police posts Technology : పోలీసు పోస్టుల టెక్నాలజీ మాకే!

ABN , First Publish Date - 2022-12-15T03:38:52+05:30 IST

పోలీసు ఉద్యోగాల నియామకాలకు మూడున్నరేళ్ల తర్వాత జగన్‌ ప్రభుత్వం అరకొర నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన టెక్నాలజీ మొత్తం తమ నుంచే తీసుకోవాలని ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.

police posts  Technology : పోలీసు పోస్టుల టెక్నాలజీ మాకే!

సోదరుడి కొడుకు కంపెనీ కోసం

ఉత్తరాంధ్ర మంత్రి తీవ్ర ఒత్తిళ్లు

జేఎన్‌టీయూతో పోలీసు శాఖ ఒప్పందం రద్దుకు యత్నాలు

బాగున్న టెక్నాలజీ మార్చడమెందుకు?.. ఉన్నతాధికారుల ప్రశ్న

గతంలో కార్ల స్కాం కేసులో అబ్బాయిని విచారించిన సీబీఐ?

అమరావతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): పోలీసు ఉద్యోగాల నియామకాలకు మూడున్నరేళ్ల తర్వాత జగన్‌ ప్రభుత్వం అరకొర నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన టెక్నాలజీ మొత్తం తమ నుంచే తీసుకోవాలని ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఇది తట్టుకోలేక పోలీసు ఉన్నతాధికారులు దీనిని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నట్లే పోలీసు ఉద్యోగాలకూ రాత పరీక్షలుంటాయి. అదనంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా 2016 నుంచి ఏపీ ప్రభుత్వం నిర్దిష్ట టెక్నాలజీని వినియోగిస్తోంది. శారీరక కొలతలతోపాటు పరుగు పోటీల్లోనూ సెకన్లు తేడా లేకుండా కచ్చితమైన కొలత వచ్చేస్తుంది. దీంతో అభ్యర్థులకు అన్యాయం జరగదు.. ఆరోపణలకూ తావుండదు. ఈ టెక్నాలజీ కోసం కాకినాడలోని జేఎన్‌టీయూతో పోలీసు శాఖ అప్పట్లో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రాత పరీక్షల నిర్వహణతోపాటు ఇతర పరీక్షలు కూడా జేఎన్‌టీయూ నిర్వహిస్తోంది. అందుకు సంబంధించి దేశంలోనే నమ్మకమైన పరికరాలు పంపిణీ చేసే ఓ ప్రైవేటు కంపెనీతో జేఎన్‌టీయూ ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటి సంస్థే ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రి సోదరుడి కుమారుడికి ఉంది. గత ఒప్పందాన్ని రద్దు చేసి తమ కంపెనీతో కుదుర్చుకోవాలంటూ బాబాయ్‌ మంత్రి జేఎన్‌టీయూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. వారు పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఇప్పుడున్న టెక్నాలజీ బాగుందని, మార్చాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న ఎదురైంది. దీంతో అటు వైపు నుంచి చక్రం తిప్పేందుకు ఆ మంత్రి ప్రయత్నించడంతో పోలీసులు లోతుల్లోకి వెళ్లి ఆరా తీశారు.

వైఎస్‌ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు రావలసిన ఒక కార్ల కంపెనీ వ్యవహారంలో ఫేక్‌ ఒప్పందం చేసుకుని కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం కొట్టేసిన కేసు విచారణలో.. మంత్రి సిఫారసు చేస్తున్న అబ్బాయిని సీబీఐ విచారించిన విషయం వెలుగులోకి వచ్చింది. అటువంటి వ్యక్తికి పోలీసు నియామకాల టెక్నాలజీ కట్టబెడితే అక్రమాలు జరిగే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. అంతేగాక అధికార పార్టీకి చెందిన వ్యక్తులకు ఏకపక్షంగా కట్టబెడితే ఆరోపణలు కూడా వచ్చి నిరుద్యోగులు, అభ్యర్థుల్లో ఆందోళనకు దారి తీసే అవకాశముందని ప్రభుత్వ పెద్దలకు చెప్పినట్లు తెలిసింది. మరి ఉత్తరాంధ్రలో కీలకమైన ఆ మంత్రి ఒత్తిళ్లకు జగన్‌ ప్రభుత్వం బ్రేకులు వేస్తుందో లేదో చూడాలి.

Updated Date - 2022-12-15T03:38:53+05:30 IST