భవిష్యత్తు మహిళలదే!

ABN , First Publish Date - 2022-12-31T03:39:35+05:30 IST

అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పురుషులతో సమానంగా మహిళలు న్యాయవ్యవస్థలోకి ప్రవేశించడమే కాకుండా క్రమంగా వారిని అధిగమిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

భవిష్యత్తు మహిళలదే!

కోర్టుల్లో క్రమంగా పురుషులనూ అధిగమిస్తున్నారు: సీజేఐ

కానీ, జిల్లా కోర్టుల్లో వారికి టాయిలెట్స్‌ కూడా లేవు

మహిళలను దృష్టిలో ఉంచుకుని వసతులు పెంచాలి

న్యాయవ్యవస్థ నవీకరణలో డిజిటలైజేషన్‌ కీలకం

యాంత్రికంగా బెయిళ్లు తిరస్కరించకూడదు

జీవితం తెలిస్తేనే సరైన తీర్పులను ఇవ్వగలం

కేసుల విచారణ జాప్యానికి చాలా కారణాలు

కొన్నిసార్లు కోర్టుల నియంత్రణలోనూ ఉండవు

ఈ విషయాలను సమాజానికి వివరించాలి

సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఉద్ఘాటన

మంగళగిరిలో జ్యుడీషియల్‌ అకాడమీ ప్రారంభం

‘‘విచారణలు జాప్యం కావడానికి న్యాయమూర్తులే కారణమనే భావన సమాజంలో ఉంది. అయితే, కోర్టుల నియంత్రణలో లేని అనేక అంశాలు కూడా జాప్యానికి కారణమని వివరించాల్సిన అవసరం ఉంది. రికార్డులు అందుబాటులో లేకపోవడంవల్ల న్యాయస్థానాల్లో 14లక్షల కేసులు, న్యాయవాదులు అందుబాటులో లేకపోవడంవల్ల మరో 64 లక్షల కేసుల విచారణలో జాప్యం జరుగుతోంది.’’ - చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌

‘‘న్యాయాన్ని అందించే విషయంలో న్యాయాధికారులు, న్యాయమూర్తులు తీవ్రఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో తీర్పులు వెల్లడి విషయంలో మానసిక స్థిరత్వం అవసరం. న్యాయమూర్తులుగా మన వ్యక్తిగత పరిమితులు అర్థం చేసుకున్నప్పుడే నిష్పాక్షిక తీర్పులు వెల్లడించగలుగుతాం’’

‘‘జీవితం అర్థం కాకుండా సరైన నిర్ణయం వెల్లడించలేం. న్యాయమూర్తులుగా మనకు అనేక పరిమితులు ఉంటాయి. వృత్తిరీత్యా సమాజంలో అందరితో కలవలేకపోయినా, మన చుట్టూ ఏమి జరుగుతున్నదో అవగాహన కలిగి ఉండాలి. సమాజాన్ని సరైన విధానంలో అర్థం చేసుకున్నప్పుడే న్యాయమూర్తులుగా మనం ఎలా వ్యవహారించాలో తెలుసుకోగలుగుతాం’’

‘‘న్యాయమూర్తులు, న్యాయవాదులు ధరించే తెలుపు, నలుపు దుస్తులు వైరుధ్యానికి సూచికలు. న్యాయస్థానాల్లో వాద ప్రతివాదనలు న్యాయానికి- అన్యాయానికి, నిజానికి- అబద్ధానికి మధ్య మాత్రమే జరగవు. చాలా సందర్భలో ఈ సంఘర్షణ నిజానికి- నిజానికి, తప్పునకు- పెద్ద తప్పునకు మధ్య కూడా జరుగుతుంది. ఈ పరస్పర విరుద్ధమైన పరిస్థితులను సమతూకం చేసుకొని న్యాయాధికారులు తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది’’

- చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌

అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పురుషులతో సమానంగా మహిళలు న్యాయవ్యవస్థలోకి ప్రవేశించడమే కాకుండా క్రమంగా వారిని అధిగమిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థలో భవిష్యత్తు మహిళలదేనని తాను బలంగా నమ్ముతున్నానన్నారు. న్యాయవ్యవస్థను ఆధునికీకరించడంలో రికార్డుల డిజిటిలైజేషన్‌ కీలక అడుగు అని పేర్కొన్నారు. న్యాయాధికారుల శిక్షణ నిమిత్తం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఏర్పాటుచేసిన ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీని జస్టిస్‌ చంద్రచూడ్‌ శుక్రవారం ప్రారంభించారు. అకాడమీలోని తరగతి గదులు, కాన్ఫరెన్స్‌ హాల్‌, మీటింగ్‌ హాల్‌, రెస్టు రూంలను సందర్శించారు. అనంతరం నాగార్జున యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని, ఆన్‌లైన్‌ ద్వారా హైకోర్టు రికార్డుల డిజిటలైజేషన్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఆన్‌లైన్‌ సర్టిఫైడ్‌ కాపీల జారీ కోసం సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌, న్యూట్రల్‌ సైటేషన్‌ ప్రారంభించారు. హైకోర్టుకు సంబంధించిన మెదటి వార్షిక నివేదికను విడుదల చేశారు. న్యాయవాద వృత్తిలోకి మహిళలు రావడం పెరిగిన దరిమిలా కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జస్టిస్‌ చంద్రచూడ్‌ సూచించారు. స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు గడచినా జిల్లా కోర్టుల్లో మహిళా కక్షిదారులకు, న్యాయమూర్తులు, న్యాయవాదులకు కనీసం టాయిలెట్స్‌ లేవని గుర్తు చేశారు. ‘‘డిజిటలైజేషన్‌ను కేవలం పాత రికార్డులకే పరిమితం చేయకుండా, కొత్తగా నమోదయ్యే కేసులకు కూడా ఈ-ఫైలింగ్‌ విధానాన్ని అమలు చేయాలి. దీనికోసం న్యాయవాదులు, గుమస్తాలు, కోర్టు సిబ్బంది సహకారం అవసరం. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ప్రారంభంలో కొంత ఇబ్బందులు ఎదురైనా, అదే భవిష్యత్తు అనే విషయం అందరూ గుర్తించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు కోర్టు విచారణలలో సాంకేతికత పరిజ్ఞాన్ని వినియోగిస్తే అది యువ న్యాయవాదులకు మార్గదర్శకం అవుతుంది’’ అని తెలిపారు. న్యూట్రల్‌ సైటేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టినందుకు ఏపీ హైకోర్టును అభినందిస్తున్నానని, దీని వల్ల ప్రైవేటు పబ్లిషర్లు తీర్పులు ప్రచురించే వరకు వేచిచూడకుండా దేశవాప్తంగా యువన్యాయవాదులకు ఖర్చులేకుండా తీర్పులను అధ్యయనం చేసే అవకాశం దొరుకుతుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కూడా ఈవిధానాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నామని జస్టిస్‌ చంద్రచూడ్‌ వెల్లడించారు. ‘‘న్యాయాన్ని అందించే విషయంలో న్యాయాధికారులు, న్యాయమూర్తులు తీవ్రఒత్తిడిని ఎదుర్కొంటారు. అనేక సంఘర్షణల మధ్య పనిచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తీర్పులు వెల్లడి విషయంలో మానసిక స్థిరత్వం అవసరం. న్యాయమూర్తులుగా మన వ్యక్తిగత పరిమితులు అర్థం చేసుకున్నప్పుడే నిష్పాక్షిక తీర్పులు వెల్లడించగలుగుతాం. యువ న్యాయమూర్తులు విభిన్నమైన పరిస్థితులు ఎదుర్కొనేలా జ్యుడీషియల్‌ అకాడమీ శిక్షణ ఇవ్వాలి’’ అని ఆయన కోరారు.

కక్షిదారులకు ఉపశమనం అందించాలి

అకారణంగా వ్యక్తులను జైలులో ఉంచడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. ‘‘బెయిల్‌ మంజూరు విషయంలో కింది కోర్టులు భయపడుతున్నాయి. యాంత్రికంగా ఆ పిటిషన్లను తిరస్కరిస్తున్నాయి. కింది కోర్టులు బెయిల్‌ ఇవ్వడాన్ని హైకోర్టులు తప్పుబడుతుండటమే ఈ భయాలకు కారణం. కింది కోర్టులు విధించే శిక్షల విధింపు రేటును (హైకోర్టు) జడ్జీలు వాటి పనితీరుకు ప్రామాణికంగా చూస్తున్నారు. అటువంటి పద్ధతులను పక్కనపెట్టాలని ఇటీవల జరిగిన హైకోర్టు సీజేల సమావేశంలో స్పష్టంచేశాం. జిల్లా కోర్టులను తక్కువస్థాయి కోర్టులుగా పరిగణించే వలసవాద విధానాన్ని విడిచిపెట్టాలి. జిల్లా కోర్టులు న్యాయవ్యవస్థకు వెన్నుముక లాంటివి’’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ ఉద్బోధించారు.

ఏ నేపథ్యం వారమైనా రాజ్యాంగమే ప్రమాణం..

న్యాయమూర్తి అంటే చట్టనిబంధనలను అనుసరించి తీర్పులు వెల్లడించడం మాత్రమే కాదని, మానవజీవితాన్ని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమేనని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. ‘‘జీవితం అర్థం కాకుండా సరైన నిర్ణయం వెల్లడించలేం. న్యాయమూర్తులుగా మనకు అనేక పరిమితులు ఉంటా యి. సమాజాన్ని సరైన విధానంలో అర్థం చేసుకున్నప్పుడే న్యాయమూర్తులుగా మనం ఎలా వ్యవహారించాలో తెలుసుకోగలుగుతాం’’ అని స్పష్టం చేశారు. ఏపీ జ్యుడీషియల్‌ ఎడ్యుకేషన్‌ అంటే కేవలం సీఆర్పీసీ, సీపీసీపై జ్ఞానాన్ని సముపార్జించేదిగా ఉండకూడదని, అది న్యాయాధికారులకు విలువలను బోధించేదిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ‘‘న్యాయమూర్తులు, న్యాయవాదులు ధరించే తెలుపు, నలుపు దుస్తులు వైరుధ్యానికి సూచికలు. న్యాయస్థానాల్లో వాద ప్రతివాదనలు న్యాయానికి- అన్యాయానికి, నిజానికి- అబద్ధానికి మధ్య మాత్రమే జరగవు. చాలా సందర్భలో ఈ సంఘర్షణ నిజానికి- నిజానికి, తప్పునకు- పెద్ద తప్పునకు మధ్య కూడా జరుగుతుంది. ఈ పరస్పర విరుద్ధమైన పరిస్థితులను సమతూకం చేసుకొని న్యాయాధికారులు తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది’’ అని తెలిపారు. అనేక కులాలు, మతాలు, ప్రాంతాలు, విభిన్న భావజలాల నుంచి న్యాయవ్యవస్థలోకి వచ్చినప్పటికీ, రాజ్యాంగం నిర్వచించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, మనిషి ఆత్మగౌరవం వంటి విశ్వజనీన విలువలు కాపాడడం కోసం అందరం ఒక్కటిగా పనిచేస్తున్నామని చెప్పారు.

అనంతలో 1979నాటి కేసు పెండింగ్‌

ఏపీ జిల్లాలపై సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

నేషనల్‌ జ్యుడీషియల్‌ గ్రిడ్‌లో ఏపీకి సంబంధించిన కేసుల వివరాలను పరిశీలిస్తే గుంటూరు జిల్లాలో 22మార్చి 1980లో నమోదైన సివిల్‌ కేసు ఇప్పటికీ పెండింగ్‌లో ఉందని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. ‘‘అనంతపురం జిల్లా కల్యాణదుర్గం కోర్టులో 19 సెప్టెంబరు 1978లో నమోదైన అత్యంత పాత క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో 1972లో నమోదైన కేసు 2006లో న్యాయస్థానం ముందుకు వచ్చింది. దర్యాప్తు ఆలస్యం, ఇతర కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. అయితే డేటా గ్రిడ్‌ ద్వారా కేసులను ఈజీగా పరిష్కరించగలమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మీ సేవలకు నా మనఃపూర్వక ధన్యవాదాలు’ అంటూ తన ఉపన్యాసాన్ని తెలుగులో ముగించి అందరినీ ఆశ్చర్యపర్చారు. ఈ కార్యక్రమంలో జ్యుడీషియల్‌ అకాడమీ ప్యాట్రన్‌ ఇన్‌ చీఫ్‌, ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జ్యుడీషియల్‌ అకాడమీ ప్రెసిడెంట్‌ జస్టిస్‌ సి. ప్రవీణ్‌కుమార్‌, బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్లు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ యు. దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌లతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, న్యాయవిద్యార్ధులు పాల్గొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌మిశ్రా ప్రారంభ ఉపన్యాసం చేశారు. సీజేఐ చంద్రచూడ్‌ను దుశ్శాలువతో సత్కరించి వెంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేశారు.

Updated Date - 2022-12-31T03:55:01+05:30 IST