కాపాడేందుకు ఫేక్‌ తంటాలు!

ABN , First Publish Date - 2022-08-19T07:33:38+05:30 IST

‘డర్టీ పిక్చర్‌’ వివాదాన్ని పోలీసు అధికారులు మరిన్ని మలుపులు తిప్పుతున్నారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను కాపాడే ప్రయత్నంలో కొత్త కొత్త సందేహాలకు వారే తెరలేపుతున్నారు.

కాపాడేందుకు ఫేక్‌ తంటాలు!

  • అనూహ్యంగా తెరపైకి సీఐడీ చీఫ్‌
  • అమెరికా ల్యాబ్‌ రిపోర్టు ఫేక్‌ అని వెల్లడి
  • ఈ-మెయిల్‌తో ఆరా.. అనుకూలాంశాలే బయటికి
  • ఆ వీడియో ‘అసలుదే’ అని తేల్చిన ఎక్లిప్స్‌ ల్యాబ్‌
  • రిపోర్టులో స్వల్ప మార్పులు కోరారని స్పష్టీకరణ
  • అవి తాను చేసేలోపు వారే చేశారన్న స్టాఫర్డ్‌
  • అందుకే... ‘ఫేక్‌’ అని తేల్చేసిన సీఐడీ చీఫ్‌
  • ఒరిజినల్‌ రిపోర్ట్‌ను బయటపెట్టని వైనం


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘డర్టీ పిక్చర్‌’ వివాదాన్ని పోలీసు అధికారులు మరిన్ని మలుపులు తిప్పుతున్నారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను కాపాడే ప్రయత్నంలో కొత్త కొత్త సందేహాలకు వారే తెరలేపుతున్నారు. ఈ నెల 4వ తేదీన బయటపడిన నగ్న వీడియో అంశాన్ని జనం మరిచిపోవాలనుకున్నా... ‘మేం మరిచిపోనివ్వం’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గురువారం సీఐడీ అదనపు డీజీ సునీల్‌ కుమార్‌ అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చారు. ‘గోరంట్ల మాధవ్‌ వీడియో అసలైనదే’ అంటూ టీడీపీ నేతలు అమెరికాకు చెందిన ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్స్‌ సంస్థ ఇచ్చిన నివేదికను బయటపెట్టిన సంగతి తెలిసిందే. అయితే... ఈ రిపోర్టు ‘ఫేక్‌’ అని సునీల్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ‘మీ పేరుతో ఒక ఫేక్‌ రిపోర్టు ప్రచారమవుతోంది. ఆ సంగతేమిటి?’ అని ఆయన పంపిన ఈ-మెయిల్‌కు ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్స్‌ సంస్థ నిపుణుడు జిమ్‌ స్టాఫర్డ్‌ బదులిచ్చారు. ‘వీడియో అసలైనదే. కానీ... రిపోర్టు ఒరిజినల్‌ కాదు’ అని స్పష్టం చేశారు. కానీ... సీఐడీ చీఫ్‌ ఇందులో తమకు అనుకూలమైన అంశాలనే బయటపెట్టారు.


ఆ విషయం జోలికి వెళ్లకుండా... 

‘‘ఒక ఫోన్‌లో ప్లే అవుతున్న దృశ్యాలను మరో ఫోన్‌లో రికార్డు చేశారు కాబట్టి... ఆ వీడియో ఒరిజినల్‌ కాదు! ఒరిజినల్‌ దొరికితేనే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించగలం’ అని ఇప్పటికే అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప చెప్పేశారు. తద్వారా... డర్టీ పిక్చర్‌ కథను అప్పుడే సుఖాంతం చేసేశారు. కానీ... అమెరికాలో ఉంటున్న పోతిని ప్రసాద్‌ అనే వ్యక్తి అక్కడ పేరుగాంచిన ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్స్‌కు మాధవ్‌ న్యూడ్‌ వీడియో పంపి... అది అసలుదేనా? లేక ఎడిటింగ్‌ జరిగిందా? అని అడిగారు. ‘ఆ వీడియో అథెంటిక్‌, అన్‌ ఎడిటెడ్‌’ అని ఎక్లిప్స్‌ సంస్థ తేల్చి చెప్పింది. దీంతో... మాధవ్‌ను వెనకేసుకొస్తున్న పోలీసులు, అధికార పార్టీ నేతలు ఇరకాటంలో పడ్డారు. మరోసారి రాష్ట్రవ్యాప్తంగా దుమారం చెలరేగడంతో దిక్కుతోచని వైసీపీ ప్రభుత్వం ఆ సర్టిఫికెట్‌ సంగతి తేల్చమంటూ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ను ఆదేశించినట్లు తెలిసింది. 


ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న సీఐడీ ఏడీజీ ఎక్లిప్స్‌కు మెయిల్‌ పంపడంలో తన చాతుర్యాన్ని ప్రదర్శించారు. ‘మీ పేరుతో సర్కులేట్‌ అవుతోన్న ఒక ఫేక్‌ సర్టిఫికెట్‌ గురించి’ అంటూ  ఎక్లిప్స్‌కు వివరణ పంపించారు. ఈ-మెయిల్‌లో ఇంకా ఎలాంటి వివరణలు కోరారో తెలియదు కానీ... అక్కడి నుంచి వచ్చిన సమాధానంలో తమకు అనుకూలమైన అంశాలను మాత్రం బయటికి వెల్లడించారు. ఆ వ్యాఖ్యలను స్కెచ్‌తో హైలైట్‌ చేసి చూపించారు. పోతిని ప్రసాద్‌ తమకు అందించిన వీడియో అసలుదేనని, ఎలాంటి ఎడిటింగ్‌లు జరగలేదని సీఐడీకి పంపించిన ఈ-మెయిల్‌లోనూ జిమ్‌ స్టాఫర్డ్‌ స్పష్టం చేశారు. ఒక ఫోన్‌లో ప్లే అవుతున్న దృశ్యాలను మరో ఫోన్‌లో చిత్రీకరించిన వీడియో తమకు అందిందన్నారు. అయితే.. తొలి ఫోన్‌లో ప్లే అవుతున్న వీడి యో పరీక్షించాలని తనను పోతిని ప్రసాద్‌ కోరలేదని, దానిని పరిశీలించకుండా అది అసలుదో, కాదో చెప్పలేనని వెల్లడించారు. సీఐడీ చీఫ్‌ ఈ అంశాన్నే ‘హైలెట్‌’ చేశారు. కానీ.. తమకందిన వీడియో అసలుదే అని ఎక్లిప్స్‌ సంస్థ చెప్పిన పాయింట్‌ను విస్మరించారు.మరి ఒరిజినల్‌ రిపోర్ట్‌ ఏదీ?

‘మాకు అందిన వీడియో అసలైనదే’ అని ఎక్లిప్స్‌ సంస్థ స్పష్టంగా చెప్పినప్పటికీ... దీనికి సంబంధించి టీడీపీ నేతలు బయటపెట్టిన రిపోర్టు ‘ఫేక్‌’ అని సీఐడీ చీఫ్‌ ఒక్క ముక్కలో తేల్చేశారు. దీనికి ఆయన చెప్పిన కారణం... ఆ రిపోర్టులో పోతిని ప్రసాద్‌ మార్పులు చేర్పులు చేయడమే! ఈ-మెయిల్‌లో జిమ్‌ స్టాఫర్డ్‌ ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. తాను ఇచ్చిన నివేదికలో స్వల్ప మార్పులు చేయాలని పోతిని ప్రసాద్‌ కోరారని, ఆ పని తాను చేసేలోగా ఆయనే మార్పులు చేశారని తెలిపారు. అవి తిమ్మిని బమ్మి చేసేంత పెద్దపెద్ద మార్పులు కావని కూడా స్పష్టం చేశారు. అయినా సరే... ఆ మార్పులేవో తాను చేసేదాకా ఆగకుండా, పోతిని ప్రసాద్‌ స్వయంగా చేసుకున్నందున ‘సర్క్యులేట్‌ చేసిన రిపోర్టు ఒరిజినల్‌ కాదు’ అని జిమ్‌ స్టాఫర్డ్‌ చెప్పారు. దీని ఆధారంగానే... ‘ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్స్‌ ఇచ్చిన రిపోర్టు ఫేక్‌’ అని సునీల్‌ కుమార్‌ పేర్కొన్నట్లుగా భావించాలి. అసలు విషయం ఏమిటంటే... ఈ-మెయిల్‌తోపాటు ఒరిజినల్‌ రిపోర్టును కూడా జిమ్‌ స్టాఫర్డ్‌ జత చేశారు. 


దీనిని మాత్రం సీఐడీ చీఫ్‌ బయటపెట్టలేదు. మొత్తంగా చూస్తే... గోరంట్ల మాధవ్‌కు సంబంధించి సర్క్యులేట్‌ అవుతున్న నగ్న వీడియో నిజమే అని ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ స్పష్టం చేసింది. అదే సమయంలో... తన నివేదికలో ‘అనుమతించ దగిన స్వల్ప మార్పులు’ చేయాలని మాత్రమే పోతిన ప్రసాద్‌ కోరినట్లు జిమ్‌ స్టాఫర్డ్‌ సమాధానంతో అర్థమవుతోంది. అయినా సరే... అది ఒరిజినల్‌ వీడియో కా దు, ఆ రిపోర్ట్‌ ఫేక్‌ అంటూ ప్రభుత్వం తమకు అనుకూలమైన వాదనను సీఐడీ చీఫ్‌ ద్వారా వినిపించడం విశేషం. మాధవ్‌ నగ్న వీడియో ఉందా? లేదా? అనే దానిపై దర్యాప్తు చేయడం లేదని అడిగితే... అది అనంతపురం ఎస్పీని అడగాలని సునీల్‌ బదులిచ్చారు. 


మహిళా కమిషన్‌ ఆదేశాలేమైనట్లు?

మాధవ్‌ న్యూడ్‌ వీడియో వ్యవహారంలో నిజా నిజా లు నిగ్గు తేల్చాలంటూ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ రాష్ట్ర డీజీపీకి ఒక లేఖ రాశారు. ఈ  ఆదేశాలను పోలీసు శాఖ పట్టించుకుందా? లేదా? అనేది ఇప్పుడు ప్రశ్న. మూడు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఒక సర్టిఫికెట్‌ ఒరిజినలా.. కాదా... అని అమెరికాలో ఉన్న సంస్థను సంప్రదించి సీఐడీ సమాధానం తెప్పించుకుంది. మరి... మహిళా కమిషన్‌ లేఖ రాసి పది రోజులైనా స్పందన కనిపించడంలేదు.


ఇదీ ఆ ఈ-మెయిల్‌

సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌కు జిమ్‌ స్టాఫర్డ్‌ పంపి న ఈ-మెయిల్‌(యథాతథంగా) ‘‘ప్రసాద్‌ పోతిని అనే వ్యక్తి పంపిన వీడియోను పరీక్షించాను. ఈ వీడియో నిజమా, కాదా నిర్ధారించాలని కోరారు. అది... ఒక మొబైల్‌ ఫోన్‌లో ప్లే అవుతున్న దృశ్యాలను మరో మొ బైల్‌ ఫోన్‌ ద్వారా రికార్డు చేసిన వీడియో. మాకు అం దించిన వీడియో నిజమైనదే. అందులో ఎలాంటి మా ర్పు చేర్పులు లేవు.(అథెంటిక్‌ అండ్‌ అన్‌ ఎడిటెడ్‌). అయితే... మొదటి మొబైల్‌ ప్లే అవుతున్న వీడియో ఆథెంటిసిటీని నిర్ధారించాలని నన్ను అడగలేదు. అలాగే... దానిపై నా అభిప్రాయం కోరలేదు. దానిని పరిశీలించకుండా అది నిజమైనదో, కాదో నేను చెప్పలేను. నివేదికలో రెండు స్వల్ప మార్పులు చేయాలని ప్రసాద్‌ పోతిని కోరారు. అయితే.. ఆ మార్పులు చేసి, తదుపరి నివేదిక ఇచ్చేదాకా ఆయన ఆగలేదు. అవి ఆయనే చేసి సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ చేశారు. ఆ తర్వాత ఈ అంశంపై చాలా సందేశాలు వచ్చాయి. అప్పుడే ఇదంతా నా దృష్టికి వచ్చింది. రిపోర్టులో చేసిన మార్పులు అంత ముఖ్యమైనవి కాకపోయినప్పటికీ... సర్క్యులేట్‌ అయిన రిపోర్టు ఒరిజినల్‌ కాదు. ఒరిజినల్‌ రిపోర్టును ఈ-మెయిల్‌తోపాటు జత చేస్తున్నాను!’’

Updated Date - 2022-08-19T07:33:38+05:30 IST