కాటేసిన కెరటం

ABN , First Publish Date - 2022-01-03T07:41:02+05:30 IST

కాటేసిన కెరటం

కాటేసిన కెరటం

విశాఖలో రాకాసి అల.. నలుగురు గల్లంతు

ఇద్దరి మృతి.. మరో ఇద్దరి కోసం గాలింపు

న్యూ ఇయర్‌ వేడుకల్లో విషాదం

ముగ్గురు యువకులది సికింద్రాబాద్‌ 

రైలు టికెట్లు దొరక్క ప్రయాణం వాయిదా

మృతుల్లో ఒకరు ఒడిశా యువతి


విశాఖపట్నం/సికింద్రాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి ఎనిమిది మంది స్నేహితులు విహారయాత్రకు విశాఖపట్నం వెళ్లారు. సంతోషంగా సంబరాలు జరుపుకొన్నారు. ఆదివారం తిరుగుప్రయాణం కావాలని భావించారు. అయితే.. విధి మరోలా మార్చింది. రైలు టికెట్లు దొరక్కపోవడంతో ఆగిపోవాల్సి వచ్చింది. మరో రోజు అక్కడే ఉండాల్సి రావడంతో విశాఖలోని ఆర్కేబీచ్‌కు వెళ్లారు. బీచ్‌లో సరదాగా గడుపుతున్నారు. అప్పటి వరకు సంతోషంగా సాగిపోతున్న విహారయాత్రలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. విరుచుకుపడిన రాకాసి అల ముగ్గురు స్నేహితులను లోపలికి లాక్కెల్లింది. ఈ హఠాత్పరిణామంతో మిగిలిన స్నేహితులు భయాందోళనకు గురయ్యారు. ఓ వైపు పెద్దఎత్తున అలలు దూసుకొస్తున్నాయి. సముద్రంలో గల్లంతైన స్నేహితులను ఎలా కాపాడాలో, ఏం చేయాలో దిక్కుతోచలేదు. కళ్ల ముందే ఓ యువకుడు మరణించాడు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఆర్కే బీచ్‌లోనే మరో ఘటనలో పెద్ద కెరటం ఓ యువతిని పొట్టనపెట్టుకుంది. నూతన సంవత్సరంలో ఇద్దరు మరణించడం, మరో ఇద్దరు గల్లంతు కావడంతో.. వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్‌ పరిధిలో రసూల్‌పురా ఇందిరమ్మనగర్‌కు చెందిన స్నేహితులు కోట శివకుమార్‌ (ప్రైవేటు ఉద్యోగి), రాసమొల్ల వినోద్‌ కుమార్‌ (డ్రైవర్‌), పంపరి మధు (ప్రైవేటు ఉద్యోగి), సందిరి కార్తీక్‌ (ఏసీ మెకానిక్‌), జేపీ సిద్ధు (ఇంటర్‌ విద్యార్థి), పవన్‌ (గోల్డ్‌ షాపులో వర్కర్‌), చెండి శివకుమార్‌ (పైవేటు ఉద్యోగి), అజీజ్‌ (బ్యాంకు ఉద్యోగి) డిసెంబరు 30న కాచిగూడ- విశాఖ ఎక్స్‌ప్రె్‌సలో బయల్దేరారు. ఆ మరుసటి రోజు విశాఖలో దిగారు. అందరూ కొత్త సంవత్సర వేడుకలను చేసుకున్నారు. శనివారం సింహాచలం వెళ్లి దర్శనం చేసుకున్నారు. రైలు టికెట్లు దొరక్కపోవడంతో ప్రయాణాన్ని ఓ రోజు వాయిదా వేసుకున్నారు. ఆదివారం ఉదయం ఆర్కే బీచ్‌కు వెళ్లారు. కాసేపు ప్రైవేటు బోట్‌లో సముద్రంలో విహరించారు. బీచ్‌ రోడ్డులో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పవన్‌ మినహా మిగిలినవారు సరదా గడపడానికి సముద్రంలో దిగారు. చెండి శివకుమార్‌, అజీజ్‌, కోట శివకుమార్‌ కొంచెం లోపలకు వెళ్లారు. ఆ సమయంలో పెద్ద కెరటం రావడంతో నీటిలో గల్లంతయ్యారు. మిగిలిన వారు కేకలు వేస్తూ తీరం వైపు వచ్చారు. బీచ్‌లో ఉన్న ఒక సందర్శకుడు సముద్రంలోకి దూకి చెండి శివకుమార్‌ను బయటకు తీసుకువచ్చారు. కొనఊపిరితో ఉన్న అతడ్ని హోంగార్డులు నాయుడు, కుమార్‌ సాయంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందాడు. గల్లంతైన కోట శివకుమార్‌, అజీజ్‌ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రమాద ఘటన తెలియడంతో సికింద్రాబాద్‌ రసూల్‌పురా ఇందిరమ్మనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు, గల్లంతైన యువకుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 


సివిల్స్‌ కోచింగ్‌ విద్యార్థిని మృతి

ఒడిశాలోని భద్రక్‌ జిల్లా డోలాసాహి గ్రామానికి చెందిన సుస్మితా త్రిపాఠి(21) ఇటీవల డిగ్రీ పూర్తిచేసి, సివిల్స్‌ కోచింగ్‌ కోసం భువనేశ్వర్‌లో ఉంటున్నారు. ఆమె తండ్రి గణేశ్‌ త్రిపాఠి గుజరాత్‌లోని ఒక కాటన్‌మిల్‌లో పనిచేస్తున్నారు. తల్లి లక్ష్మీత్రిపాఠి గృహిణి. కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొనేందుకు సుస్మితా త్రిపాఠి, ఆమె దగ్గర బంధువులు శారదా పాణిగ్రాహి, శ్వేతామిశ్రా భువనేశ్వర్‌ నుంచి రైలులో 1వ తేదీన విశాఖ చేరుకున్నారు. ఆదివారం ఆర్కేబీచ్‌కు వెళ్లారు. శారద ఒడ్డున ఉండగా సుస్మిత, శ్వేతామిశ్రా సముద్రంలో దిగారు. పెద్దకెరటం రావడంతో సుస్మిత సముద్రంలో మునిగిపోయింది. కాపాడాలంటూ శ్వేతా మిశ్రా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న కమ్యూనిటీ గార్డులు, మెరైన్‌ పోలీసులు వచ్చి గాలించారు. కొద్దిసేపటి తర్వాత సుస్మిత మృతదేహం లభించింది.



Updated Date - 2022-01-03T07:41:02+05:30 IST