mystery skeleton case: ‘అస్థిపంజరం’ కేసులో వీడిన మిస్టరీ!

ABN , First Publish Date - 2022-12-07T03:37:58+05:30 IST

నగర పరిధిలోని కొమ్మాది వికలాంగుల కాలనీలో వెలుగుచూసిన యువతి అస్థి పంజరం కేసును పోలీసులు ఛేదించారు. ఆ ఇంట్లో అద్దెకు దిగిన శ్రీకాకుళం జిల్లా సీతంపేట సమీపంలోని కొత్తూరుకు చెందిన దండు రిషివర్ధన్‌ అలియాస్‌ రిషి (28)ని హంతకుడిగా గుర్తించారు.

mystery skeleton case: ‘అస్థిపంజరం’ కేసులో వీడిన మిస్టరీ!

హంతకుడు ఆ ఇంట్లో అద్దెకున్న యువకుడే

యువతితో వివాహేతర సంబంధం

రెండువేలు అడగడంతో గొడవ

చున్నీ మెడకు బిగించి హత్య

మృతదేహాన్ని బ్యాగులో కుక్కి.. ప్లాస్టిక్‌ డ్రమ్ములో పడేసి చెన్నై పరారీ

విశాఖపట్నం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): నగర పరిధిలోని కొమ్మాది వికలాంగుల కాలనీలో వెలుగుచూసిన యువతి అస్థి పంజరం కేసును పోలీసులు ఛేదించారు. ఆ ఇంట్లో అద్దెకు దిగిన శ్రీకాకుళం జిల్లా సీతంపేట సమీపంలోని కొత్తూరుకు చెందిన దండు రిషివర్ధన్‌ అలియాస్‌ రిషి (28)ని హంతకుడిగా గుర్తించారు. హతురాలు శ్రీకాకుళం మొండెటి వీధికి చెందిన బమ్మిడి ధనలక్ష్మి(26)గా భావిస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో డబ్బుల విషయమై తలెత్తిన వివాదమే హత్యకు దారితీసినట్టు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని ఆరెస్టు చేశారు. ఆ వివరాలను పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌ మంగళవారం వెల్లడించారు. కొమ్మాదికి చెందిన నండూరి రమేష్‌ (45)కు ఎండాడలో వెల్డింగ్‌ దుకాణం ఉంది. రిషి (28) అతడి వద్ద రెండేళ్ల క్రితం పనిలో చేరాడు. తర్వాత వికలాంగుల కాలనీలో ఉన్న రమే్‌షకు చెందిన రేకుల షెడ్డులో రిషి తన భార్యతో కలిసి అద్దెకు దిగాడు. భార్య ప్రసవం కోసం 2021 జనవరిలో పుట్టింటికి వెళ్లగా రిషి కూడా వెల్డింగ్‌ పనికి వెళ్లడం మానేశాడు. నెలలు గడుస్తున్నా ఇల్లు ఖాళీ చేయకపోవడంతో.. ఇల్లు ఖాళీ చేయించాలని రమేశ్‌ నిర్ణయించాడ. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో ప్లాస్టిక్‌ డ్రమ్ములో మహిళ అస్థి పంజరం కనిపించింది. దీంతో రమేష్‌ పీఎం పాలెం పోలీసులకు సమాచారం అందించారు. రిషిపై అనుమానం వ్యక్తంచేయడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు.

ఆటోలో పరిచయం..

రిషి గతేడాది మే 29న విశాఖ వచ్చేందుకు శ్రీకాకుళం బస్టాండ్‌లో వేచివుండగా... మొండెటి వీధికి చెందిన బమ్మిడి ధనలక్ష్మి (26) పరిచయమైంది. ఫోన్‌ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. మరుసటిరోజు (మే 30న) ఆమె విశాఖ వస్తున్నానని చెప్పడంతో రాత్రికి తన ఇంటికి తీసుకువెళ్లాడు. తెల్లవారిన తర్వాత ఆమె తనకు రూ.2 వేలు అడిగింది. రిషి తనవద్ద లేవని చెప్పడంతో... ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రిషి ఆమెను చెంపపై కొట్టి మెడకు చున్నీ బిగించి హత్యచేశాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని జిప్‌సూట్‌లో కుక్కి, ప్లాస్టిక్‌ డ్రమ్ములో పడేశాడు. దుర్వాసన రాకుండా పైకప్పు వేసి టేపు చుట్టాడు. అనంతరం చెన్నై పరారయ్యాడు. తిరిగి ఆరు నెలల కిందట రిషి తిరిగి విశాఖ వచ్చి కొమ్మాదిలోని చైతన్య టెక్నో స్కూల్‌లో కుక్‌గా చేరాడు. విషయం బయటపడడంతో పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2022-12-07T03:38:00+05:30 IST