కేంద్రానిదే ‘పవర్‌’!

ABN , First Publish Date - 2022-09-15T07:53:38+05:30 IST

కేంద్రానిదే ‘పవర్‌’!

కేంద్రానిదే ‘పవర్‌’!

కరెంటు సరఫరాలోకి ప్రైవేటు సంస్థలు

విద్యుత్‌ సవరణ చట్టానికి రాష్ట్రం ‘సై’!?

అసెంబ్లీలో ఆమోదించేందుకు సిద్ధం!

ఆపై కేంద్రం జాబితాలోకి ‘విద్యుత్తు’

సరఫరా రంగంలోకి ప్రైవేటు సంస్థలు

స్మార్ట్‌ ‘ప్రీపెయిడ్‌’ మీటర్లు ఏర్పాటు

ఖర్చుల ఆధారంగా ప్రతినెలా బాదుడు

ఈఆర్‌సీ అధికారాలన్నీ గల్లంతు


ఇక ‘పవర్‌’ మొత్తం కేంద్రానిదే! పెత్తనమంతా ప్రైవేటుదే! పొరుగు రాష్ట్రమైన తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న ‘కేంద్ర విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు’ను మన రాష్ట్రం సగౌరవంగా స్వీకరిస్తోంది. గురువారం మొదలుకానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే.. నెలనెలా విద్యుత్‌ చార్జీల మోత మోగుతుంది. కేంద్ర విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు పరిణామాలు, ప్రభావాలపై నిపుణులు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే... జగన్‌ సర్కారు దీనిపై ముందుకే వెళుతున్నట్లు సమాచారం.


‘ఉచితాల’ మాటేమిటి?

ప్రస్తుతం రాష్ట్రాలు వ్యవసాయం సహా అనేక రంగాలకు ఉచితంగా లేదా సబ్సిడీతో విద్యుత్‌ సరఫరా చేస్తున్నాయి. సబ్సిడీకి సంబంధించిన బిల్లులు ఏడాదికో, రెండేళ్లకో ఒకసారి డిస్కమ్‌లకు అందిస్తున్నాయి. ఇది డిస్కమ్‌లకు మోయలేని భారంగా మారింది. విద్యుత్‌ సవరణ చట్టం అమలులోకి వస్తే... ఇలాంటివేవీ కుదరదు. కేంద్రం ‘ఉచిత’ సరఫరాను వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు భరించేందుకు సిద్ధమైనా... ప్రతినెలా క్రమం తప్పకుండా ఆ మొత్తాన్ని సరఫరా సంస్థలకు చెల్లించాల్సిందే.



(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఇప్పటిదాకా విద్యుత్‌ రంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి  జాబితాలో ఉంది. దీనిని పూర్తిగా కేంద్రం సొంతం చేసుకునే దిశగా... ‘కేంద్ర విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు’ను రూపొందించింది. ముసాయిదా బిల్లును ఆమోదించి పంపాలని, తమ అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తెస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు... బీజేపీ పట్ల అనుకూలంగా వ్యవహరిస్తున్న రాష్ట్రాలు ఈ బిల్లుకు ‘సరే’ అంటున్నాయి. ఇందులో ఏపీ సర్కారు కూడా ఉంది. వాస్తవానికి ఈ నెల 11వ తేదీలోగా రాష్ట్రాలు తమ అభిప్రాయాలను వెల్లడించాల్సి ఉంది. గురువారం నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో... కేంద్రం పంపిన విద్యుత్‌ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిసింది. బిల్లులు, చట్టాలకు సంబంధించి కేంద్ర ఆకాంక్షలు, ఆదేశాలకు ‘నో’ చెప్పేందుకు జగన్‌ సర్కారు సాహసించడంలేదు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలన్న కేంద్ర సూచనను... పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, ఒడిసా వ్యతిరేకిస్తున్నాయి. మన రాష్ట్రం మాత్రం దీనికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. ఇదే క్రమంలో కేంద్ర విద్యుత్‌ సవరణ చట్టం-2022ను కూడా రాష్ట్రం ఆమోదించడం ఖాయమని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేంద్ర విద్యుత్‌ సవరణ చట్టం-2022 అమలులోకి వస్తే... ఈ రంగం పూర్తిగా కేంద్రం పరిధిలోకి వెళుతుంది. ఇప్పటిదాకా విద్యుదుత్పత్తి రంగంలో మాత్రమే ఉన్న ప్రైవేటు సంస్థలు, ఇకపై సరఫరాలోనూ అడుగు పెడతాయి. ఎప్పటికప్పుడు... ప్రతినెలా... చార్జీల బాదుడు ఉంటుంది. ప్రైవేటు సంస్థలు విద్యుత్‌ కొనుగోలు/ఉత్పత్తి, పంపిణీకి అయ్యే ఖర్చును లెక్కించి... విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) అనుమతి లేకుండానే నేరుగా నెలవారీ బిల్లులో ట్రూఅప్‌ చార్జీలను కలిపేయవచ్చు. పెట్రోలు, డీజిల్‌ ధరలను రోజువారీగా సవరించినట్లుగానే.. విద్యుత్‌కు సంబంధించి బొగ్గు తదితర ముడి సరుకుల ధరలు, ఖర్చుల ఆధారంగా ప్రతినెలా బిల్లులు పెంచేస్తారు. ఇప్పటి వరకూ ప్రతీ ఏటా విద్యుత్‌ టారిఫ్‌ ప్రతిపాదనలను ఈఆర్‌సీ ఆమోదించిన తర్వాతే అమలు చేస్తున్నారు. కేంద్ర విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందితే.. ఈఆర్‌సీ నామమాత్రం కానుంది. విద్యుత్‌ సరఫరా, పంపిణీ సంస్థలే చార్జీలను నిర్ణయించి, నేరుగా వినియోగదారుల నుంచి వసూలు చేసుకుంటాయి. అంతేకాదు... మనం వాడబోయే విద్యుత్తుకు ముందుగానే డబ్బులు చెల్లించాలి. దీనికి అనుగుణంగా ‘ప్రీ పెయిడ్‌’ విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేస్తారు. తొలి దశలో 500 యూనిట్లు దాటే గృహ విద్యుత్‌ వినియోగదారులకు స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు పెడతారు. మొత్తంగా... ఈ విధానంతో కేంద్రం ‘పవర్‌’, ప్రైవేటు సంస్థల పెత్తనం పెరుగడం తప్ప... వినియోగదారులకు ఒరిగేదేమీ ఉండదు. పైగా... బాదుడే బాదుడు! 

Updated Date - 2022-09-15T07:53:38+05:30 IST