస్‌ సర్వే రాళ్లను ఏర్పాటు చేయనున్నారు. 


ప్రభుత్వ భూములకు ఏర్పాటు చేసే సర్వే రాళ్లపై ప్రత్యేకంగా ‘ఎస్‌’ అనే అక్షరం లిఖించాలని నిర్ణయించారు. అయితే, ఏ, బీ క్లాసు రాళ్లపై విధిగా సిల్వర్‌ కోటింగ్‌తో ‘‘వైఎ్‌సఆర్‌ జగనన్న భూ రక్ష-2020’’ పేరును ముద్రించాలని, అవి చెరిగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టెండర్‌ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. భూముల రీ సర్వే ప్రారంభించిన 2020లో సర్వే రాళ్లపై అధికారులు కొన్ని డిజైన్‌లు చేయించారు. వాటిలో సీఎం జగన్‌ ఫొటోతోపాటు ఆయన పేరు ను ముద్రించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రకాశం జిల్లాల్లోని ఓ గ్రానైట్‌ ఫ్యాక్టరీలో కొన్ని సర్వేరాళ్లను శాంపిల్‌గా తయారు చేయించి విజయవాడకు తీసుకొచ్చారు. వాటిపై సీఎం జగన్‌ ఫొటోను ముద్రించారు. ఈ విషయాన్ని ‘సర్వే రా ళ్లపై జగనన్న ఫొటోలు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో రాళ్లపై సీఎం ఫొటోలు వద్దంటూ ప్రభుత్వ పెద్దలు సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ, బీ క్లాస్‌ గ్రానైట్‌ రాళ్లపై సిల్వర్‌ కోటింగ్‌తో ‘వైఎస్సార్‌ జగనన్న భూ రక్ష- 2020’ అనే పేరు ప్రముఖంగా కనిపించేలా రెవెన్యూ, సర్వేశాఖలు రూపొందించిన డిజైన్స్‌ను ఆమోదించారు. ఈ డిజైన్స్‌ మేరకు టెండర్లు పిలిచారు. 


సీఎం పేరుపైనా అభ్యంతరాలు!

సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రాజెక్టుల వద్ద ఏర్పాటు చేసే శిలాఫలాలపై సమాచారం కోసం పేర్లను ముద్రిస్తారు. అయితే  భూముల సర్వే సందర్భంగా పొలాలు, గట్లు, ఇంకా రహదారుల వెంట ఏర్పాటు చేసే సరిహద్దు రాళ్లపై ముఖ్యమంత్రి ఫొటోలు, పేర్లు ముద్రించి ఆయన మెప్పుపొందాలని సర్వే, రెవెన్యూ అధికారులు తొలి నుంచి ప్రయత్నిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇందుకు వారు ఇచ్చిన ప్రతిపాదనలు, లోగడ సీఎం ఫొటోతో తయారు చేయించిన శాంపిల్‌ సర్వేరాళ్లే నిదర్శనం. తొలుత సీఎం ఫొటోలతో రాళ్లు తయారు చేయించినప్పుడు తీవ్ర విమర్శలు రావడంతో దాదాపు ఏడాదిన్నరపాటు ఈ అంశంపై మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ సర్వే రాళ్లపై సీఎం పేరును పెట్టి డిజైన్స్‌ను ఒకే చేయించారు. అయితే.. ఇలా సర్వే రాళ్లపై సీఎం జగన్‌ పేరును ముద్రించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Read more