ప్రభుత్వం తప్పించుకోలేదు

ABN , First Publish Date - 2022-03-16T08:47:46+05:30 IST

జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలు రెండోరోజు కూడా శాసనమండలిని మండించాయి. ఈ మరణాలపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ

ప్రభుత్వం తప్పించుకోలేదు

సీఎం మండలికి వచ్చి వివరణ ఇవ్వాలి

కల్తీ సారా మరణాలపై రెండోరోజూ టీడీపీ నిరసన


అమరావతి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలు రెండోరోజు కూడా శాసనమండలిని మండించాయి. ఈ మరణాలపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరగాల్సిందేనంటూ టీడీపీ సభ్యులు సభ ప్రారంభం కాగానే గట్టిగా పట్టుబట్టారు. ‘‘కల్తీ సారా మరణాలను సీఎం జగన్‌ సహజ మరణాలని ఎలా చెబుతారు? అది సహజమే అయితే ప్రభుత్వం ఎందుకు చర్చకు రావడంలేదు’’ అని నిలదీశారు. అయితే..వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు చైర్మన్‌ మోషేన్‌రాజు ప్రకటించారు. ఆ వెంటనే లోకేశ్‌ సహా టీడీపీ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ... నినాదాలతో హోరెత్తించారు. చైర్మన్‌ పోడియంపైకి వెళ్లి టీడీపీ సభ్యులు తమ నిరసనను తెలిపారు. దాదాపు సభ జరిగినంతసేపూ టీడీపీ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేస్తూ చర్చపై పట్టుబట్టారు. ఠీఠీఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో రెండుసార్లు సభ వాయిదాపడింది. మరణాలపై సర్కారు ప్రకటన, వివరణ టీడీపీ సభ్యులకు అవసరంలేదని... వారికి గొడవ చేయడమే ముఖ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఈ వ్యాఖ్యలను ఖండించారు.


‘‘అసెంబ్లీలో సీఎం ఒక రకంగా, మంత్రి ఒక రకంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. కల్తీ సారా మరణాలను సీఎం సహజ మరణాలని ఎలా చెబుతారు? సీఎం మండలికి వచ్చి వివరణ ఇవ్వాలి. చర్చ నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదు’’ అని యనమల డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చేసే ప్రకటన విని..ఆ తర్వాత మాట్లాడాలని చైర్మన్‌ సూచించారు. అయితే..అవి సహజ మరణాలని సీఎం చెప్పిన తర్వాత మంత్రి చేసే ప్రకటనకు విలువ ఏముంటుందని టీడీపీ సభ్యులు నిరసించారు. కొన్ని పత్రికలు సీఎం ప్రకటనను వక్రీకరించాయని మంత్రి కన్నబాబు అన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఒక వంక పెట్టుకుని సభను బాయ్‌కాట్‌ చేసి.. బాధితుల పరామర్శపేరుతో ర్యాలీలాగా జంగారెడ్డిగూడెం వెళ్లి రాజకీయ యాత్ర, రాజకీయ పరామర్శలు చేస్తున్నారని  విమర్శించారు. ‘మరి మీ నాయకుడు రెండేళ్లు సభను ఏ కారణంతో బాయ్‌కాట్‌ చేశార’ని కన్నబాబును యనమల నిలదీశారు. ఈ సమయంలో మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ‘‘శాసనసభలో నేను చెప్పిన దానికి, సీఎం అన్న దానికి మధ్య ఏ తేడా లేదు. దీనిపై వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని వెల్లడించారు. అయితే.. మంత్రి ప్రకటనతో సంతృప్తి చెందని టీడీపీ సభ్యులు చర్చకు మరోసారి పట్టుబట్టారు. ఈ గందరగోళం మధ్య సభను చైర్మన్‌ బుధవారానికి వాయిదా వేశారు. 

Updated Date - 2022-03-16T08:47:46+05:30 IST