విపత్తు నిధుల మళ్లింపా?

ABN , First Publish Date - 2022-07-12T08:26:04+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ వ్యక్తిగత ఖాతాలకు మళ్లించిన నిధులను తిరిగి జమ చేయాల్సిందేనని

విపత్తు నిధుల మళ్లింపా?

జగన్‌ ప్రభుత్వంపై సుప్రీం సీరియస్‌

కరోనా నాలుగో వేవ్‌ వస్తే పరిస్థితేమిటి?

ఇతర రాష్ట్రాలూ ఇలాగే చేస్తే ఏమవుతుంది?

మళ్లించిన నిధులు జమ చేయాల్సిందే: బెంచ్‌

కరువు అవసరాల కోసమే పీడీ ఖాతాలకు: ఏపీ

ఆ అవసరాలకూ వాటిని వాడలేదన్న బెంచ్‌

ఏపీ నుంచి వడ్డీ వసూలు చేస్తాం: కేంద్రం

నిధులపై ఏపీ పరస్పర విరుద్ధ వాదనలు

రూల్స్‌ ఉల్లంఘించింది: కాగ్‌ అఫిడవిట్‌


‘‘ఒకవేళ కరోనా నాలుగో వేవ్‌ వస్తే నిధులు ఎలా? నిధులు లేకపోతే పరిస్థితి ఏమిటి? భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? పైగా కరువు కోసం అని చెప్పి నిధులు బదలాయించినా.. ఆ అవసరానికీవాటిని వినియోగించలేదు. తాత్కాలికంగా చేసినా... ఎలా చేసినా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్లించరాదు. ఆ సొమ్ము తిరిగి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఖాతాకు చేరాల్సిందే.’’

సుప్రీంకోర్టు


‘‘రూ.1,100 కోట్ల విపత్తు నిధుల్లో రూ. 895.06 కోట్లను ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం ఖర్చు చేశామని రాష్ట్ర ప్రభుత్వం ఒక చోట అఫిడవిట్‌లో పేర్కొంది. మరొకచోట మాత్రం మొత్తం రూ.1,100 కోట్లూ పీడీఏ ఖాతాలో నిరుపయోగంగా పడి ఉన్నట్లు తెలిపింది. రెండేళ్ల తర్వాత ఈ ఏడాది మే నాలుగో తేదీన ఈ విషయం డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ ఎకౌంట్స్‌ ధ్రువీకరించింది. ఇలా విపత్తు నిధులపై ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పరస్పర విరుద్ధమైన వాదనలు చేసింది’’ 

- కాగ్‌ అఫిడవిట్‌


న్యూఢిల్లీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి  నుంచి వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ వ్యక్తిగత ఖాతాలకు మళ్లించిన నిధులను తిరిగి జమ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను మళ్లించరాదని తేల్చిచెప్పింది. కరోనా నాలుగో వేవ్‌ వస్తే ఏం చేస్తారని సూటిగా నిలదీసింది. మళ్లించిన నిధులను తిరిగి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఖాతాకు జమ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కరోనా నియంత్రణకు వినియోగించాల్సిన దాదాపు రూ.1,100 కోట్ల మేర ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధుల నుంచి ఏపీ సర్కారు మళ్లించిందని టీడీపీ నేత పల్లా శ్రీనివాస రావు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. నిధుల మళ్లింపుపై కాగ్‌ సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలించింది. అయితే, ఈ నిధులు 2020 మార్చి ముందువని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది ఆర్‌ బసంత్‌ వాదించారు. దానికి స్పందించిన ధర్మాసనం... ‘‘నిధులు ఎప్పటివైనా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సొమ్ములను మళ్లించరాదు.


మళ్లించిన నిధులను తిరిగి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఖాతాలో జమ చేయండి’’ అని సూచించింది. నిధులు మళ్లించలేదని బసంత్‌ అనగా... నిధులు మళ్లించినట్లు స్పష్టంగా తెలుస్తోందని ధర్మాసనం తెలిపింది. కరువు నేపథ్యంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను వ్యవసాయ కమిషనరేట్‌ వ్యక్తిగత డిపాజిట్‌ ఖాతా(పీడీఏ)కు బదలాయించారని, ఈ నిధులతో కరోనాకు సంబంధం లేదని బసంత్‌ వాదించారు. ‘‘ఏ అవసరాలకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు ఉపయోగించాలంటే... వాటికే వినియోగించాలి. కరువు కోసం అని చెప్పి ఆ నిధులను వినియోగించడం సరికాదు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. తాత్కాలికంగా మాత్రమే నిధులను బదిలీ చేశామని న్యాయవాది చెప్పబోతుండగా... జోక్యం చేసుకున్న ధర్మాసనం... ‘‘తాత్కాలికంగా మాత్రమే బదిలీ చేశారు కాబట్టి ఆ నిధులు తిరిగి రావాల్సిందే.’’ అని తేల్చిచెప్పింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి చెబుతానని బసంత్‌ అనగా... అ అవసరం లేదని, తామే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది. కాగా, ఈ నిధులు మార్చి 2020 పూర్వపువని మరోసారి ప్రభుత్వం తరఫున న్యాయవాది ప్రస్తావించగా... ‘‘ఆ సంగతి మాకు తెలుసు.


కానీ ఒకవేళ కరోనా నాలుగో వేవ్‌ వస్తే నిధులు ఎలా..? నిధులు లేకపోతే పరిస్థితి ఏమిటీ..? భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు..? పైగా కరువు కోసమని నిధులు బదలాయించి వినియోగించలేదు. తాత్కాలికంగా చేసినా... ఎలా చేసినా ఎస్‌డీఆర్‌ఎస్‌ నిధులు తిరిగి ఎస్‌డీఆర్‌ఎ్‌ఫకు రావాల్సిందే.’’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇతర రాష్ట్రాలు కూడా ఇలా చేస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. పీడీ ఖాతాలో ఉన్న నిధులను ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసమే ఉపయోగిస్తామని బసంత్‌ తెలిపారు. భవిష్యత్తులో అవసరమైతే ఉపయోగించుకోండికానీ ఇప్పుడైతే నిధులను తిరిగి ఎస్‌డీఆర్‌ఎ్‌ఫలో జమ చేయాలని బెంచ్‌ సూచించింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి చెబుతామని న్యాయవాది పదేపదే విజ్ఞప్తి చేయడంతో... ఉత్తర్వులు జారీ చేయకుండా తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అలాగే, నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని, కానీ నిధుల మళ్లింపు జరగలేదని కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి తెలిపారు. అయితే, బదిలీ చేసిన నిధులకుగాను నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం వడ్డీ వసూలు చేస్తుందని స్పష్టం చేశారు.


అంతకుముందు.. కాగ్‌.. ఈ వ్యవహారంపై అఫిడవిట్‌ దాఖలు చేసింది. విపత్తుల నిర్వహణ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) ఖాతా నుంచి రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడానికి వ్యక్తిగత డిపాజిట్‌ ఖాతాలకు (పీడీఏ) నిధులు మళ్లించడమే కాకుండా రెండేళ్లుగా వాటిని వినియోగించకుండా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని తేల్చిచెప్పింది. నిధులు మళ్లించినట్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌తో స్పష్టమైందని తెలిపింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పరస్పర విరుద్ధమైన వాదనలు చేసిందని వెల్లడించింది. పీడీ ఖాతాలకు విపత్తు నిధులను మళ్లించడం మార్గదర్శకాలను ఉల్లఘించడమేనని మార్చి 2020 ఆడిట్‌ నివేదికలో పేర్కొన్నామని తెలిపింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం బదులిస్తూ నిధులను 2020-21లో కరోనాను ఎదుర్కోవడానికి ఆ నిధులు మళ్లించామని తెలిపిందన్నారు. 


కాగ్‌ అఫిడవిట్‌లో ఏమున్నదంటే..

  • ఎస్‌డీఆర్‌ఎ్‌ఫకు సంబంధించిన ఏ వ్యయాన్ని అయినా 2245 నం. గల మేజర్‌ హెడ్‌ కిందనే నమోదు చేయాలి. పబ్లిక్‌ ఖాతాలో నమోదు చేయరాదు.
  • ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం 2019-20లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అందించిన రూ. 1100 కోట్లను పీడీ ఖాతాలకు సర్దుబాటు చేసింది. కానీ, వాస్తవానికి ఈ నిధులను ఖర్చు చేయలేదు. 
  • ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను నిర్దేశించిన ప్రయోజనానికి కాకుండా వేరే అవసరాలకు మళ్లించడం.. ఏ అవసరాల కోసం మళ్లించారో దానికోసం ్జ్జకూడా వినియోగపెట్టకపోవడం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాలకు విరుద్ధం’’

Updated Date - 2022-07-12T08:26:04+05:30 IST