NO Pension: అవ్వాతాతలకు... మోసం 6,300 కోట్లు
ABN , First Publish Date - 2022-12-16T02:16:35+05:30 IST
మాట తప్పం.. మడమ తిప్పం’.. ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ చెప్పే మాట ఇది. అయితే ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన పలు హామీలపై మాటా తప్పారు.. మడమా తిప్పారు. చివరకు అవ్వాతాతల పెన్షన్ విషయంలోనూ మాట నిలబెట్టుకోలేదు.
పింఛన్‌పై ‘మాట’ నిలబెట్టుకోని జగన్ సర్కారు
పెంపు ఆలస్యంతో ఒక్కొక్కరికి రూ.10,500 నష్టం
దాదాపు 60 లక్షల మందిపై ప్రభావం
ఎన్నికల హామీ ‘రూ.3 వేలు’పై మడత
ఏటా 250 పెంచుతామని మెలిక
ఆ హామీని కూడా నిలబెట్టుకోని వైనం
ఈ ఏడాది జూలై నాటికే 3 వేలు కావాలి
వితంతువులు, ఇతర పెన్షన్‌దారులకూ తాజా పెంపుతో 2,750 మాత్రమే
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘మాట తప్పం.. మడమ తిప్పం’.. ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ చెప్పే మాట ఇది. అయితే ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన పలు హామీలపై మాటా తప్పారు.. మడమా తిప్పారు. చివరకు అవ్వాతాతల పెన్షన్ విషయంలోనూ మాట నిలబెట్టుకోలేదు. మాట ఇచ్చి రెండు సార్లు తప్పారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీ ప్రకారం 2019 నుంచి పింఛన్ రూ.3 వేలు ఇవ్వాలి. ఇచ్చినట్టయితే పెన్షన్‌దారులకు ఒక్కొక్కరికి ఈ ఐదేళ్లలో అదనంగా రూ.60 వేలు లబ్ధి కలిగేది. అయితే, అధికారంలోకి వచ్చాక ఏటా రూ.250 పెంచుతామని మాట మార్చారు. మొదటిసారి 2019 జూలై 8న పెన్షన్లను రూ.2,250కు పెంచారు. ఆ తర్వాత ఏటా రూ.250 చొప్పున పెంచుతూ 2022 జూలై నాటికి రూ.3 వేలు చేస్తామని చెప్పారు. అయితే చెప్పిన సమయానికి ఎప్పుడూ పెన్షన్ పెంచలేదు. 2020 జూలై నుంచి 2,500, 2021 జూలై నుంచి 2,750, 2022 జూలై నుంచి 3,000 చొప్పున పెన్షన్ ఇవ్వాల్సి ఉండగా... ఈ ఏడాది జనవరిలో 250, తాజాగా 250 చొప్పున పెంచారు. ప్రస్తుతం పెన్షన్ 2,750కు పెరిగింది. దీంతో పెన్షన్‌దారులు ఒక్కొక్కరు ఇప్పటి వరకు రూ.10,500 నష్టపోయారు. వ్యద్ధాప్య, వితంతువులతో పాటు పలు రకాల పెన్షన్‌దారులు మొత్తం 60 లక్షల మందికి పైగా దాదాపు 6,300 కోట్లు నష్టపోయారు.
సకాలంలో ఇవ్వకుండా సంబరాలా?
సామాజిక పెన్షన్‌దారులకు జగన్ సర్కారు సకాలంలో పెన్షన్లు పెంచడం లేదు. ఆలస్యంగా పెంచినా... ప్రతిసారీ సంబరాలకు మాత్రం కొదవ లేదు. రూ.కోట్లు కుమ్మరించి ప్రకటనలు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. 2019 జూలై 8న వైఎస్ జయంతి సందర్భంగా పెన్షన్‌ను రూ.250 పెంచుతూ సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత 2020 జూలై, 2021 జూలైలో పెన్షన్ మొత్తాన్ని పెంచాల్సి ఉన్నా పట్టించుకోలేదు. ఈ ఏడాది జనవరిలో రూ.2,500కు పెన్షన్ పెంచిన నేపఽథ్యంలో ఐదు రోజులు పండుగలా సంబరాలు చేసుకున్నారు. కొత్త పథకం అయినట్టు ముఖ్యమంత్రి జగన్ గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో లాంఛనంగా ప్రారంభించగా... అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజాప్రతినిధులు హడావుడి చేశారు. తాజాగా మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పెన్షన్లను వచ్చే జనవరి నుంచి రూ.2,750కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి నుంచి పెన్షన్‌దారులకు ఇవ్వనున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జూలై నుంచే రూ.3 వేలు పెన్షన్ ఇవ్వాల్సి ఉంది. అయితే అవ్వాతాతలకు సకాలంలో పెన్షన్ పెంచకుండా, ప్రకటనలు, సంబరాల పేరుతో ప్రభుత్వ సొమ్ము దుబారా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
‘అధికారంలోకి వస్తే అవ్వాతాతలకు ఒక్కొక్కరికి రూ.3 వేలు పింఛన్ ఇస్తాం’... ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీ ఇది. అంటే.. గత ప్రభుత్వంలో ఇస్తున్న రూ.2 వేలు పింఛన్‌ను రూ.3 వేలుకు పెంచుతారని భావించారు. అయితే అధికారంలోకి వచ్చాక నాలుక మడతేశారు. ఏటా ‘రూ.250’ పెంపు అంటూ మెలిక పెట్టారు.
2019 జూలైలో పింఛన్‌ను రూ.2,250కు పెంచారు. రెండోసారి చెప్పిన మాట ప్రకారం చూసినా... 2020, 2021, 2022 జూలై నెలల్లో రూ.250 చొప్పున పెంచాలి. ఈపాటికి ఎప్పుడో రూ.3 వేలు కావాలి. అయితే ఈ మాట కూడా నిలబెట్టుకోలేదు. ఆలస్యం చేస్తూ రావడంతో ప్రస్తుతం 2,750కు పెరిగింది. ఈ లెక్కన ఇప్పటి వరకు ఒక్కొక్కరికి రూ.10,500 చొప్పున దాదాపు 60 లక్షల మంది లబ్ధిదారులకు జగన్ సర్కారు దాదాపు 6,300 కోట్లు ఎగ్గొట్టింది.
పెన్షన్‌దారులకు నష్టం ఇలా...
ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం... పెన్షన్‌దారులకు 2020 జూలై నుంచి 2021 జూలై దాకా ప్రతినెలా రూ.2,500 చొప్పున ఇవ్వాలి. అయితే రూ.2,250 మాత్రమే ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఒక్కో పెన్షన్‌దారుడు రూ.3 వేలు నష్టపోయారు.
2021 జూలై నుంచి 2022 జూలై వరకూ పెన్షన్ రూ.2,750 ఇవ్వాల్సి ఉంది. 2021 డిసెంబరు దాకా కేవలం రూ.2,250 కొనసాగించారు. దీనిప్రకారం ఆరు నెలలకు ఒక్కొక్కరు నెలకు రూ.500 చొప్పున మరో రూ.3 వేలు నష్టపోయారు. 2022 జనవరి నుంచి పెన్షన్‌ను రూ.2,500 చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు ఆర్నెల్లకు నెలకు రూ.250 చొప్పున మరో రూ.1500 నష్టపోయారు.
ఈ ఏడాది జూలై నుంచి పెన్షన్ రూ.3 వేలు ఇవ్వాల్సి ఉంది. అయితే జూలై నుంచి డిసెంబరు దాకా రూ.2,500 మాత్రమే ఇచ్చారు. అంటే... నెలకు 500 చొప్పున ఆర్నెల్లలో మరో రూ.3 వేలు నష్టపోయారు. ఈ లెక్కన ఇప్పటి వరకు ఒక్కో లబ్ధిదారుడు రూ.10,500 నష్టపోయారు.
వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులతో పాటు పలు రకాల పెన్షన్‌దారులు సుమారు 60 లక్షల మం దికి పైగా ఉన్నారు. ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోవడంతో దాదాపు 6,300 కోట్లు నష్టపోయారు.