బీసీల సాధికారతకే తొలి సంతకం..!

ABN , First Publish Date - 2022-12-31T03:16:47+05:30 IST

కావలి, డిసెంబరు 30: ముఖ్యమంతి జగన్‌ బీసీల వ్యతిరేకి, బీసీల ద్రోహి అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. 26 మంది బీసీ నాయకులను పొట్టన పెట్టుకున్నారని.. 2,650

బీసీల సాధికారతకే తొలి సంతకం..!

జగన్‌ బీసీ ద్రోహి.. వారి పథకాలన్నీ రద్దుచేశాడు

కుర్చీలు, బెంచీలు లేని కార్పొరేషన్‌ పదవులిచ్చాడు

రిటర్న్‌ గిఫ్ట్‌ రోజులు దగ్గరపడ్డాయ్‌!.. టీడీపీ వెంటే బీసీలు.. వారి వెంటే టీడీపీ

బీసీల సదస్సులో చంద్రబాబు వ్యాఖ్యలు

కావలి, డిసెంబరు 30: ముఖ్యమంతి జగన్‌ బీసీల వ్యతిరేకి, బీసీల ద్రోహి అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. 26 మంది బీసీ నాయకులను పొట్టన పెట్టుకున్నారని.. 2,650 మందిపై అక్రమంగా కేసులు బనాయించారని ధ్వజమెత్తారు. ‘బీసీ నేతలైన కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు తదితరులపై కేసులు పెట్టి జైలుకు పంపి పైశాచిక ఆనందం పొందే వ్యక్తి జగన్‌’ అని విరుచుకుపడ్డారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు నెల్లూరు జిల్లా కావలి వచ్చిన ఆయన.. శుక్రవారం స్థానిక బందావనం కల్యాణమండపంలో బీసీలతో ముఖాముఖి చేపట్టారు. దానికి ముందు బీసీలపై జరిగిన దాడులకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను, పలు చేతివృత్తుల ఎగ్జిబిట్స్‌ను చంద్రబాబు తిలకించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోడూరు వెంకట్రావు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, ఏపీఐసీసీ మాజీ చైర్మన్‌ కృష్ణయ్య, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, నేతలు రామారావు, గురుమూర్తి, చెంచలబాబు యాదవ్‌, మాలేపాటి సుబ్బానాయుడు, టీడీపీ తూర్పు రాయలసీమ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 14 మంది బీసీ నేతలు.. తమ తమ సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ.. 140 బీసీ కులాలకు సంబంధించి 54 సాధికారత కమిటీలు వేసి.. వారి ద్వారా సమస్యలను తెలుసుకుని బీసీలకు న్యాయం జరిగేలా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టనున్నట్లు చెప్పారు. ‘టీడీపీ అధికారంలోకి రాగానే బీసీల సాధికారితకే తొలి సంతకం చేస్తా. రాష్ట్రంలో 140 బీసీ కులాలు ఉన్నాయి. వారంతా టీడీపీ వెన్నంటే ఉన్నారు. వారికి న్యాయం జరిగే వరకు వెన్నంటే ఉంటా. టీడీపీకి ముందు బీసీలు ఎలా ఉన్నారు.. టీడీపీ తర్వాత ఎలా ఉన్నారో అధ్యయనం చేసుకోవాలి. జగన్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వడానికి బీసీలు సిద్ధం’ అని తెలిపారు.

బీసీ కోటా తగ్గించారు..

టీడీపీ హయాంలో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్‌ను జగన్‌ 24 శాతానికి తగ్గించారు. మా హయాంలో బీసీలకు ఏం చేశామో.. మీరు ఏం చేశారో చర్చకు జగన్‌ సిద్ధమా? టీడీపీ హయాంలో చేతివృత్తుల పనివారి కోసం ఆదరణ పథకం ద్వారా 120 కులాలకు ఆధునిక పరికరాలు ఇచ్చాం. బీసీ సబ్‌ ప్లాన్‌ తెచ్చి రూ.37 వేల కోట్లు కేటాయించాం. జనాభా దామాషా ప్రకారం కార్పొరేషన్లు, ఫెడరేషన్లు పెట్టాం. మత్స్యకారులకు 217 జీవో తెచ్చి చెరువులపై హక్కులు కల్పించాం. చేనేత కార్మికులకు రూ.118 కోట్ల బకాయిలు రద్దు చేశాం. చేనేతలకు ఉపాధి కల్పించాం. జగన్‌ వచ్చాక వాటన్నిటికీ మంగళం పాడారు.

అప్పుడు లక్షలు.. ఇప్పుడు కోట్లు

దేశంలోని అందరి ముఖ్యమంత్రుల ఆస్తి రూ.317 కోట్లయితే.. జగన్‌ ఒక్కరి ఆస్తే రూ.373 కోట్లు. ఆయన తండ్రి రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎన్నికల అఫిడవిట్లో ఆస్తి రూ.లక్షల్లో చూపించారు. నేడు జగన్‌కు ఇన్ని రూ.కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?

Updated Date - 2022-12-31T03:16:48+05:30 IST