contractors: కాంట్రాక్టర్ల పరిస్థితి మళ్లీ మొదటికి!

ABN , First Publish Date - 2022-11-08T05:19:11+05:30 IST

కాంట్రాక్టర్ల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అమరావతి రాజధాని ప్రాజెక్టుల పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే!.

 contractors: కాంట్రాక్టర్ల పరిస్థితి మళ్లీ మొదటికి!

సీఏ మొబలైజేషన్‌, ఆర్‌డీ అడ్వాన్సుల సర్దుబాటుకు సర్కారు నో

రాజధాని ప్రాజెక్టుల కాంట్రాక్టు సంస్థలకు రూ.829.31 కోట్ల పెండింగ్‌ బకాయిలు

మొబలైజేషన్‌ అడ్వాన్సులు, వడ్డీ కలిపి రూ.1372.68 కోట్ల అవుట్‌స్టాండింగ్‌

ప్రభుత్వ తిరస్కరణతో దిక్కుతోచని స్థితి

(విజయవాడ, ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టర్ల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అమరావతి రాజధాని ప్రాజెక్టుల పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే!. కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు సీఆర్‌డీఏ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదు. ఈ ఆందోళనతోనే ఒక కాంట్రాక్టర్‌ గుండాగి చనిపోయారు కూడా!. కాంట్రాక్టర్ల బాధలు చూసి సీఆర్‌డీఏ అధికారులు ఆయా సంస్థలకు గతంలో ఇచ్చిన మొబలైజేషన్‌ అడ్వాన్సులు, వాటికైన వడ్డీని పెండింగ్‌ బిల్లులతో సర్దుబాటు చేసేందుకు తాజాగా ప్రతిపాదించినా రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంది. దీంతో అటు కాంట్రాక్టు సంస్థల కష్టాలతోపాటు.. అధికారులకూ తలబొప్పి కడుతోంది.

ఇదీ పరిస్థితి..

అమరావతి రాజధానిలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వీటిలో భారీ పాజెక్టులకు సంబంధించి ఎన్‌సీసీ, బీఎ్‌సఆర్‌ఐఐఎల్‌, ఎంఈఐఎల్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌పీసీఎల్‌, కేఎంవీ, బీఎ్‌ససీపీఎల్‌, ఎన్‌సీసీ-ఆర్‌వీ (జాయింట్‌ వెంచర్‌), హెచ్‌ఈఎ్‌స-ఎంవీఆర్‌ (జాయింట్‌ వెంచర్‌)లు అనే మొత్తం తొమ్మిది ఏజన్సీలకు వివిధ ప్రాజెక్టులను అప్పగించారు. ఈ ప్రాజెక్టులకు సీఆర్‌డీఏ, ఏడీసీఎల్‌ల నుంచి రూ.1087.49 కోట్ల మేర మొబలైజేషన్‌ అడ్వాన్సులను ఇచ్చారు. పనులు పూర్తిగా నిలిపివేసిన సమయం అంటే 2021 సెప్టెంబరు 30 నాటికి వడ్డీ రూ. 285.19 కోట్లు కూడా కలుపుకుంటే మొత్తంగా రూ. 1372.68 కోట్లు మొబలైజేషన్‌ అడ్వాన్సుల రూపేణా అవుట్‌స్టాండింగ్‌ కనిపిస్తోంది. కాంట్రాక్టు సంస్థలు చేసిన పనులకు సీఆర్‌డీఏ, ఏడీసీఎల్‌ ల నుంచి రూ. 829.31 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. కాంట్రాక్టు సంస్థలకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులు రూ. 829.31 కోట్లకు గాను మొబలైజేషన్‌ అడ్వాన్సులు, వాటి వడ్డీ మొత్తం నుంచి రూ. 687.36 కోట్ల మేర సర్దుబాటు చేయటానికి వీలుగా సీఆర్‌డీఏ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. మొబలైజేషన్‌ అడ్వాన్సులను సీఆర్‌డీఏ సర్దుబాటు చేసి ఉంటే.. కాంట్రాక్టర్లకు కూడా పెద్ద ఊరట లభించి ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలేవీ కనిపించడంలేదు.

కాయిల బండలు తీర్చేదెప్పుడు ?

అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా తలపెట్టిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దశల వారీగా పనులను నిలిపివేశారు. ముందుగా 25 శాతం పురోగతి లేని పనులంటూ భారీ ప్రాజెక్టుల పనులను నిలిపివేశారు. ఇలా నిలిపివేసిన కేటగిరీలో 45, 40 అంతస్తులతో కూడిన భారీ టవర్ల నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం 80 శాతం పైబడి పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల పనులను కూడా నిలిపివేసింది. హైకోర్టు తీర్పు తర్వాత హడావుడి చేసినా.. ప్రస్తుతం పెద్దగా పనులు జరగటం లేదు. కాంట్రాక్టు సంస్థలకు మూడేళ్లుగా సీఆర్‌డీఏ ద్వారా చెల్లింపులు జరగటం లేదు. కాంట్రాక్టర్లు గతంలో చేసిన పనులు కొనసాగే పరిస్థితులు దరిదాపుల్లో కనిపించడంలేదు. మొబలైజేషన్‌ అడ్వాన్సులు తీసుకుని ఉండటం, భవిష్యత్తులో పనులు కొనసాగే పరిస్థితులపై అనిశ్చితి ఏర్పడటం కారణంగా.. కాంట్రాక్టర్లు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్‌ బకాయిలను కూడా ఇవ్వటం లేదు.

Updated Date - 2022-11-08T05:19:12+05:30 IST