నొక్కేది బతుకునే!
ABN , First Publish Date - 2022-08-18T09:05:17+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ ‘బటన్’ నొక్కుతున్నారా? లేక... జనాలా బతుకులను నొక్కుతున్నారా? వైసీపీ సర్కారు మూడేళ్లుగా అనుసరిస్తున్న ‘స్కీమ్’ను లోతుగా పరిశీలిస్తే..

- ఇచ్చేదానికంటే తీసుకునేదే అధికం
- భారాలు, బాదుళ్లు, షాక్‌లతో జనం విలవిల
- అధిక ధరలు, కొత్త పన్నులతో బెంబేలు
- అభివృద్థి లేదు.. ఉద్యోగాలు, ఉపాధీ లేవు
- అయినా రూ.వేల కోట్లలో అప్పులు
- అచ్చంగా జగన్ పథకాలు ఒకటి రెండే
- అయినా వేలకోట్లు జనం నుంచి పిండుడు
- కేంద్రం కళ్లు గప్పి భారీగా అప్పులు
- ఇదే బడ్జెట్‌తో గతంలోనూ సంక్షేమం
- ఇప్పుడు మాత్రం తీవ్ర సంక్షోభం
- ఎందుకీ నొక్కుడు?
- సర్వరోగనివారిణి లాగా అన్నీ రంగాల్లోని అన్నీ సమస్యలకు, ప్రజలందరి బాధలకు బటన్ నొక్కుడే పరిష్కారమన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
- ఈ బటన్ నొక్కడం వల్ల
- ఒక్క ఉద్యోగమన్నా వచ్చిందా?
- ఒక్క పరిశ్రమైనా వచ్చిందా?
- ఒక్క పంటకైనా గిట్టుబాటు దర కల్పించగలిగారా?
- ఏ ఒక్క రంగంలోనైనా ఉపాధి
- అవకాశాలు సృష్టించగలిగారా?
- ఒక్క నియోజకవర్గంలోనైనా
- రోడ్లు వేయగలిగారా?
- ప్రజలు నిత్యం వాడే నిత్యావసర ధరలేమైనా తగ్గించగలిగారా?
‘అక్కడ వందరూపాయల నోటు పడిపోయింది చూడండి. మీదేనా’ అని వల విసురుతారు. ‘ఔనా... నాదేనేమో!’ అనుకుంటూ అటు తిరిగి చూసి తీసుకునేసరికి... జేబులో ఉన్న రూ.150 లాగేస్తారు! ఇదోరకం మాయ, మోసం, దోపిడీ! ఇప్పుడు రాష్ట్రంలో బటన్ నొక్కుడు సంక్షేమం వెనుక జరుగుతున్నది ఇదేనా?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘బటన్’ నొక్కి ఏదో ఒక పథకం కింద నిధులు విడుదల చేస్తారు. అదికూడా... పేరు, అమలు తీరు మారిన పాత పథకమే! ఆ విషయం చెప్పకుండా మభ్యపెట్టి... ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్’ అంటూ బటన్ నొక్కేస్తారు. ఆ వెంటనే... ఏదో ఒక రూపంలో బాదుడు మొదలవుతుంది. చేయాల్సింది చెయ్యరు. ఇవ్వాల్సింది ఇవ్వరు. అప్పు తెచ్చిన డబ్బులు పంచి పెట్టడం మాత్రమే! అసలు విషయం ఏమిటంటే... ‘మేం ఏమీ చెయ్యం. మీరే చేసుకోండి’ అని ప్రభుత్వమే పరోక్షంగా చెబుతోంది.
(అమరావతి - ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్ ‘బటన్’ నొక్కుతున్నారా? లేక... జనాలా బతుకులను నొక్కుతున్నారా? వైసీపీ సర్కారు మూడేళ్లుగా అనుసరిస్తున్న ‘స్కీమ్’ను లోతుగా పరిశీలిస్తే... ఈ సందేహం రాకమానదు. ‘వాహన మిత్ర’ కింద బటన్ నొక్కుతారు. కానీ... అడుగడుగునా గుంతలతో బండి కుదేలైపోయి, రిపేర్లకు అయ్యే ఖర్చే ఎక్కువ. ‘అమ్మ ఒడి’ కింద బటన్ నొక్కుతారు. ‘నాన్న బుడ్డీ’ కింద డబ్బులు లాగేస్తారు. బటన్ నొక్కిన సౌండ్ కంటే చెత్తపన్ను, పెట్రోల్ సెస్, విద్యుత్ షాక్, ఆస్తి పన్ను పెంపు, అధిక ధరల... ఇలా వరుస బాదుళ్లతో జనం పెట్టే ఆర్తనాదాల రీసౌండే ఎక్కువగా ఉంది. మూడేళ్లుగా చేసిన అభివృద్ధేమీ లేదు. కానీ, అప్పులు తెస్తూనే ఉన్నారు. కోసి కోసి గీసి గీసి సంక్షేమం ఇస్తుంది కొందరికే. కానీ, ప్రజలందరినీ బాదేసి వేలాది కోట్లు లాగేసుకుంటున్నారు. వాస్తవానికి ఇదే బడ్జెట్‌తో గత ప్రభుత్వాలు కూడా సంక్షేమానికి ఖర్చుపెట్టాయి. అచ్చంగా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పథకాలు ఒకటి రెండే! మిగిలినవన్నీ గతంలో వేర్వేరు పేర్లతో, వేరే రూపంలో అమలైనవే. కానీ, ఇంతటి సంక్షోభం అప్పుడు లేదు. బతుకులు ఇప్పటిలా క్షోభకు గురికాలేదు! జగన్ సర్కారు కేంద్రాన్ని వంచించి, కాగ్‌ను ఏమార్చి అప్పులరూపంలో వేల కోట్లు తెస్తోంది. అదనపు బాదుళ్ల రూపంలో మరికొన్ని వందల కోట్లు ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఈ నిధులన్నీ ఎటు పోతున్నాయి? ఆదాయం, అప్పులు, అదనపు బాదుళ్ల లెక్కలు ఏజీ కార్యాలయానికే అంతుబట్టని పరిస్థితి! పోనీ, ఇవన్నీ సంక్షేమ పథకాలకు పోతున్నాయా అంటే, ఒకటి, రెండు తప్ప జగన్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పథకాలు లేవు. దీంతో గుప్పెడు చేతిలో పెట్టి... బస్తా బియ్యం తీసుకెళ్లినట్టుగా పరిస్థితి తయారైంది. బటన్ నొక్కడం ద్వారా లబ్ధి అందేది కొందరికే. కానీ, ఆ బరువును మాత్రం రాష్ట్ర ప్రజానీకమంతా మోయాల్సి వస్తోంది.
రిపేర్లు మనమే చేసుకోవాలి...
రోడ్లు వేస్తామంటూ జగన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ప్రతీ లీటర్ కొనుగోలుపై చెరో రూపాయి అదనంగా వసూలు చేస్తోంది. ప్రజల దగ్గర నుంచి ఇలా వసూలైన సెస్ మొత్తం దాదాపు ఏడాదికి రూ.800 కోట్ల వరకు ఉంటోంది. అలాగే, రోడ్లు వేయడం కోసమని చెప్పి రోడ్లు భవనాల శాఖ గెస్ట్ హౌజ్‌లు, ఖాళీ స్థలాలు, ఇతర నిర్మాణాలు, ఆస్తులను రోడ్లు డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌కి రాసిచ్చి అక్కడ నుంచి వాటిని బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి దాదాపు రూ.7,000 కోట్ల అప్పులు తెచ్చారు. అలాగే, రోడ్ల కోసమేనంటూ చెత్త పన్ను కూడా వసూలు చేస్తున్నారు. కానీ, ఈ డబ్బులతో రోడ్లు వేయడం కాదుకదా గుంతలు కూడా పూడ్చడం లేదు. గుంతల రోడ్లపై తిరగలేక ఆర్టీసీ బస్సులు తరచూ రిపేర్లకు గురవుతున్నాయి. అందువల్లే ప్రభుత్వానికి అద్దెకు బస్సులు ఇవ్వడానికి టెండర్‌దారులు భయపడిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉండే జాతీయ రహదారుల్లో తిరగడానికి మాత్రమే అద్దెకు బస్సులు ఇస్తామని తేల్చిచెబుతున్నారు. రాష్ట్ర రోడ్లపై తిరిగేందుకు మాత్రం ఇచ్చేది లేదని ముఖం మీదే చెప్పేస్తున్నారు. దీంతో మూలనపడ్డ ఆర్టీసీ బస్సులే ఆర్టీసీ యాజమాన్యానికి దిక్కు అవుతున్నాయి. వాటికి రిపేర్ చేయించి నడపాలని నిర్ణయించారు. అయితే, ఆ రిపేరు ఖర్చులను ఆర్టీసీ చార్జీల రూపంలో జనాల జేబుల నుంచే గుంజుకుంటుండటం గమనార్హం. అంటే బస్సు రీపేర్లకు కూడా మన జేబులోంచే ఖర్చు పెడుతున్నారన్న మాట! పైగా దాదాపు ఏడాది నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో భారీ పెరుగుదల లేదు. కానీ, రాష్ట్రంలో మాత్రం ఆర్టీసీ చార్జీలు పెంచుతూనే ఉన్నారు. అంటే ప్రజలు తాము ఎక్కి తిరుగుతున్న ఆర్టీసీ బస్సుల రిపేర్ ఖర్చు కూడా భరిస్తూ జేబు గుల్ల చేసుకుంటున్నారు. ప్రభుత్వమే చార్జీలు పెంచడంతో ప్రైవేటు వాహనాల్లో కూడా చార్జీల ధరలు రెండింతలు పెరిగాయి. అందుకే నిత్యావసరాల ధరలు సామాన్యప్రజలకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి.
ఉచిత విద్యుత్ ఖర్చూ జనాలదే..
వ్యవసాయానికి, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో కొంత మేర సబ్సిడీకి విద్యుత్ ఇస్తున్నామని జగన్ ప్రభుత్వం కలరింగ్ ఇస్తోంది. కానీ, అందుకయ్యే ఖర్చులను కూడా ప్రజల నుంచే వసూలు చేస్తోంది. ట్రూఅప్ చార్జీల పేరుతో కరెంటు బిల్లుల మోత మోగిస్తోంది. రాష్ట్రంలో గతంతో పోల్చితే ఒ క్కో కుటుంబం సగటున ఏడాదికి రూ.10,000 అదనంగా కరెంటు బిల్లులు చెల్లిస్తోందనేది ఒక అంచనా. మునుపెన్నడూ లేనివిధంగా ఇప్పుడే ఇంత కరెంటు బిల్లుల భారం ఎందుకు? జగన్ సర్కార్ స్థిరంగా తమ పని తాము చేసుకుంటున్న అన్ని వ్యవస్థలను అవగాహన లేమితో అస్తవ్యస్తం చేయడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ప్రధాన వినియోగదారు ప్రభుత్వమే. వ్యవసాయ రంగానికి ఉచితంగా కరెంటు ఇవ్వడం కోసం ఆ సంస్థల నుంచి కరెంటు కొనాలి. డబ్బులు కట్టాలి.
కానీ, ప్రభుత్వం కరెంటు తీసుకుంటోంది కానీ, డబ్బులు చెల్లించడం లేదు. ప్రభుత్వం కరెంటు ఉత్పత్తి సంస్థలకే రూ.7000 కోట్ల నుంచి రూ.8,000 కోట్లు బాకీ పడింది. ఈ మొత్తాన్ని ఆ సంస్థలు భరించలేవు కాబట్టి కరెంటు వైర్లు, కరెంటు స్తంభాలతో సహా ఇతర ఆస్తులను బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల వద్ద తాకట్టు పెట్టి వేల కోట్ల అప్పులు తెస్తోంది. కానీ, ఆ అప్పులకు అసలు, వడ్డీ కట్టే సామర్థ్యం కూడా ఆ సంస్థలకు లేదు. కాబట్టి ట్రూఅప్ చార్జీల పేరుతో కరెంటు బిల్లులు భారీగా పెంచి జనాల మెడలు వంచి వసూలు చేసి ఆ అప్పుల అసలు, వడ్డీలు చెల్లిస్తోంది. జగన్ ప్రభుత్వం తాను తీసుకున్న కరెంటుకు డబ్బులు కడితే విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు అంత భారీ అప్పులు చేయాల్సిన అవసరం ఏముంటుంది! అప్పులే లేనప్పుడు వాటిని కట్టడం కోసం ప్రజలపై కరెంటు బిల్లుల భారం పడేది కాదు. ఈ రకంగా చూేస్త వ్యవసాయానికి ఉచిత కరెంటు తమ గొప్ప అని సీఎం జగన్ గప్పాలు కొట్టుకుంటున్నప్పటికీ వాస్తవానికి అధిక కరెంటు బిల్లుల రూపంలో ఆ భారం భరిస్తోంది మనమే.
వ్యవసాయమూ భారమే..
రాష్ట్రంలో గిట్టుబాటు ధరల్లేక వ్యవసాయం భారమైంది. రైతులే స్వయంగా క్రాప్‌హాలిడే ప్రకటించుకునే దుర్భర స్థితి నెలకొంది. ముఖ్యంగా రవాణా చార్జీలు రెండింతలు పెరగడం ఈ రంగానికి శాపంగా మారింది. వ్యవసాయానికి ఉపయోగించే ప్రతీ వస్తువు ధర విపరీతంగా పెరగడం, పెరుగుతున్న నిత్యావసరాలు, ఇతర ధరల కారణంగా కూలి బాగా పెంచాల్సి రావడంతో మెజారిటీ వ్యవసాయదారులు లాభాల కంటే కూడా నష్టాలే చవిచూస్తున్నారు. వ్యవసాయరంగానికి తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలూ లేవు. దీంతో రైతులే స్వచ్ఛందంగా వ్యవసాయానికి దూరంగా (కాప్ హాలిడే) ఉంటున్నారు. గతంలో సొంత భూమితోపాటు కౌలు భూమి కూడా సాగుచేేస రైతులు ఇప్పుడు వ్యవసాయ ఖర్చులు పెరిగిన స్థాయిలో పంట ధర పెరగడం లేదంటూ నష్టానికి వ్యవసాయం చేయలేమంటూ దూరంగా ఉంటున్నారు. ఇక పరిశ్రమల రంగానికొేస్త ఈ మూడేళ్లలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన సంస్థలే తప్ప కొత్తగా వచ్చిన సంస్థలేమీ లేవు. ఉన్నవాటిలో చిన్నాచితక పరిశ్రమలు సైతం ఈ కరెంటు బిల్లులు, రవాణా చార్జీల దెబ్బకు మూతపడ్డాయి. మిగిలిన పరిశ్రమలు స్థానిక నాయకత్వానికి భయపడుతూ బిక్కుబిక్కుమంటూ అంతంతమాత్రంగా నడుస్తున్నాయి.